Akkineni Nagarjuna: తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫీవర్ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ తమ ప్రచార అస్త్రాలను సంధిస్తున్నారు. పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఈసారి ఎలక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొంటున్నారు. అనుకూల పార్టీకి మద్దతు ప్రకటిస్తూ, తమ అభ్యర్ధులను గెలిపించేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున చుట్టూ కొన్ని ఫేక్ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి, సీఎం జగన్ మోహన్ రెడ్డికి కింగ్ నాగార్జున తన మద్దతు ప్రకటించినట్లు నిన్న ఉదయం నుంచి ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. "సినిమా వాళ్ళం హైదరాబాద్‌లో ఉంటూ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గురించి మాట్లాడడం సరి కాదు. నన్ను టీడీపీ తరపున మాట్లాడమని ఒత్తిడి తీసుకొచ్చారు. అక్కడ జగన్ గవర్నమెంట్ బాగానే ఉంది. అందుకే ఇండస్ట్రీ నుంచి ఎవరు ముందుకు వచ్చి మాట్లాడడం లేదు" అనేది ఈ ప్రకటన సారాంశం. దీనిపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
జగన్ కు నాగ్ సపోర్ట్ చేస్తున్నారనే దాంట్లో నిజమెంతని అందరూ ఆలోచిస్తున్న తరుణంలో, ఆయన పేరు మీద మరో ప్రకటన బయటకు వచ్చింది. ఇందులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు నాగార్జున మద్దతు తెలిపినట్లుగా ఉంది. "ఈసారి సినిమా వాళ్లు అంతా పవన్ కళ్యాణ్ కు అండగా నిలబడుదాం, లగ్జరీ జీవితం వదిలేసి ప్రజలకోసం పోరాడుతున్నాడు. వైఎస్ జగన్ సినిమా వాళ్లకు చేసిన ద్రోహం ఏ ఒక్క సినీ కార్మికుడు కూడా మరిచిపోడు. కూటమికి ఓటు వేసి గెలిపించండి" అని నాగ్ అన్నట్లుగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇలా హీరో నాగార్జున నుంచి పరస్పరం విరుద్ధమైన రెండు స్టేట్మెంట్ లు వచ్చినట్లు వార్తలు రావడం అభిమానుల్లో, సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఆయన డిజిటల్ టీమ్ నుంచి దీనిపై క్లారిటీ వచ్చింది. నాగ్ ప్రస్తుత రాజకీయాలపై ఎలాంటి ప్రకటన చేయలేదని, ఆ వార్తల్లో నిజం లేదని, అది ఫేక్ న్యూస్ అని స్పష్టం చేశారు. "అక్కినేని నాగార్జునపై వస్తున్న రూమర్ పూర్తిగా అవాస్తవం. దయచేసి ఇలాంటి దుష్ప్రచారాన్ని స్ప్రెడ్ చేయకుండా ఉండవలసిందిగా అందరినీ కోరుతున్నాం" అని ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే నాగార్జున మాదిరిగానే మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల పేర్లతో ఇలాంటి ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. కొందరు నెటిజన్లు కావాలని హీరోల ఫోటోలతో ఎడిటింగ్ చేసిన పోస్టులను నెట్టింట వైరల్ చేస్తున్నారు. కొందరు వైఎస్సార్సీపీకి మద్దతు ప్రకటిస్తున్నట్లుగా, మరికొందరు కూటమికి సపోర్ట్ చేస్తున్నట్లుగా ఫేక్ స్టేట్మెంట్స్ క్రియేట్ చేస్తున్నారు.
ఇక నాగార్జున విషయానికొస్తే, మొదటి నుంచీ ఆయన అన్ని రాజకీయ పార్టీలతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ.. ఇలా అన్ని ప్రధాన పార్టీలకు ప్రచారం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసినట్లే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశారు. ఇక ఆయన పొలిటికల్ ఎంట్రీపై ఎన్నో ఏళ్ల నుంచి వార్తలు వస్తున్నాయి. చివరగా వైసీపీ తరపున విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారని టాక్ నడిచింది. దీనిపై నాగ్ స్పందిస్తూ.. ఎన్నికలొచ్చిన ప్రతీసారి తాను పోటీ చేస్తానని వార్తలు వస్తున్నాయని, తాను ఎక్కడా పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. రాజకీయాలకు దూరంగా ఉన్నానని, మంచి కథ దొరికితే మాత్రం రాజకీయ నాయకుడి పాత్రలో నటించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
Also Read: థియేటర్లో హిట్టు, టీవీలో ఫట్టు - 'సలార్' సినిమాకి డిజాస్టర్ టీఆర్పీ!