Shobu Yarlagadda Vs Resul Pookutty Over RRR Movie: భారతీయ బాక్సాఫీస్ దగ్గర 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమా ఎన్ని రికార్డులు సృష్టించిందో తెలిసిందే. ఓటీటీలో విడుదలైన తర్వాత వసూళ్లను మించిన ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా ఫారినర్స్ నుంచి! పలువురు హాలీవుడ్ ప్రముఖులు ఓటీటీలో 'ఆర్ఆర్ఆర్' చూశాక ట్వీట్లు చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటన... రాజమౌళి దర్శకత్వ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు.
 
మెజారిటీ ఆడియన్స్ నుంచి 'ఆర్ఆర్ఆర్' ప్రశంసలు అందుకోవడాన్ని పక్కన పెడితే...  సినిమాను విమర్శిస్తున్న ప్రజలూ ఉన్నారు. విదేశీ ప్రేక్షకులు కొందరు 'ఆర్ఆర్ఆర్'ను గే లవ్ స్టోరీ (ఇద్దరు మగవారి మధ్య ప్రేమకథ)గా వర్ణిస్తున్నారు. అయితే... ఆస్కార్ పురస్కార గ్రహీత, ప్రముఖ సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి సైతం 'గే లవ్ స్టోరీ' అన్నారు. దాంతో 'బాహుబలి' నిర్మాతలలో ఒకరైన శోభు యార్లగడ్డ ఘాటుగా స్పందించారు. 


RRR Movie Controversy Over Gay Love Story Comments: ''మీరు అన్నట్టుగా 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ అని అనుకోవడం లేదు. ఒకవేళ అయితే  తప్పేంటి? అదేమైనా మంచి విషయం కాదా? మీ మాటలను ఎలా సమర్థిస్తారు? ఎంతో ఘనత సాధించిన మీలాంటి వ్యక్తి (రసూల్ పూకుట్టి) ఇంత కిందకు దిగజారడం తీవ్ర నిరాశకు గురి చేసింది'' అని శోభు యార్లగడ్డ స్పందించారు. దీనికి కారణం ఏంటంటే... ''లాస్ట్ నైట్ 'ఆర్ఆర్ఆర్' అనే చెత్తలో 30 మినిట్స్ చూశా'' అని బాలీవుడ్ డైరెక్టర్ మునీష్ భరద్వాజ్ ట్వీట్ చేస్తే... దానికి 'గే లవ్ స్టోరీ' అని రసూల్ పూకుట్టి రిప్లై ఇవ్వడమే!


Also Read : ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ - ఇదిగో క్లారిటీ!






శోభు యార్లగడ్డ ట్వీట్ తర్వాత రసూల్ స్పందించారు. ''ఒకవేళ 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ అయినా తప్పేం లేదు. నేను నా స్నేహితుడికి రిప్లై ఇచ్చాను... అదీ పబ్లిక్ డొమైన్ లో ఉన్న చర్చ గురించి చెప్పాను తప్ప అంతకు మించి ఏమీ లేదు. ఇందులో దిగజారడం ఏమీ లేదు. నువ్వు సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదు శోభు. ఎవరినీ కించపరిచే ఉద్దేశం లేదు. ఇంతటితో నేను ముగిస్తున్నాను'' అని శోభు యార్లగడ్డ ట్వీట్‌కు రసూల్ పూకుట్టి సమాధానం ఇచ్చారు. అదీ సంగతి! ఈ చర్చతో ఇక 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ అనే కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా? అంటే... వెయిట్ అండ్ సీ!  


Also Read : నరేష్ తో రూమర్స్ - సినిమా ఛాన్స్ లు పోగొట్టుకున్న పవిత్ర?