Vijay Vs Ajith: మామూలుగా స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య వాగ్వాదాలు అనేవి సహజం. కానీ మిగతా సినీ పరిశ్రమలతో పోలిస్తే కోలీవుడ్‌లో ఫ్యాన్ వార్స్ అనేవి చాలా కామన్‌గా కనిపిస్తుంటాయి. అందులోనూ ముఖ్యంగా అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య జరిగే వార్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వీరి ఫ్యాన్స్ వార్స్ ఎన్నోసార్లు ట్విటర్‌లో ట్రెండ్ అయ్యాయి కూడా. ఇప్పుడు విజయ్.. పూర్తిగా రాజకీయాల్లోకి ఎంటర్ అవుతాన్నడంటూ సొంత పార్టీ గురించి కూడా ప్రకటించడంతో కోలీవుడ్‌లో ఇక అజిత్‌కు తిరుగు లేదని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ప్రస్తుతం తమిళనాడులో ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
అజిత్ వర్సెస్ విజయ్..
ఎన్నో ఏళ్లుగా కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అజిత్, విజయ్ సినిమాలు పోటీపడుతూనే ఉన్నాయి. బాక్సాఫీస్ కలెక్షన్స్ పరంగా అజిత్ తిరుగులేని హీరోగా పేరు దక్కించుకోగా.. తన విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌తో భాషతో సంబంధం లేకుండా పాపులారిటీ సంపాదించుకున్నాడు విజయ్. వీరిద్దరి స్టైల్ చాలా డిఫరెంట్. కానీ వీరిద్దరిలో ఒక్క విషయం కామన్‌గా ఉంది. అదే కమర్షియల్ సినిమాలతో హిట్ కొట్టడం. వీరిలో ఏ ఒక్కరు హీరోగా నటించినా లాభాలు వస్తాయని బడా నిర్మాతలు కూడా వీరి కాల్ షీట్స్ కోసం ఎదురుచూస్తుంటారు. ఇంతలోనే ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో పొలిటికల్ పార్టీని అనౌన్స్ చేశాడు విజయ్. అంతే కాకుండా త్వరలోనే సినిమాలను పూర్తిగా పక్కన పెట్టి రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నాడు.
అజిత్ సీరియస్ వార్నింగ్..
విజయ్, అజిత్.. ఇద్దరూ సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉన్నారు. కానీ అజిత్‌కు రాజకీయాలంటే ఎప్పటినుండో పెద్దగా ఇష్టం లేదు. కానీ విజయ్ మాత్రం ఎప్పటికైనా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తాడని కోలీవుడ్‌లో వార్తలు వస్తూనే ఉన్నాయి. ఏదో ఒకరోజు విజయ్.. తమిళనాడుకు ముఖ్యమంత్రి కూడా కావాలని అనుకుంటున్నాడని కూడా రూమర్స్ వినిపిస్తూ ఉండేవి. ఇక ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ గురించి అనౌన్స్‌మెంట్ ఇచ్చినప్పటి నుండి విజయ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. సినిమాల్లో తనకు సపోర్ట్ చేసిన ఫ్యాన్స్.. టీవీకే పార్టీ విషయంలో కూడా సపోర్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. మరోవైపు అజిత్ మాత్రం.. తన ఫ్యాన్స్‌ను కూడా రాజకీయాల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండేలా చూసుకుంటాడు. తాను నటించడానికి మాత్రమే వచ్చానని, రాజకీయాల పట్ల తనకు ఎటువంటి ఆసక్తి లేదని ఇప్పటికే స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు.
రేసులో అయిదుగురు..
ప్రస్తుతం సోషల్ మీడియాలో కింగ్ ఆఫ్ కోలీవుడ్ ఎవరు అనే చర్చ మొదలయ్యింది. దీనికోసం అయిదుగురి పేర్లు వినిపిస్తున్నాయి. ముందుగా రజినీకాంత్ పేరు వినిపించినా.. ఇప్పటికే ఈ హీరోకు 73 ఏళ్లు. అందుకే సినిమాలు చేయడంలో స్పీడ్ తగ్గించారు. త్వరలోనే సినిమాల నుండి రిటైర్‌మెంట్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. కమల్ హాసన్‌కు కూడా రాజకీయ పరమైన కమిట్మెంట్స్ ఉండడంతో సినిమాల సంఖ్య తగ్గిపోయింది. దీంతో సూర్య, శివకార్తికేయన్, ధనుష్, కార్తి, శింబులాంటి హీరోలు లైన్‌లో ఉన్నారు. కానీ కమర్షియల్ మార్కెట్‌లో వీరి సినిమాలు ఎంతవరకు వర్కవుట్ అవుతాయన్నదే డౌట్. అందుకే ఇప్పుడు కింగ్ ఆఫ్ కోలీవుడ్ కిరీటం ఎక్కువశాతం అజిత్‌కు దక్కే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.
Also Read: ‘హనుమాన్’ మరో రికార్డ్ - స్పెషల్ పోస్ట్ షేర్ చేసిన ప్రశాంత్ వర్మ