Samyuktha Menon: బ్యాక్ టూ బ్యాక్ విజయాలతో దూసుకుపోతున్న మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్.. అనతి కాలంలోనే తెలుగులో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. టాలీవుడ్ లక్కీ చార్మ్ గా పిలవబడుతోన్న ఈ ముద్దుగుమ్మ, ఇప్పుడు కుర్ర హీరోలకు ఫస్ట్ ఛాయిస్ గా మారింది. ప్రస్తుతం ఆమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పటికే శర్వానంద్‌, నిఖిల్ లాంటి యంగ్ హీరోలతో రొమాన్స్ చేస్తున్న సంయుక్త.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన హీరోయిన్ గా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.


గతేడాది 'ఛత్రపతి' హిందీ రీమేక్ తో నిరాశ పరిచిన టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. కాస్త బ్రేక్ తీసుకొని వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో 'టైసన్ నాయుడు' అనే మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే అల్లుడు శీను మరో రెండు ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందులో ఒక సినిమా కోసం సంయుక్త మీనన్ ను కథానాయికగా తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 


బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా మూన్‌ షైన్‌ పిక్చర్స్‌ బ్యానర్ లో ఓ సినిమా తెరకెక్కనుంది. దీంతో లుధీర్ బైరెడ్డి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఇది సైన్స్ ఫిక్ష‌న్, సోషియో ఫాంట‌సీ క‌ల‌గ‌లిపిన థ్రిల్ల‌ర్ జోనర్ సినిమా అని టాక్. రూ. 50 కోట్ల బ‌డ్జెట్ తో భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారట. స్టార్ క్యాస్టింగ్, టాప్ టెక్నిషియన్స్ ఈ ప్రాజెక్ట్ లో భాగం కానున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త మీన‌న్ ని ఎంచుకొన్నారట. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించి, జూన్‌లో లాంఛ‌నంగా ప్రారంభిస్తారని సమాచారం. 


2016లో 'పాప్‌ కార్న్' అనే మలయాళ సినిమాతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన సంయుక్త మేనన్.. 2022లో 'భీమ్లా నాయక్' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ తో చేసిన 'బింబిసార' సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవడంతో వరుస ఆఫర్స్ అమ్మడి తలుపు తట్టాయి. లాస్ట్ ఇయర్ తమిళ్ హీరో ధనుష్ తో కలిసి నటించిన బైలింగ్వల్ మూవీ 'సార్'.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు జోడీగా చేసిన 'విరూపాక్ష' సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. 'డెవిల్: ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్' మూవీ కూడా పర్వాలేదనిపించుకుంది. 


ఇలా సంయుక్త తెలుగులో నటించిన సినిమాలన్నీ విజయం సాధించడంతో ఆమెపై గోల్డెన్ లెగ్ అనే ముద్ర పడిపోయింది. ప్రస్తుతం అమ్మడు తెలుగులో నిఖిల్ సిద్దార్థ హీరోగా తెరకెక్కుతున్న 'స్వయంభూ' అనే పాన్ ఇండియా చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. అలానే 'సామజవరగమన' ఫేమ్ రామ్ అబ్బవరం దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా నటిస్తున్న 'నారీ నారీ నడుమ మురారి' మూవీలో ఒక హీరోయిన్ గా ఎంపికైంది. ఇప్పుడామె వద్దకు బెల్లంకొండ ప్రాజెక్ట్ కూడా వచ్చి చేరినట్లు తెలుస్తోంది. ఇక మలయాళంలో మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబోలో రూపొందుతున్న 'రామ్' సినిమాలోనూ సంయుక్త మీనన్ కీలక పాత్ర పోషిస్తోంది.


Also Read: కింగ్ చుట్టూ ఏపీ రాజకీయాలు - నాగార్జున మద్దతు ఆ పార్టీకేనా? ఆ వార్తల్లో నిజమెంత?