Dubbing Janaki: టాలీవుడ్‌లో ఒకప్పుడు సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులుగా వెలిగిపోయిన చాలామంది ఇప్పటికీ యాక్టివ్‌గా సినిమాల్లో నటిస్తున్నారు. అందులో డబ్బింగ్ జానకి కూడా ఒకరు. అసలు పేరు దాసరి జానకి అయినా కూడా సినీ పరిశ్రమలోకి ఎంటర్ అయిన తర్వాత ఆమె పేరు డబ్బింగ్ జానకిగా మారిపోయింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన పర్సనల్ లైఫ్‌లో ఎదుర్కున్న కష్టాల గురించి బయటపెట్టారు. అన్ని భాషల్లో కలిపి 1000కు పైగా సినిమాల్లో నటించినా కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కున్నానని చెప్పుకొచ్చారు. సీనియర్ హీరోలతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.


అప్పు చేయకూడదు..


‘‘ఆర్థికంగా చాలా కష్టాలుపడ్డాను. ముగ్గురు పిల్లల్ని పెంచుకోవాలి. మా ఆయన మిలిటరీలో పనిచేసినా కూడా ఆయన జీతం ఎంతో నాకు తెలియదు. ఆయన జీతంపైనే మేము, మా అత్తయ్యవాళ్లు ఆధారపడి ఉన్నాం. ఒక్కొక్కసారి తినడానికి తిండి లేకపోతే మా పిల్లలకు జావ కాచి పెట్టేదాన్ని. మా నాన్న దగ్గర డబ్బులు ఉన్నా కూడా మా కాళ్ల మీద మేము నిలబడాలి అనుకునేవాళ్లం. బస్ ఛార్జీకి 10 పైసలు లేకపోతే కబుర్లు చెప్పుకుంటూ నడుచుకుంటూ వెళ్లేవాళ్లం. అప్పు చేయకూడదు అనుకునేదాన్ని. సంపాదించినదాంట్లో కొంత అత్తయ్య, మావయ్యకు పంపించేదాన్ని’’ అంటూ తాను ఎదుర్కున్న ఆర్థిక ఇబ్బందుల గురించి బయటపెట్టారు డబ్బింగ్ జానకి.


దర్శకుల ఇళ్లకు వెళ్లాను..


ఇక సినీ పరిశ్రమలో తాను ఎదుర్కున్న ఇబ్బందుల గురించి కూడా డబ్బింగ్ జానకి మాట్లాడారు. ‘‘అప్పుడు చిన్న వయసు కాబట్టి వాళ్లు చూసే చూపులతోనే అర్థమయిపోయేది. ఇండస్ట్రీలో నాకు సపోర్ట్‌గా ఎవరూ లేరు. నా కాళ్ల మీద నేనే నిలబడ్డాను. ఇదంతా నా స్వయంకృషి. ఉదయాన్నే లేచి క్యారెక్టర్లు అడగడానికి దర్శకుల ఇళ్లకు వెళ్లేదాన్ని. ఆఫీసులకు వెళ్లి కలిసేదాన్ని కాదు. మళ్లీ తిరిగొచ్చి ఇంట్లో పనులు చూసుకునేదాన్ని. తిరగకపోతే అవకాశాలు ఇచ్చేవారు కాదు’’ అని తెలిపారు. ఇక ఇండస్ట్రీ నుండి తనకు ఎలాంటి సహాయం అందకపోవడానికి కారణమేంటో చెప్తూ.. తన సమస్యలు అసలు ఎవరికీ చెప్పుకోలేదని, ఎవరితో క్లోజ్‌గా ఉండేదాన్ని కాదన్నారు డబ్బింగ్ జానకి.


ఆయనతో 17 సినిమాలు..


‘‘హీరోలు ఇష్టంగా పలకరిస్తారు కానీ లోతుగా మాట్లాడుకునేంత సాన్నిహిత్యం ఎవరితోనూ లేదు. నాకు సావిత్రి అంటే ఇష్టం. కలిసి సినిమాలు చేశాం కానీ ఆవిడతో నాకు పెద్దగా పరిచయం లేదు. ఆమె వెళ్లి ఎక్కడో కూర్చునేవాళ్లు, ఆమె లోకం వేరు. సినిమా సెట్‌లో అందరం కుటుంబంలాగా ఉంటాం. బయటికొస్తే ఎవరి దారి వాళ్లదే’’ అని తెలిపారు జానకి. కే విశ్వనాథ్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ ఆయన డైరెక్షన్‌లో 17 సినిమాలు చేశానన్నారు. ‘సాగర సంగమం’లో తన క్యారెక్టర్ తనకు చాలా ఇష్టమని తెలిపారు. ‘‘కొంతమంది హీరోలకు ఈగో ఉంటుంది. కానీ కమల్ హాసన్ మాత్రం సాగర సంగమంలో నా కాళ్లపై పడి ఏడ్చారు. డైరెక్టర్ ముందు చేసి చూపించారు’’ అని గుర్తుచేసుకున్నారు డబ్బింగ్ జానకి.



Also Read: అప్పుడు డబ్బులు ఇస్తామన్నారు - కొడుకు మృతిపై వస్తున్న వార్తలపై స్పందించిన చిరు చిన్నల్లుడు శిరీష్ తల్లి