Varun Tej New Movie Announcement: మెగా హీరో వరుణ్‌ తేజ్‌కు ఈ మధ్య పెద్దగా కలిసి రావడం లేదనే చెప్పాలి. కొంతకాలంగా అతడి చిత్రాలన్ని బాక్సాఫీసు వద్ద డిజాస్టర్‌గా నిలుస్తున్నాయి. కనీస టాక్‌ కూడా తెచ్చుకోవడం లేదు. గతేడాది మట్కాతో వచ్చి ఘోర పరాజయాన్నిచూశాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. ప్రీమియర్స్‌తో ప్లాప్‌ టాక్‌ రావడంతో కొన్ని థియేటర్‌లో షోలని సైతం క్యాన్సిల్‌ చేశారు. ఇలా వరుస డిజాస్టర్స్‌ చూసిన వరుణ్‌ తేజ్‌ ఈసారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే ఆశతో ఉన్నాడు. ఇందుకోసం దర్శకుడు మేర్లపాక గాంధీతో జతకట్టాడు. 


వరుణ్‌ తేజ్‌ బర్త్‌డే సర్‌ప్రైజ్‌


మెగా ప్రిన్స్‌ వరుణ్ బర్త్‌డే సందర్భంగా ఆదివారం తన కొత్త సినిమాను ప్రకటించాడు. VT15 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రాన్ని ప్రకటించారు. యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సంయుక్తంగా నిర్మించనున్నారు. హారర్‌ కామెడీ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా కథ ఉండనుందని తెలుస్తోంది. ఇండో - కొరియన్‌ బ్యాక్‌డ్రాప్‌ రూపొందనున్న ఈ చిత్రానికి 'కొరియన్ కనకరాజు' అనే టైటిల్‌ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇందులో వరుణ్‌ తేజ్‌ క్యారెక్టర్‌ సరికొత్తగా ఉండనుందట. వరుణ్‌ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమాపై ప్రకటన ఇస్తూ ప్రీలుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేశారు. VT15 అనే వర్కింగ్ టైటిల్‌తో ఉన్న ఈ పోస్టర్‌లో డ్రాగన్‌ సింబల్‌తో ఉన్న ఓ పాట్‌ను చూపించారు.


ఇండో - కొరియన్‌గా VT15


డ్రాగన్‌ సింబల్‌తో పాటు కొరియన్‌ రాసి ఉన్న ఓ రిబ్బన్‌ కూడా చూపించారు. చూస్తుంటే ఈ పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ని జరుపుకొంటుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను మూవీ టీం వెల్లడించనుంది. కాగా ఇక మేర్లపాక గాంధీ విషయానికి వస్తే ఆయనకు హిట్‌ ట్రాక్‌ రికార్డు ఉన్నా ప్రస్తుతం అతడి చేతిలో పెద్దగా సినిమాలేవి లేవు. గతంలో ఎక్స్‌ప్రెస్‌ రాజా, కృష్ణార్జున యుద్ధం, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, మాస్ట్రో వంటి సినిమాలు తెరకెక్కించారు. ఈ సినిమాలన్ని కూడా మంచి విజయం సాధించాయి. దీంతో ఆయన నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న చిత్రమిది.


అలాగే వరుస ప్లాప్స్‌ తర్వాత ఓ మంచి కంబ్యాక్‌ కోసం చూస్తున్న వరుణ్‌ మేర్లపాకను నమ్ముకున్నాడంటే ఈసారి ఈ కాంబో గట్టి ప్లాన్‌తోనే వస్తుందని ఆడియన్స్‌ అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈ రోజు రిలీజైన మూవీ పోస్టర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తుంది. చూస్తుంటే ఈ ప్రాజెక్ట్‌పై ఆడియన్స్‌లో అంచనాలు నెలకొన్నట్టు కనిపిస్తుంది. ఇదిలా ఉంటే గతేడాది మట్కాతో వచ్చిన వరుణ్ ఈ చిత్రం భారీ డిజాస్టర్‌ని ఇచ్చింది. దాదాపు రూ. 20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 5 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. వరుణ్‌ కెరీర్‌లోనే అత్యంత తక్కువ కలెక్షన్స్‌ తెచ్చిపెట్టన సినిమాగా మట్కా భారీ డిజాస్టర్‌ని ఇచ్చింది. పలాస 1978 ఫేం కరుణ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాని విజయేందర్‌రెడ్డి, రజనీ తాళ్లూరి నిర్మించారు.