'ది' విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)తో ఒకటి కాదు, రెండుసార్లు పని చేసే అవకాశం వచ్చింది మురళీ కృష్ణ (Cinematographer Murali G)కు. అయితే... ఆ రెండు సార్లు సినిమాలు చేయడం కుదరలేదు. ఓ సినిమా సెట్స్ మీదకు వెళ్ళక ముందు ఆగితే... మరో సినిమా సెట్స్ మీదకు వెళ్ళిన తర్వాత పక్కన పట్టేశారు. ఇన్నాళ్ళకు వీళ్ళ కలయికలో సినిమా వస్తోంది. ఇంతకీ, ఈయన ఎవరు? అంటే... 'ఖుషి' సినిమాటోగ్రాఫర్!
విజయ్ దేవరకొండ, సమంత జంటగా శివ నిర్వాణ దర్శకత్వం వహించిన 'ఖుషి' పాటలు ప్రేక్షకులు నచ్చాయి. టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. మరీ ముఖ్యంగా విజువల్స్ బావున్నాయని చాలా మంది చెబుతున్నారు. ఆ విజువల్స్ వెనుక, ఆ కెమెరా వెనుక ఉన్నది సినిమాటోగ్రాఫర్ జి. మురళి (G Murali Cinematographer). సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన 'కాలా', 'కబాలి'కీ ఆయనే సినిమాటోగ్రాఫర్. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన 'అందాల రాక్షసి'తో ఆయన కెరీర్ స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు తెలుగు సినిమా చేశారు.
'ఖుషి' కంటే ముందు నుంచి... హీరో విజయ్ దేవరకొండతో తనకు చాలా ఏళ్లుగా పరిచయం ఉందని జి. మురళి చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''నాకు 'అందాల రాక్షసి' తర్వాత తెలుగులో మరో సినిమా చేసే అవకాశం వచ్చింది. అప్పటికి విజయ్ దేవరకొండ హీరో కాలేదు. 'హ్యాపీ డేస్'లో నటించారు. ఆ దర్శకుడు ఎవరో చెప్పను. కానీ, హీరోగా విజయ్ దేవరకొండను పరిచయం చేయాలని ఓ సినిమా మొదలు పెట్టారు. మూడు నాలుగు నెలలు మేమంతా ట్రావెల్ చేశాం. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది. చివరకు, ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్ళలేదు. నాకు తమిళంలో అవకాశం రావడం, పా రంజిత్ దర్శకత్వంలో వరుసగా మూడు సినిమాలు చేశా. ఆ తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో విజయ్ దేవరకొండ హీరోగా 'హీరో' సినిమా మొదలైంది. దానికి నేనే సినిమాటోగ్రాఫర్. ఓ చిన్న షెడ్యూల్ చేసిన తర్వాత ఆపేశాం. నిర్మాత రవిశంకర్ గారు ఫోన్ చేసి విజయ్ దేవరకొండతో ఓ సినిమా చేస్తున్నాం. రేపు దర్శకుడు వచ్చి కథ చెబుతారని చెప్పారు. ఓకే అన్నాను. అప్పుడు శివ నిర్వాణ వచ్చి 'ఖుషి' కథ చెప్పారు'' అని వివరించారు. అదీ సంగతి!
Also Read : సగమే తీసుకున్న వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు - నిర్మాతకు లాభాలే ముఖ్యమంటూ
దర్శకుడు మణిరత్నం, ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్ కలయికలో వచ్చిన ప్రేమ కథా చిత్రాలు ట్రెండ్ సెట్ చేశాయని, వాటిని చూసి స్ఫూర్తి పొందడం జరిగింది తప్ప... సేమ్ అటువంటి విజువల్స్ ఉండాలని ఎక్కడా కాపీ కొట్టే ప్రయత్నం చేయలేదని మురళి తెలిపారు. ప్రేక్షకులకు 'ఖుషి' ఒక ఫ్రెష్ ఫీల్ ఇస్తుందని ఆయన తెలిపారు. ఓ జీవితం చూసినట్లు ఉంటుందన్నారు.
Also Read : అవును, పవన్ కళ్యాణ్ సినిమాలో - కన్ఫర్మ్ చేసిన హీరోయిన్
తమ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించాలని తనకు పది ఫోన్స్ వస్తే... అందులో తొమ్మిది ఫోన్లు తెలుగు దర్శక, నిర్మాతల నుంచి ఉంటాయని మురళి చెప్పారు. ఓ సినిమా ఓకే చేస్తే... ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ & విడుదల వరకు ప్రతి విషయం దగ్గర ఉండి చూసుకోవడం తనకు అలవాటు అని, అందుకే తన కెరీర్ నెమ్మదిగా ఉంటుందని ఆయన తెలిపారు. 'ఖుషి' విడుదలైన తర్వాతే కొత్త సినిమా అంగీకరిస్తానని ఆయన చెప్పారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial