RRR (రౌద్రం రణం రుధిరం) సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ & మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ మాగ్నమ్ ఓపస్.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. 100 ఏళ్ళ భారతీయ సినిమాకు కలగా మిగిలిపోయిన ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారాన్ని తెచ్చిపెట్టింది. అయితే ఇప్పుడు తాజాగా ట్రిపుల్ ఆర్ మూవీ మరో అరుదైన ఘనత సాధించింది.


వరల్డ్ వైడ్ గా అధ్బుతమైన విజయం సాధించిన 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం.. జపాన్ దేశంలోనూ సెన్సేషన్ క్రియేట్ చేసింది. భారీ కలెక్షన్స్ తో ఎన్నో రికార్డులను తిరగరాసింది. దీంతో రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు జపాన్ లో భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రముఖ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ కవర్ పేజీపై వీరిద్దరి ఫొటోలను ముద్రించారు. ఈ విషయాన్ని RRR బృందం సోషల్ మీడియాలో తెలియజేసింది. 


"జపాన్ లో అత్యంత ప్రశంసలు పొందిన లైఫ్ స్టైల్ మ్యాగజైన్ ఆనన్ కవర్ పేజీలో మన RRR హీరోలు కనిపించారు" అని మేకర్స్ ట్విట్టర్ లో ఆ ఫోటోని షేర్ చేశారు. ఇందులో తారక్, చరణ్ ఇద్దరూ బ్లాక్ డ్రెస్ లో భిన్నమైన ఎక్స్ ప్రెషన్స్ తో ఆకర్షిస్తున్నారు. ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ మ్యాగజైన్ కవర్ పేజీ పిక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.






RRR సినిమా కాస్త ఆలస్యంగా జపాన్ లో రిలీజ్ అయింది. దర్శకుడు రాజమౌళితో పాటుగా ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు టోక్యో వెళ్లి ఈ సినిమాని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసారు. జపాన్ వాసులు ఈ ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ని విశేషంగా ఆదరించడంతో, ఫలితంగా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ నమోదయ్యాయి. అక్కడ 102 సెంటర్లలో 200 రోజులు ప్రదర్శించబడినట్లు చిత్ర బృందం ఇటీవలే ప్రకటించింది. 


ఎన్నో ఏళ్లుగా 'ముత్తు' సినిమా పేరిట ఉన్న రికార్డును చెరిపేసి, జపాన్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ సినిమాగా RRR సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. అలానే 'టైటానిక్' మూవీని బీట్ చేసి జపాన్ లో ఆల్-టైమ్ బెస్ట్ మల్టీప్లైయర్ గా రికార్డ్ సృష్టించింది. ఇప్పుడు ఏకంగా RRR హీరోలు జపాన్ ఫేమస్ మ్యాగజైన్ కవర్ పేజీ పైకి ఎక్కడం విశేషమనే చెప్పాలి. 


Also Read : 'అన్నీ మంచి శకునములే' రివ్యూ : 'సీతారామం' నిర్మాతలు తీసిన సినిమా - సంతోష్ శోభన్‌కు హిట్ వస్తుందా?


కాగా, అల్లూరి సీతారామరాజు - కొమురం భీమ్ వంటి ఇద్దరు విప్లవ వీరుల స్పూర్తితో అల్లుకున్న కల్పిత కథతో RRR చిత్రాన్ని తెరకెక్కించారు రాజమౌళి. భీమ్ గా తారక్, రామరాజుగా చరణ్ నటించారు. అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరీస్, శ్రియా సరన్, సముద్రఖని తదితరులు ఇతర పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మాత దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చగా.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్ గా, సాబు సిరిల్ ఆర్ట్ డైరక్టర్ గా వర్క్ చేసారు. సినిమాలో చంద్రబోస్ రాసిన 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. 


Read Also: 'మేమ్ ఫేమస్' ట్రైలర్ రిలీజ్ - 'జాతిరత్నాలు' రేంజ్ హిట్ కొడతారా?