నాగార్జున వారుసుడుగా వచ్చిన అక్కినేని అఖిల్ ఇప్పటి వరకు 5 సినిమాలు చేశాడు. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. అన్నింటికి అన్నీ భారీ డిజాస్టర్లుగా మిగిలాయి. తన రీసెంట్ మూవీ ‘ఏజెంట్’తో సాలిడ్ హిట్ అందుకోవాలి అనుకున్నా, ప్రేక్షకులను అలరించడంలో ఈ సినిమా ఘోరంగా విఫలం అయ్యింది. పాన్ ఇండియా రేంజిలో సత్తా చాటుతుందనే ప్రచారం జరిగినా, అఖిల్ కెరీర్‌లోనే భారీ డిజాస్టర్ గా నిలిచిపోయింది.
భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న అఖిల్ ఫాంటసీ అడ్వెంచర్ మూవీ
ఇప్పుడిప్పుడే ‘ఏజెంట్’ షాక్ నుంచి బయటకు వచ్చిన అఖిల్, తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టాడు. ఫాంటసీ అడ్వెంచర్ కథాంశంతో ఓ సినిమా చేయబోతున్నాడు. ప్రభాస్ 'సాహో' చిత్రానికి దర్శకత్వ శాఖలో పని చేసిన అనిల్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల అనిల్.. అఖిల్‌కు ఓ కథ వినిపించారట. అది తనకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడట. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. అంతేకాదు, ఈ సినిమాకు ‘ధీర’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.
ప్రతిష్టాత్మకంగా ‘ధీర’ మూవీని నిర్మిస్తున్న UV క్రియేషన్స్
అఖిల్ హీరోగా చేయబోతున్న ఈ భారీ అడ్వెంచరస్ మూవీని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతుంది. బడ్జెట్ కు ఏమాత్రం వెనుకాడకుండా ఈ సినిమాను తెరకెక్కించాలని భావిస్తోంది. ఇప్పటికే బడ్జెట్ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదని దర్శకుడికి యూవీ క్రియేషన్స్ సంస్థ చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ ఇప్పటికే ఓకే అయ్యిందట. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఈ చిత్రంలో అఖిల్ సరసన నటించబోతుందట. జాన్వీ ప్రస్తుతం తెలుగులో ఓ సినిమా చేస్తోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల కాంబోలో వస్తున్న సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తోంది. ఆ చిత్రం తర్వాత తను చేస్తున్న రెండో సినిమా ‘ధీర’ కావడం విశేషం. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
‘ఏజెంట్’ డిజాస్టర్ తర్వాత అఖిల్ కీలక ప్రకటన
ఈ భారీ ఫాంటసీ అడ్వెంచర్ మూవీతోనైనా అఖిల్ మంచి హిట్ అందుకుంటాడో? లేదో? చూడాలి. ఈ సినిమా అటు ఇటు అయితే, అఖిల్ కెరీర్ ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందంటున్నారు సినీ పెద్దలు. కానీ, ‘ఏజెంట్’ డిజాస్టర్ తర్వాత అఖిల్ కీలక ప్రకటన చేశాడు. స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇస్తానని సినీ అభిమానులకు ప్రామీస్ చేశాడు. ఆ హామీతోనైనా ఈ సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు అభిమానులు. ‘ఏజెంట్’ మూవీ ప్రేక్షకులను అలరించలేకపోయినందుకు అఖిల్ క్షమాపణలు చెప్పాడు. "’ఏజెంట్’ మూవీ కోసం మా స్థాయిలో అత్యుత్తమంగా ప్రయత్నించినప్పటికీ, దురదృష్టవశాత్తూ మేము అనుకున్న విధంగా ఈ చిత్రాన్ని స్క్రీన్ మీద ఆవిష్కరించలేకపోయాం. ఈ సినిమా విషయంలో నాకు సపోర్టు చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అభిమానులు, శ్రేయోభిలాషులు ఇస్తున్న ప్రేమ కారణంగానే నేను కష్టపడి పని చేస్తున్నాను. అందుకు మీ అందరికీ థ్యాంక్స్. నాపై నమ్మకం పెట్టుకున్న వారి కోసం నేను స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇస్తాను" అని అఖిల్ చెప్పుకొచ్చాడు.
Read Also: 'జెంటిల్ మేన్' నుంచి 'రోబో' వరకు - కమల్ హాసన్ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలివే
Join Us on Telegram: https://t.me/abpdesamofficial