సినీ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు గుడిపూడి శ్రీహరి (Gudipudi Srihari) కన్నుమూశారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. గత ఏడాది నవంబర్‌లో శ్రీహరి సతీమణి లక్ష్మి మరణించారు. అప్పటి నుంచి ఆయన కుంగిపోయారు. పూర్తిగా ఇంటికి పరిమితం అయ్యారు. గత వారంలో ఇంట్లో పడిపోవడం వల్ల గాయమై తుంటి ఎముక విరగడంతో నిమ్స్ ఆస్పత్రిలో విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారని కుటుంబ సభ్యులు తెలిపారు. అనారోగ్య సమస్యలతో మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. 


సుమారు 55 సంవత్సరాల పాటు గుడిపూడి శ్రీహరి పాత్రికేయునిగా, విశ్లేషకుడిగా సేవలు అందించారు. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు'లో పాతికేళ్ల పాటు సినిమా రివ్యూలు రాశారు. హరివిల్లు పేరుతో ఆ కాలమ్ నడిచింది. ఆ రివ్యూలకు సాధారణ ప్రజలతో పాటు చలనచిత్ర ప్రముఖులు నుంచి చక్కటి ఆదరణ లభించింది. ఈనాడు, హిందూ పత్రికలతో పాటు ఆల్ ఇండియా రేడియో, ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్‌లో శ్రీహరి పని చేశారు. కొన్నిసార్లు ఆయన రివ్యూస్ గురించి హీరోలు ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి.


కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా పలు సాంస్కృతిక, కళా రంగాల గురించి శ్రీహరి వ్యాసాలు రాశారు. ఆల్ ఇండియా రేడియోలో ఎం.ఎస్. రామారావును ఆయనే పరిచయం చేశారు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన సురభి నాటక రంగం, కళాకారుల గురించి ఆయన రాసిన కథనం ఢిల్లీలోని సంగీత నాటక అకాడమీ వరకూ చేరింది. ఆ తర్వాత సురభి కళాకారులకు ఆర్థిక సాయం అందింది.


ఆంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర పరిశ్రమ, కల్చరల్ హెరిటేజ్ మీద గుడిపూడి శ్రీహరి పుస్తకాలు రాశారు. నేషనల్ ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో స్క్రిప్ట్ కమిటీ సభ్యుడిగా పని చేశారు. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్‌కు కొన్నేళ్లు అధ్యక్షుడిగా పని చేశారు. 


Also Read : సీరియస్‌గా తీసుకోవద్దు శోభు - 'ఆర్ఆర్ఆర్' గే లవ్ స్టోరీ కామెంట్స్‌కు ఇక ఫుల్ స్టాప్ పడుతుందా?


గుడిపూడి శ్రీహరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం కుమారుడు శ్రీరామ్ విదేశాల్లో ఉన్నారు. ఆయన ఇండియాకి వచ్చిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయించినట్టు సమాచారం. 


Also Read : ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మల్టీస్టారర్ - ఇదిగో క్లారిటీ!