Shatrughan Sinha Discharged: బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, పార్లమెంటు సభ్యుడు శత్రుఘ్న సిన్హా (77) ఇటీవల ముంబయిలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఆయన తీవ్ర అస్వస్థకు గురయ్యారని, ఇంట్లో టీవీ చూస్తూ పడిపోయారని, ఏదో సర్జరీ జరిగిందని, కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకుంటారని.. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా సిన్హా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రొటీన్ హెల్త్ చెకప్ కోసమే తాను ఆసుపత్రికి వచ్చానని చెప్పి పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేసారు. 


నేషనల్ మీడియాకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శతృఘ్న సిన్హా మాట్లాడుతూ ''ఇది రెగ్యులర్ గా చేసే రొటీన్ హెల్త్ చెకప్. 60 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ ఇలాంటి జనరల్ టెస్టులు చేయించుకోవాలి. ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను గత మూడు నెలలుగా నాన్‌ స్టాప్‌గా తిరుగుతున్నాను. ఆ తర్వాత వెంటనే నా కూతురు సోనాక్షి సిన్హా పెళ్లి జరిగింది. నేను రోజుకు 3 షిఫ్టులు పని చేసి, రాత్రంతా పార్టీ చేసుకునే శక్తి ఉన్న యువకుడిని కాదు. కాబట్టి నేను స్లోగానే వెళ్ళాలి'' అని అన్నారు. సర్జరీ జరిగిందనే పుకార్లపై స్పందిస్తూ.. “నాకు ఆసుపత్రిలో చిన్నపాటి సర్జరీ జరిగిందని కూడా చదివాను. అరే భాయ్.. నేను శస్త్రచికిత్స చేయించుకుంటే దాని గురించి నాకు తెలియదా?'' అని సిన్హా ఎదురు ప్రశ్నించారు. ముంబై మీడియా వార్తల కోసం చాలా ఆకలితో ఉందని, వారు దేన్నైనా బయటపెడతారని శత్రుఘ్న్ అన్నారు.


శత్రుఘ్న సిన్హా హాస్పిటల్ లో అడ్మిట్ అయిన వెంటనే, ఆయన ఆరోగ్యంపై చాలా రూమర్స్ వినిపించాయి. ఇంట్లో సోఫాలో కూర్చుని టీవీ చూస్తుండగా.. ఒక్కసారిగా ముందుకు పడబోయారని, వెంటనే సోనాక్షి ఆయన్ను పట్టుకున్నారని చెప్పుకున్నారు. ఆ తర్వాత తీవ్రమైన జ్వరం రావడం, పక్కటెముకల్లో నొప్పులు తీవ్రం కావడంతో సిన్హాను ఆసుపత్రికి తరలించినట్లుగా అనుకున్నారు. తీవ్ర జ్వరంతోనే సిన్హాను ఆసుపత్రిలో చేర్చినట్లు ఆయన కుమారుడు లవ్‌ సిన్హా ఆదివారం మీడియాకు వెల్లడించారు. సాధారణంగా చేయించే అన్ని వైద్యపరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు. ఇప్పుడు శత్రుఘ్న్ సైతం రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకున్నట్లు స్పష్టం చేసారు. 


ఇకపోతే శత్రుఘ్న సిన్హా కుమార్తె, బాలీవుడ్‌ హీరోయిన్ సోనాక్షీ సిన్హా వివాహం ఇటీవలే జరిగింది. నటుడు జహీర్‌ ఇక్బాల్‌ ను ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. వీళ్లది మతాంతర వివాహం కావడంతో సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా ఒప్పుకోలేదని పుకార్లు షికార్లు చేశాయి. ఆ వార్తలను తోసిపుచ్చుతూ తన కూతురు పెళ్లికి హాజరయ్యారు. భార్య పూనమ్ సిన్హా, కుమారుడు కుష్ సిన్హా కూడా ఈ వేడుకలో కనిపించారు. అయినా సరే ఈ పెళ్లి విషయంలో ఆయన సంతోషంగా లేరంటూ సోషల్ మీడియాలో పలువురు నెటిజన్లు పోస్టులు పెట్టారు. సోనాక్షి - జహీర్‌ జంటను పెద్ద ఎత్తున ట్రోల్ చేసారు. 


1969లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన శత్రుఘ్నసిన్హా.. ‘మేరే అప్నే’, ‘కాళీ చరణ్‌’, ‘విశ్వనాథ్‌’, ‘కాలాపత్థర్‌’, ‘దోస్తానా’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. తన బాటలోనే కొడుకు లవ్ సిన్హా, కూతురు సోనాక్షి సిన్హాలను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసారు. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అటల్ బిహారీ వాజపేయి మంత్రివర్గంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిగా, నౌకా రవాణా మంత్రిగా పనిచేశారు. లోక్‌సభ సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా రెండేసి పర్యాయాలు ఎన్నికయ్యారు. ఇటీవల వెల్లడైన లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో పశ్చిమ బెంగాల్‌లోని ఆసన్‌ సోల్‌ నియోజకవర్గం నుంచి సిన్హా విజయం సాధించారు.


Also Read: కనుబొమ్మలతోనే నవరసాలు పండించగల మహా నటుడు - విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు గురించి ఈ విషయాలు తెలుసా?