కళకు ప్రాంతం, మతం, భాష వంటి హద్దులు లేవు. అదే విధంగా సినిమాకు కూడా! సినిమా కూడా కళే కదా! అందులోనూ ఇప్పుడు ఓ భాషలో తీసిన సినిమా మరో భాషలోనూ విజయం సాధిస్తుంది. ఓ భాషకు చెందిన దర్శకులు, కథానాయకులు మరో భాషకు వెళుతున్నారు. మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు తెలుగు దర్శకులకు హిందీలో మాంచి డిమాండ్ ఉంది. ఈ మధ్య 'ఘాజీ', 'అంతరిక్షం' తీసిన సంకల్ప్ రెడ్డి హిందీలో విద్యుత్ జమాల్ హీరోగా 'ఐబీ 71' తీసి హిట్ కొట్టారు. ఈ శుక్రవారం 'మల్లేశం' దర్శకుడు రాజ్ రాచకొండ కూడా హిందీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
'మల్లేశం' దర్శకుడి హిందీ సినిమా!
తెలంగాణ నేపథ్యంలో, అదీ చేనేత మీద వచ్చిన గొప్ప తెలుగు చిత్రాల్లో 'మల్లేశం' ఒకటి. అది పద్మశ్రీ పురస్కార గ్రహీత, లక్ష్మీ ఆశు మెషిన్ సృష్టికర్త చింతకింది మల్లేశం బయోపిక్. ఆ చిత్రంతో ఎన్నారై రాజ్ రాచకొండ (Raj Rachakonda) తెలుగు చలన చిత్ర పరిశ్రమకు దర్శక, నిర్మాతగా పరిచయం అయ్యారు. ఇప్పుడు ఆయన '8 ఎఎం మెట్రో' (8am Metro Movie) సినిమా తీశారు.
సాయి ధరమ్ తేజ్ 'రేయ్'లో కథానాయికగా, కింగ్ అక్కినేని నాగార్జున 'వైల్డ్ డాగ్'లో ఎన్ఐఎ ఏజెంట్ ఆర్య పండిట్ పాత్రలో నటించిన సయామీ ఖేర్ (Saiyami Kher) గుర్తు ఉన్నారా? '8 ఎఎం మెట్రో' సినిమాలో ఆమె కథానాయిక. 'హేట్ స్టోరీ', 'రామ్ లీల', 'హంటర్', 'బధాయి హో' తదితర సినిమాల్లో నటించిన గుల్షన్ దేవయ్య కథానాయకుడు. కల్పికా గణేష్ కీలక పాత్ర చేశారు.
'8 ఎఎం మెట్రో' చిత్రానికి రాజ్ రాచకొండ దర్శకత్వం వహించారు. అలాగే, ఆయన నిర్మాణ భాగస్వామి కూడా! కిషోర్ గంజితో కలిసి చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 19న (రేపు, శుక్రవారం) హిందీలో సినిమా విడుదల కానుంది. ఆ తర్వాత ప్రాంతీయ భాషల్లో కూడా అనువదించి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
'8 ఎఎం మెట్రో' కథ ఏంటి?
సినిమాలో సయామీ ఖేర్ వివాహితగా కనిపించనున్నారు. భావావేశం మెండుగా ఉనప్పటికీ... జీవితం చాలా నిర్లిప్తంగా సాగిపోతున్న ఫీలింగ్ ఆమెలో ఉంటుంది. అటువంటి మహిళకు మెట్రోలో ఓ యువకుడు పరిచయం అవుతాడు. అది కాస్త స్నేహంగా మారుతుంది. ఆ తర్వాత ఏమైంది? ఆ స్నేహం ఏ తీరాలకు దారి తీసింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా విజయం సాధిస్తే... హిందీలో రాజ్ రాచకొండకు మరిన్ని అవకాశాలు వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదు.
Also Read : 'అన్నీ మంచి శకునములే' రివ్యూ : 'సీతారామం' నిర్మాతలు తీసిన సినిమా - సంతోష్ శోభన్‌కు హిట్ వస్తుందా?
ఆస్కార్ గ్రహీత గుల్జార్ రాసిన కవితలతో
ఈ చిత్రంలోని కవితలను ప్రఖ్యాత గీత రచయిత, ఆస్కార్ పురస్కార గ్రహీత గుల్జార్ రాయడం విశేషం. '8 ఎఎం మెట్రో' చిత్రానికి సన్నీ కుర్రపాటి కెమెరా వర్క్ అందించారు. మార్క్ కె. రాబిన్స్ సంగీత బాధ్యతలు నిర్వర్తించారు. ఇంకా కూర్పు : అనిల్, వీఎఫ్ఎక్స్ : ఉదయ్ తిరుచాపల్లి.
Also Read : ఫాస్ట్ 10 రివ్యూ: ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ సిరీస్‌లో లేటెస్ట్ సినిమా ఎలా ఉంది?