ఆగస్ట్ నెల అనేది కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా విడుదలయిన ప్రతీ సినిమా దాదాపుగా హిట్ అయ్యింది. అది కూడా మామూలు హిట్ కాదు.. బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యాయి. అందులో ఒకటి ‘జైలర్’. ముందు నుండే ‘జైలర్’ మూవీకి క్రియేట్ అయిన హైప్ చూసి సినిమా కచ్చితంగా హిట్ అవుతుంది అనుకున్నారు ప్రేక్షకులు. కానీ ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లు కలెక్ట్ చేసేంత బ్లాక్ బస్టర్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఇక ‘జైలర్’ హిట్ అవ్వడంతో దీని సీక్వెల్ గురించి పలు ఊహాగానాలు వైరల్ అవుతున్నాయి. వాటి గురించి వసంత్ రవిని ప్రశ్నించింది మీడియా. 


‘వెపన్’ ప్రమోషన్స్‌లో ‘జైలర్’ గురించి ప్రశ్న..
‘జైలర్’ సినిమాలో రజినీకాంత్ హీరోగా నటించగా.. ఆయన భార్య పాత్రలో రమ్యకృష్ణ, కొడుకు పాత్రలో వసంత్ రవి నటించారు. రజినీకాంత్‌కు సినిమాలో ఎంత ప్రాధాన్యత ఉందో.. వసంత రవికి కూడా ఇంచుమించు అంతే ప్రాధాన్యత ఇచ్చాడు దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్. అందుకే ‘జైలర్’ ప్రమోషన్స్ సమయంలో వసంత్ రవి కూడా ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్నాడు. ఆ సినిమా గురించి ఎన్నో విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు. ‘జైలర్’ తర్వాత ‘వెపన్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు వసంత్ రవి. ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల అవుతోంది.‘వెపన్’ ప్రమోషన్స్ సమయంలో ‘జైలర్’ సీక్వెల్‌కు సంబంధించిన ప్రశ్న.. వసంత్ రవికి ఎదురయ్యింది.


తెలుసుకోవాలంటే ఆ పని చేయాలి..
‘జైలర్‌కు సీక్వెల్ ఉండబోతుందని, అందులో బాలకృష్ణ నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం’ అని ఒక జర్నలిస్ట్.. వసంత్ రవిని ప్రశ్నించారు. అయితే ఈ విషయం గురించి తనకు అసలు తెలియదని, తెలుసుకోవాలంటే దర్శకుడు నెల్సన్‌ను అడగాలని సింపుల్‌గా, స్ట్రెయిట్‌గా సమాధానమిచ్చాడు వసంత్ రవి. అంతే కాకుండా తను తరువాత నటిస్తున్న తెలుగు చిత్రాల గురించి అడగగా.. ‘‘ప్రస్తుతం ‘వెపన్‌’పై ఫోకస్ పెడదాం’’ అని సూటిగా చెప్పేశాడు. మల్టీ స్టారర్ సినిమాలపై కూడా తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు వసంత్ రవి.


అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డ్‌పై వసంత్ రవి రియాక్షన్..
ఇప్పటికే ‘జైలర్’లో రినీకాంత‌తో కలిసి నటించిన తర్వాత ఇంకా ఎవరితో మల్టీ స్టారర్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందని అడిగారు. అంతే కాకుండా ముఖ్యంగా తెలుగుల ఎవరితో మల్టీ స్టారర్ చేయాలని ఉంది అని అడగగా.. అల్లు అర్జున్, రామ్ చరణ్‌తో చేయాలని ఉందని తన మనసులోని మాటను బయటపెట్టాడు వసంత్ రవి. అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డ్ రావడం చాలా సంతోషంగా ఉందని వసంత్ రవి అన్నాడు. ప్రస్తుతం వసంత్ రవి హీరోగా నటిస్తున్న ‘వెపన్’ చిత్రాన్ని గుహన్ సెన్నియప్పన్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీలో వసంత్ రవికి జోడీగా తాన్యా హోప్ నటిస్తోంది. తాజాగా ‘వెపన్’ టీజర్ విడుదలయ్యింది. జిబ్రాన్ సంగీతం అందించాడు. సత్యరాజ్, రాజీవ్ మీనన్ లాంటి సీనియర్ నటులు కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ‘వెపన్’ రిలీజ్ డేట్ ఎప్పుడు అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. క్రైమ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ప్రమోట్ చేయడం కోసం మూవీ టీమ్ అంతా బిజీగా గడిపేస్తున్నారు.


Also Read: 'ఖుషి' కోటి సాయం - చెప్పినట్లుగానే 100 ఫ్యామిలీలను ఎంపిక చేస్తున్న విజయ్ దేవరకొండ!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial