మావయ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో కలిసి మెగా మేనల్లుడు, యువ కథానాయకుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) ఓ సినిమా చేశారు. ఈ సంగతి తెలుసు. మరి, ఈ సినిమా టైటిల్ ఏంటో తెలుసా? అందులో మామ - అల్లుడు ఎలా ఉంటారో తెలుసా? ఆ ప్రశ్నలకు సమాధానం ఈ రోజు లభించింది. సినిమా టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 


మావ 'బ్రో' - టైటిల్ ఇదే!
పవర్ స్టార్ లుక్ చూశారా?
పవన్ కళ్యాణ్, సాయి తేజ్ సినిమాకు 'బ్రో' టైటిల్ ఖరారు చేశారు. కొన్ని రోజుల క్రితమే ఈ టైటిల్ ఫిక్స్ చేశారని ఫిల్మ్ నగర్ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఈ రోజు అధికారికంగా ఆ టైటిల్ ప్రకటించారు. ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ కూడా విడుదల చేశారు. ముఖ్యంగా మోషన్ పోస్టర్ కోసం సంగీత సంచలనం తమన్ అందించిన నేపథ్య సంగీతం మెగా అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.


Also Read : 'అన్నీ మంచి శకునములే' రివ్యూ : 'సీతారామం' నిర్మాతలు తీసిన సినిమా - సంతోష్ శోభన్‌కు హిట్ వస్తుందా?



ప్రపంచవ్యాప్తంగా జూలై 28న విడుదల!
ప్రముఖ నటుడు, ఇంతకు ముందు తెలుగులో మాస్ మహారాజా రవితేజ 'శంభో శివ శంభో', నాని 'జెండా పై కపిరాజు' చిత్రాలకు దర్శకత్వం వహించిన సముద్రఖని 'బ్రో' మూవీకి దర్శకుడు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. టీజీ విశ్వప్రసాద్ నిర్మాత. జూలై 28న ఈ  చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. 


ఇందులో సాయి ధరమ్ తేజ్ సరసన 'రొమాంటిక్' కథానాయిక కేతికా శర్మ (Ketika Sharma) కనిపించనున్నారు. ఆయన కంటే ముందు తమ్ముడు వైష్ణవ్ తేజ్ సరసన 'రంగ రంగ వైభవంగా' సినిమాలో ఆమె నటించారు. ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ వారియర్ కీలక పాత్ర చేస్తున్నారు.


Also Read : ఫాస్ట్ 10 రివ్యూ: ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్‌లో లేటెస్ట్ సినిమా ఎలా ఉంది?



'బ్రో' సినిమా కథేంటి?
తమిళంలో సముద్రఖని నటించడంతో పాటు దర్శకత్వం వహించిన 'వినోదయ సీతం' (Vinodhaya Sitham Telugu remake) చిత్రానికి తెలుగు రీమేక్ ఈ 'బ్రో'! కారు యాక్సిడెంట్‌లో మరణించిన యువకుడికి దేవుడు రెండో అవకాశం ఇవ్వడం అనేది సినిమా మెయిన్ కాన్సెప్ట్. తెలుగులో భగవంతుని పాత్రలో పవన్ కళ్యాణ్ ప్రేక్షకులకు కనిపించనున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిగా సాయి ధరమ్ తేజ్ నటించనున్నారు. పవన్ మోడ్రన్ దేవుడి పాత్ర చేయడం రెండోసారి. ఇంతకు ముందు 'గోపాల గోపాల'లో మోడ్రన్ శ్రీ కృష్ణుని పాత్ర చేశారు. 


ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాలు ఏవి?
'బ్రో' సినిమా కాకుండా... క్రిష్ దర్శకత్వంలో 'హరి హర వీర మల్లు', హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', సుజీత్ దర్శకత్వంలో 'ఓజీ - ఒరిజినల్ గ్యాంగ్ స్టర్' సినిమాలు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు. ఆ మూడింటిలో 'ఉస్తాద్ భగత్ సింగ్' వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుందని తెలుస్తోంది. మిగతా రెండు సినిమాల విడుదల తేదీలు ఖరారు కావాల్సి ఉంది.