ఎన్ని సినిమాలు తీశామన్నది పాయింట్ కాదు.. తీసిన సినిమాలతో ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించామన్నది పాయింట్ అనే మాటను ఇప్పటికే చాలామంది దర్శకులు నిరూపించారు. అందులో కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ కూడా ఒకరు. లోకేశ్ ఇప్పటివరకు అరడజను సినిమాలను కూడా డైరెక్ట్ చేయలేదు. కానీ ఇంతలోనే దేశంలోని పెద్ద పెద్ద డైరెక్టర్ల పక్కన కూర్చొని ఇంటర్వ్యూలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు. అంతే కాకుండా కేవలం కోలీవుడ్‌లోనే కాదు.. టాలీవుడ్‌లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఇక ఈ దర్శకుడి తరువాతి మూవీ ‘లియో’ నుంచి అదిరిపోయే అప్డేట్ బయటికొచ్చింది.


‘లియో’ అప్డేట్..
మామూలుగా స్పిన్ ఆఫ్ కథలు, యూనివర్స్ లాంటి కథలు.. హాలీవుడ్‌లోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ అలాంటి కథలను ఇండియాకు తీసుకొచ్చాడు లోకేశ్ కనకరాజ్. బాలీవుడ్‌లో అయినా అప్పుడప్పుడు ఇలాంటి కథలతో చిత్రాలు తెరకెక్కి ఉండవచ్చు కానీ సౌత్‌లో మాత్రం అలాంటివి మొదటిగా ప్రవేశపెట్టింది లోకేశ్ కనకరాజే. లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ అనే పేరుతో తన ఒక సినిమాను మరో సినిమాకు కనెక్ట్ చేసే యూత్‌లో విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు. అంతే కాకుండా ఈ లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ (ఎల్‌సీయూ)లో మరెన్నో కథలు ఉన్నాయని, మరెన్నో సినిమాలు తెరకెక్కుతాయని ముందుగానే క్లారిటీ ఇచ్చాడు. ఇక త్వరలోనే ఎల్‌సీయూ నుంచి లోకేశ్ విడుదల చేస్తున్న సినిమా ‘లియో’. తాజాగా ఈ మూవీ ట్రైలర్ అప్డేట్ బయటికొచ్చింది. అక్టోబర్ 19న విడుదల కానున్న ఈ చిత్ర ట్రైలర్‌ను త్వరలోనే విడుదల చేయాలని మూవీ టీమ్ నిర్ణయించుకుంది.


బ్యాక్ టు బ్యాక్ షూటింగ్..
విజయ్ హీరోగా లోకేశ్ కనకరాజ్ డైరెక్ట్ చేస్తున్న చిత్రమే ‘లియో’. ముందుగా ఈ సినిమా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగమా కాదా అనే విషయాన్ని సస్పెన్స్‌లో పెట్టింది మూవీ టీమ్. కానీ ‘లియో’కు సంబంధించి విడుదలయిన పోస్టర్స్‌ను డీకోడ్ చేసి ఇది కచ్చితంగా ఎల్‌సీయూలో భాగమే అని ప్రేక్షకులే డిసైడ్ చేసేశారు. చాలా ఏళ్ల తర్వాత ‘లియో’ కోసం విజయ్‌తో జోడీకడుతోంది త్రిష. ‘విక్రమ్’ విడుదల తర్వాత అసలు లేట్ చేయవద్దనే ఉద్దేశ్యంతో వెంటనే ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాడు లోకేశ్. వెంటవెంటనే ఈ మూవీ నుంచి అప్డేట్స్ రావడంతో ప్రేక్షకులు సైతం షాక్ అయిపోయారు. ఇక కోలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వెలిగిపోతున్న అనిరుధ్.. ఈ చిత్రానికి కూడా సంగీతాన్ని అందిస్తున్నాడు.


ట్రైలర్ అప్పుడే..
ఇప్పటికే ‘లియో’ నుంచి గ్లింప్స్‌తో పాటు రెండు పాటలు కూడా విడుదలయ్యాయి. అనిరుధ్ మిగతా పాటలలాగానే ఈ పాటలు కూడా వెంటనే చార్ట్‌బస్టర్స్ లిస్ట్‌లో చేరిపోయాయి. ఇక గ్లింప్స్ కూడా మూవీపై ఆసక్తిని పెంచేసింది. ఫైనల్‌గా ‘లియో’ నుంచి ట్రైలర్ అప్డేట్ బయటికొచ్చింది. అక్టోబర్ 5న ‘లియో’ ట్రైలర్ విడుదల కానుందని స్వయంగా విజయ్.. తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ట్రైలర్ విడుదలయిన వెంటనే డీకోడ్ చేయాలని తన ఫ్యాన్స్‌తో పాటు కోలీవుడ్ ప్రేక్షకులంతా సిద్ధంగా ఉన్నారు. ఏ ఇతర డైరెక్టర్ తెరకెక్కించే సినిమా విషయంలో కూడా ప్రేక్షకులు.. డీకోడ్ చేయాలని ఇంత ఆసక్తితో ఉండరేమో అని ఇండస్ట్రీ నిపుణులు అంటున్నారు.






Also Read: నేషనల్ క్రష్ కుమ్మేస్తోంది - లైనప్ లో ఏకంగా 7 సినిమాలు


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial