బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్, 'దీవానా' అనే సినిమాతో బిగ్ స్క్రీన్ మీదకు ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 1992 జూన్ 25న విడుదలైంది. బాద్ షా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 31 ఏళ్ళు పూర్తైన నేపథ్యంలో, ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు. ఈ సందర్భంగా షారుక్ ట్విట్టర్ వేదికగా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, చిట్ చాట్ నిర్వహించారు. 






''వావ్.. 'దీవానా' తెరపైకి వచ్చిన రోజుకి 31 ఏళ్లు అని ఇప్పుడే గ్రహించారు. ఇది చాలా మంచి రైడ్‌. అందరికీ ధన్యవాదాలు. 31 నిమిషాలు ఏమైనా అడగొచ్చు'' అని షారుక్ ఖాన్ ట్వీట్ చేశారు. దీనికి ఫ్యాన్స్ నుంచి అనూహ్యమైన స్పందన లభించింది. ట్విట్టర్ ఫీడ్ అంతా అభిమానుల ప్రశ్నలతో నిండిపోగా, SRK వాటికి తనదైన శైలిలో సమాధానాలిచ్చారు. ఈ క్రమంలో గర్భవతి అయిన ఓ మహిళా అభిమాని అడిగిన ప్రశ్నకు కింగ్ ఖాన్ ఇచ్చిన రిప్లై అందరి దృష్టిని ఆకర్షించింది. 


ఆమె ట్వీట్ చేస్తూ ''సార్, నేను కవల పిల్లలతో గర్భవతిగా ఉన్నాను. నేను వారికి పఠాన్, జవాన్ అని పేరు పెట్టే అదృష్టం కలగాలని కోరుకుంటున్నాను'' అని పేర్కొంది. దీనికి షారుఖ్ స్పందిస్తూ, ''ఆల్ ది బెస్ట్. కానీ దయచేసి వారికి ఏవైనా మంచి పేర్లు పెట్టండి!!'' అని బదులిచ్చారు. పఠాన్, జవాన్ అనేవి SRK సినిమాలనే విషయం అందరికీ తెలుసు. ఆయన మీద అభిమానంతోనే ఆమె తన ఇద్దరు పిల్లలకు ఆ పేర్లు పెట్టాలని ఆశ పడుతున్నట్లు చెప్పింది. షారుక్ మాత్రం వాటి కంటే మంచి పేర్లు పెట్టమని సూచించారు. 






షారుక్ తన #AskSRK సెషన్‌ లో ఫన్నీ, ఉల్లాసకరమైన సమాధానాలతో పాటు, కొన్ని ఆసక్తికరమైన సమాధానాలు కూడా ఇచ్చారు. డబ్బు, కీర్తి, విలువలు.. వీటికి మీరు ఎలా అధిక ప్రాధాన్యత ఇస్తారు? అని అడగ్గా.. ''మొదట విలువలు. మిగతావన్నీ దాన్ని అనుసరిస్తాయి'' అని చెప్పారు. '57 ఏళ్ల వయసులో ఇన్ని యాక్షన్ స్టంట్స్ చేయడం వెనుక రహస్యం ఏంటి సార్?' అని ప్రశ్నించగా.. ''పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడమే బాయ్'' అని ఫన్నీ ఆన్సర్ ఇచ్చారు కింగ్ ఖాన్. తన స్నేహితుడికి 'జవాన్' చిత్రంలో ఒక పాత్ర కావాలని ఓ నెటిజన్ అడగ్గా.. అలా జరగదని దోస్త్ కి ప్రేమతో వివరించమని షారుక్ బదులిచ్చారు. 


'మీరు నాతో కలిసి స్మోక్ చేయాలనుకుంటున్నారా సార్?' ఓ ఫ్యాన్ ట్వీట్ చేయగా.. చెడు అలవాట్లను నేను ఒంటరిగానే చేస్తాను అని అన్నారు. 'దీవానా' సెట్ లో మీరు ఎప్పటికీ మరచిపోలేని ఒక విషయం చెప్పమని అడగ్గా.. హీరోయిన్ దివ్య భారతి జీ, రాజ్‌జీ తో కలిసి పని చేయడం అని పేర్కొన్నారు షారుక్. ఇంక చివరగా ట్వీట్ చేస్తూ ''ఇప్పుడు లిటిల్ వన్‌ తో ఫుట్‌ బాల్ గురించి చర్చించబోతున్నాను. సడెన్ గా అతనితో గడిపే సమయం దొరికింది. నేను దానిని కోల్పోలేను. మీ అందరినీ ప్రేమిస్తున్నాను. మరో 31 సంవత్సరాలు సినిమాల్లో ఉంటాను'' అంటూ చిట్ చాట్ ముగించారు. 


ఇక సినిమాల విషయానికొస్తే, గత కొన్నేళ్లుగా వరుస ప్లాప్స్ లో ఉన్న షారుక్ ఖాన్.. 'పఠాన్' సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు. ఇది వసూళ్ల పరంగా 2023లో ఇప్పటి వరకు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. SRK ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో 'జవాన్' అనే సినిమా చేస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ లో దాదాపు 250+ కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ సెప్టెంబర్ 7వ తేదీన విడుదల కానుంది. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, సన్యా మల్హోత్రా, ప్రియమణి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీని తర్వాత రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో 'డుంకి' సినిమా చేయనున్న కింగ్ ఖాన్.. సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'టైగర్ 3' మూవీలో క్యామియో అప్పీరియన్స్ ఇవ్వనున్నారు. 


Read Also: ‘ధీర’గా వస్తున్న అఖిల్ - బడ్జెట్ విషయంలో రాజీ పడటం లేదట!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial