'లైగర్' విడుదలైన ఎనిమిది నెలల తర్వాత, ఆ సినిమా వార్తల్లోకి ఎక్కింది. ఫస్ట్ డే ఫస్ట్ షో పడిన తర్వాత రిజల్ట్ ఏమిటనేది ఆల్మోస్ట్ అందరికీ క్లారిటీ వచ్చింది. ఫ్లాప్ టాక్ వచ్చింది. ఆ తర్వాత డిజాస్టర్ అయ్యింది. దాంతో తాము చాలా డబ్బులు నష్టపోయామని, తమకు న్యాయం చేయాలని ఎగ్జిబిటర్లు ఆందోళన మొదలు పెట్టారు. సినిమా విడుదలైన కొన్నాళ్లకు పోలీస్ స్టేషన్, కేసుల వరకు వెళ్లారు. ఆ సమస్య తర్వాత సమసిపోయిందని అందరూ భావించారు. అయితే... తాజాగా ఫిల్మ్ ఛాంబర్ దగ్గర 'లైగర్' ఎగ్జిబిటర్లు ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... గురువారం (మే 18న) వాళ్ళు దీక్ష విరమించారు.
'లైగర్' సమస్య పరిష్కారం కాలేదు కానీ...
తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి, తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తమకు న్యాయం చేస్తామని మాట ఇవ్వడం వల్ల దీక్ష విరమిస్తున్నట్లు 'లైగర్' ఎగ్జిబిటర్లు తెలిపారు. తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు మురళీమోహన్, అలాగే తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి అనుపమ రెడ్డి త్వరలో చాలా సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో వాళ్ళ ఆధ్వర్యంలో దీక్ష విరమించినట్లు పేర్కొన్నారు. కొందరు ఎగ్జిబిటర్ల ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో, ఎండలకు ఆస్పత్రి పాలు కావడంతో మొత్తం పరిస్థితిని పెద్దల దృష్టికి తీసుకు వెళ్లిన ప్రసన్నకుమార్ కు ధన్యవాదాలు తెలిపారు.
చట్టప్రకారం ఎగ్జిబిటర్లకు పూరి జగన్నాథ్ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే... డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనుకు ఐదు కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారని, ఆ డబ్బులు త్వరగా ఇస్తే తమకు ఇస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రముఖ నిర్మాతలు డి. సురేష్ బాబు, సునీల్ నారంగ్, శిరీష్ (దిల్ రాజు సోదరుడు) సహాయ సహకారాలతో దీక్ష విరిమిస్తున్నామని, తమ సమస్యకు త్వరలో పరిష్కారం రావాలని కోరుకుంటున్నామని 'లైగర్' ఎగ్జిబిటర్లు తెలిపారు.
ఫోనులు ఎత్తడం మానేసిన పూరి, ఛార్మి
'లైగర్' ఎగ్జిబిటర్లు ధర్నాకు దిగడంతో సమస్యను పరిష్కరించడానికి ప్రముఖ నిర్మాత, నైజాంలో బడా డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ రంగంలోకి దిగారు. అయితే, 'లైగర్' దర్శక నిర్మాతలు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ ఫోనులు ఎత్తడం మానేశారని ఆయన తెలిపారు. మరోవైపు సినిమా సౌత్ ఇండియా రైట్స్ కొన్న వరంగల్ శ్రీను కూడా అదే విషయం చెప్పారు. ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను సినిమా విడుదలైన వారం వరకు పూరి, ఛార్మితో టచ్ లో ఉన్నానని, వారం తర్వాతే అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం చేశానని శ్రీను పేర్కొన్నారు. ఆ తర్వాత నుంచి పూరి, ఛార్మి తనకు మొహం చాటేశారని, వాళ్ళతో మాట్లాడటం కుదరలేదని ఆయన వివరించారు.
Also Read : అవును 'బ్రో' - పవన్ కళ్యాణ్, సాయి తేజ్ సినిమా టైటిల్ ఇదే! పవర్ స్టార్ లుక్ చూశారా?
భారీగా నష్టపోయిన వరంగల్ శ్రీను!
'లైగర్' డిజాస్టర్ కావడంతో అందరి కంటే ఎక్కువగా నష్టపోయినది తానేనని సౌత్ ఇండియా రైట్స్ కొన్న వరంగల్ శ్రీను చెబుతున్నారు. అసలు బలిపశువు తాను అని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. సుమారు 60 కోట్ల రూపాయలకు తాను సినిమా రైట్స్ కొన్నానని, డిజాస్టర్ టాక్ రావడంతో ఎగ్జిబిటర్లు ఇచ్చిన అడ్వాన్సులు వెనక్కి తీసుకున్నారని, అందరి కంటే ఎక్కువ డబ్బులు తనవే పోయాయనేది వరంగల్ శ్రీను వాదన.
Also Read : తెలుగు దర్శకుడు తీసిన హిందీ సినిమా - ఈ వారమే '8ఎఎం మెట్రో' విడుదల