అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదంలో రిలీజియన్ ప్రస్తావన వచ్చింది. ఆ అమ్మాయిలు క్రిస్టియన్స్ అయినప్పటికీ వ్యాపారం కోసం తమ మతాన్ని దాచి బొట్టు పెట్టుకుని ఉగాది చేశారని, ప్రజలను మోసం చేశారని సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేశారు. తండ్రి మరణం తర్వాత క్రైస్తవ ఆచారం ప్రకారం ఖననం చేసిన అక్క చెల్లెళ్లు, పచ్చళ్ళ వ్యాపారం కోసం హిందూ ముసుగు వేసుకున్నారని విమర్శించిన వ్యక్తులు ఉన్నారు. ఈ నేపథ్యంలో రమ్య మోక్ష కంచర్ల ఒక వీడియో చేశారు.
మా తల్లిదండ్రులు హిందువులు...
మేము హిందువులమే... శివుడు అంటే ఇష్టం!
తన తల్లి వైపు బంధువులు అందరూ హిందువులే అని, తన తండ్రి వైపు బంధువులు కూడా హిందువులే అని, తాను కూడా హిందూ అని రమ్య మోక్ష కంచర్ల తెలిపారు. అయితే కుటుంబంలో ప్రతి ఒక్కరికి తమ ఇష్ట దైవాన్ని కొలిచే హక్కు ఉందని ఆవిడ చెప్పుకొచ్చారు. తనకు వ్యక్తిగతంగా పరమశివుడు అంటే చాలా ఇష్టమని స్పష్టం చేశారు.
తన తండ్రి జీవితంలో జరిగిన కొన్ని పరిస్థితుల వల్ల ఆయన ఏసుక్రీస్తు మీద నమ్మకం పెంచుకున్నారని, బ్రతికి ఉన్న రోజుల్లో తన మరణం తర్వాత అంతిమ సంస్కారాలు క్రైస్తవ ఆచారం ప్రకారం చేయాలని కోరడంతో తమకు ఆ పద్ధతులు తెలియకపోయినా తండ్రి కోరిక మేరకు ఖననం చేసామని రమ్య మోక్ష వివరించారు. తన తండ్రి అంతిమ సంస్కారాల ఫోటోను పోస్ట్ చేస్తూ వీళ్లు గొర్రె బిడ్డలు అంటూ ట్రోల్ చేస్తున్నారని ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు.
హిందూ సంప్రదాయం ప్రకారమే అక్క పెళ్లి!
''ఏ దేవుడు అయితే ఏమిటి? దేవుళ్ళందరూ ఒక్కటే. నాకు శివుడు అంటే ఇష్టం. మా నాన్నగారికి జీసస్ అంటే ఇష్టం. సమాధి ఫోటోను కూడా ట్రోల్ చేసేంత మెంటాలిటీలో కొంతమంది ఉన్నారు. ఎందుకు అంత దిగజారిపోతున్నారో నాకు అర్థం కావడం లేదు'' అని రమ్య మోక్ష కంచర్ల విమర్శలు చేసే వాళ్ళని ప్రశ్నించారు.
తన తల్లి పేరు వెంకట రమణ కుమారి అని తమ తాతయ్య గారి పేరు వెంకట రత్నం అని, తమ అక్క పేరు వెంకటేశ్వరి అని, తమ అక్క చెల్లెళ్ల సుమ అలేఖ్య రమ్య అని పేర్లు పెట్టారని, తమ కుటుంబంలో చాలామంది ఇష్టదైవం వెంకటేశ్వరుడు అని రమ్య మోక్ష కంచర్ల తెలిపారు. క్రీస్తును నమ్మడానికి ముందు తన తండ్రి శ్రీరాముడి భక్తుడని ఆవిడ వివరించారు.
దేవుళ్ళందరూ తనకు సమానమే అని కొంతమంది ఎందుకు గొర్రె బిడ్డలు అంటూ ట్యాగ్ చేసి మరి విమర్శిస్తున్నారో అర్థం కావడం లేదని రమ్య పేర్కొన్నారు. దైవంలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఉండదని ఎవరి నమ్మకం వారిదని ఆవిడ మాట్లాడారు. ఈ విషయంలో ఎవరిని కించపరిచే విధంగా వ్యవహరించవద్దని ఆవిడ విజ్ఞప్తి చేశారు. సుమ పెళ్లి హిందూ ధర్మం ప్రకారం జరిగిందని ఆ ఫోటోలను రమ్య విడుదల చేశారు. అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారం ఏడాది క్రితం ప్రారంభించామని రెండేళ్ల వెనక్కి వెళితే తన సోషల్ మీడియా ఖాతాలో ఆవులతో పాటు గుడ్లకు సంబంధించిన పోస్టులు ఉంటాయని కావాలంటే వాటిని చెక్ చేసుకోవచ్చని రమ్య మోక్ష తెలిపారు.