భారతదేశం గర్వించదగ్గ నటులలో కమల్ హాసన్ ఒకరు. నాలుగేళ్ళ ప్రాయంలోనే 'కళత్తూర్ కన్నమ్మ' (1960) అనే సినిమాతో అరంగేట్రం చేసిన ఆయన, గత ఆరు దశాబ్దాలుగా తన విలక్షణమైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఎలాంటి పాత్ర అయినా పరకాయ ప్రవేశం చేసే కమల్.. ఇన్నేళ్ల తన కెరీర్ లో ఎన్నో ఆణిముత్యాలాంటి చిత్రాలని అందించారు. మరెన్నో ఘన విజయాలను సొంతం చేసుకున్నారు. అదే సమయంలో ఇతరత్రా కారణాలతో కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను కూడా వదులుకున్నారు. విశ్వ నటుడు రిజెక్ట్ చేసిన ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.


1. జెంటిల్ మేన్: 


యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, మధుబాల హీరో హీరోయిన్లుగా శంకర్ షణ్ముగం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'జెంటిల్మేన్'. ఇది శంకర్ కు డెబ్యూ మూవీ. 1993 లో వచ్చిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించడమే కాదు, ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుంది. నిజానికి దర్శకుడు ముందుగా ఈ స్క్రిప్టును కమల్ హాసన్ కు వినిపించాడట. కథ నచ్చినప్పటికీ ఇతర ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటం వల్ల ఆయన ఈ చిత్రాన్ని తిరస్కరించారు. దీంతో అర్జున్ తో ప్రాజెక్ట్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లారు శంకర్. అయితే 1996 లో కమల్ తో 'భారతీయుడు' చిత్రాన్ని తెరకెక్కించి, భారీ విజయాన్ని అందుకున్నారు.


2. ఒకే ఒక్కడు:


1999లో డైరెక్టర్ శంకర్, హీరో అర్జున్ కాంబినేషన్ లో రూపొందిన పొలిటికల్ డ్రామా 'ముధల్వాన్'. ఇది తెలుగులో 'ఒకే ఒక్కడు' పేరుతో రిలీజ్ అయింది. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ చిత్రం కూడా ముందు కమల్ వద్దకే వెళ్ళింది. అయితే అప్పటికే 'హే రామ్' సినిమా కమిట్ అవడంతో ఆయన ఈ ప్రాజెక్ట్ లో భాగం కాలేకపోయాడు. కాకపొతే స్క్రిప్టు బాగా నచ్చడంతో, 10 నెలలు వేచి ఉండమని శంకర్ ను కమల్ కోరాడట. కానీ దర్శకుడు అర్జున్ తో సినిమా చేసేశాడు. ఇదిలా ఉంటే కమల్ హసన్ కంటే ముందు రజనీకాంత్, విజయ్ వంటి హీరోలకు శంకర్ ఈ కథ వినిపించినట్లు నివేదికలు ఉన్నాయి.


3. మై హూ నా:


కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ డైరెక్టర్ గా మారి తెరకెక్కించిన సినిమా 'మై హూ నా'. 2004 లో బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్, సుస్మితా సేన్, జాయెద్ ఖాన్ మరియు అమృతా రావు ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం రూపొందింది. ఇందులో సునీల్ శెట్టి పోషించిన మెయిన్ విలన్ పాత్ర కోసం ముందుగా కమల్ హాసన్ ను అనుకున్నారు. షారుక్ స్వయంగా చెన్నై వెళ్లి కమల్ ను సంప్రదించగా, బిజీ షెడ్యూల్ కారణంగా ఆ ఆఫర్ ను తిరస్కరించారు. ఇదే విషయాన్ని షారుఖ్ ఓ ఇంటర్వ్యూలో ధృవీకరించారు.


4. వసూల్ రాజా MBBS - 2:


బాలీవుడ్ హీరో సంజయ్ దత్, డైరక్టర్ రాజ్ కుమార్ హిరానీ కలయికలో వచ్చిన 'మున్నా భాయ్ MBBS' చిత్రాన్ని తమిళ్ లో 'వసూల్ రాజా MBBS' పేరుతో కమల్ హాసన్ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మాతృకకు సీక్వెల్ గా తెరకెక్కిన 'లగే రహో మున్నా భాయ్' రీమేక్ ను కమల్ తో చేయాలని అనుకున్నారు. కానీ గాంధీగిరి బ్యాక్ డ్రాప్ తమిళ్ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుందో లేదో అని ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారు. 


5. రోబో:


సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ 'రోబో'. 2010లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. నిజానికి 2000స్ లో కమల్ హాసన్, ప్రీతి జింటా కలయికలో ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబడింది. కొంత భాగం షూటింగ్ కూడా చేశాడు శంకర్. దీనికి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో అందుబాటులో వున్నాయి. అయితే బడ్జెట్ సమస్యలు, డేట్స్ క్లాష్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నిలిపివేయబడింది. దీంతో దాదాపు పదేళ్ళ తర్వాత రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ లతో శంకర్ ఈ సినిమా పూర్తి చేశాడు. ఇది ఆ యేడాది అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలివడమే కాదు, రెండు నేషనల్ అవార్డ్స్ కూడా గెలుచుకుంది.


6. మర్మయోగి:


కమల్ హాసన్, విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రల్లో 'మర్మయోగి' అనే పీరియాడిక్ సినిమాకు అప్పట్లో శ్రీకారం చుట్టారు. దీనికి కమల్ కథ రాయడమే కాదు, దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకున్నారు. అయితే కొంతభాగం షూటింగ్ జరిగిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇది తమ కెరీర్ లో గొప్ప సినిమా అయ్యేదని, దురదృష్టవశాత్తూ ఈ చిత్రాన్ని మిస్ అయ్యామని కమల్ హాసన్ గతేడాది 'విక్రమ్' తెలుగు ప్రెస్ మీట్ లో అన్నారు.


7. 19 స్టెప్స్:


కమల్ హాసన్, అసిన్ జంటగా '19 స్టెప్స్' అనే ఇండో-జపనీస్ ప్రొడక్షన్ ప్రాజెక్ట్ చేయటానికి ప్రయత్నాలు జరిగాయి. భరత్ బాలా దర్శకత్వంలో వాల్ట్ డిస్నీ వారు ఈ సినిమా నిర్మించనున్నారని నివేదికలు పేర్కొన్నాయి. అయితే కమల్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడంతో, మేకర్స్ అనౌన్స్ మెంట్ కు ముందే ఈ చిత్రాన్ని పక్కన పెట్టేసారట.


ఇలా కమల్ హాసన్ చేయాల్సిన అనేక చిత్రాలు ఆగిపోవడమో, వేరే హీరోల చేతికి వెళ్ళడమో జరిగాయి. మరి ఈ సినిమాలు యూనివర్సల్ స్టార్ చేసి ఉంటే రిజల్ట్ ఎలా ఉండేదో మరి!


Also Read: ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి కొత్త అప్డేట్ - నైట్ ఎఫెక్ట్‌లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్!