Akash Puri Gave 1 lakh Cheque to Pavala Shyamala : డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ కొడుకు ఆకాష్‌ పూరి గొప్ప మనసు చాటుకున్నాడు. దీనస్థితిలో ఉన్న సీనియర్‌ నటికి ఆర్థిక సాయం అందించి అండగా నిలిచాడు. నటి పావలా శ్యామల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె పేరు చెబితే ఇప్పటి జనరేషన్‌ గుర్తు పట్టకపోవచ్చు కానీ, 90లలోని వారు అయితే వెంటనే చెప్పేస్తారు. ఉదయ్‌ కిరణ్, హీరో తరుణ్‌ చిత్రాల నుంచి చిరంజీవి ఠాగూర్‌, ప్రభాస్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ వంటి అగ్ర హీరో సినిమాల్లో ఆమె కీలక పాత్రలు పోషించారు.

ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా అలరించిన ఆమె ప్రస్తుతం వయోభారంతో పాటు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే ఎన్నోసార్లు ఆమె తన బాధను వెల్లబుచ్చుకున్నారు. అసలే ఒంటిరి జీవితం, నడవలేని స్థితిలో ఉన్న కూతురు, ఆర్థిక ఇబ్బందులతో కొంతకాలంగా పావలా శ్యామల ఇబ్బందులు పడుతున్నారు. ఇండస్ట్రీ ప్రముఖులు స్పందించి తనకు ఆర్థిక సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పట్లో మెగాస్టార్‌ చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు ఆమెకు ఆర్థిక సాయం అందించారు. ఆ తర్వాత ఆమెను అంతా మర్చిపోయారు. ప్రస్తుతం ఆమె ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ఇటీవల ఆమె ఓ వీడియో రిలీజ్‌ చేశారు. 

లక్ష రూపాయల చెక్కు అందజేత

ఇటీవల ఆమె వీడియో రిలీజ్ చేస్తూ.. యాభై ఏళ్లు క‌ష్ట‌ప‌డి న‌టిగా బ్రతికానన్నారు. కానీ ఈ మూడేళ్ల నుంచి తన ప‌రిస్థితి మరింత దిగజారిపోయింది. అరోగ్యం కూడా క్షీణించిందని, కనీసం మాట్లాడే శక్తి కూడా తనలో లేదన్నారు. తన సమస్యలను చాలా ఇంట‌ర్వ్యుల‌లో కూడా చెప్పానంది. ఒకరిద్దరు తప్ప పెద్దగా ఎవ‌రు స్పందించ‌లేదన్నారు. ప్రస్తుతం కొన ఊపిరితో ఉన్నానని, నటిగా ఒకప్పుడు చిరంజీవి, ప్రభాస్‌, మ‌హేశ్ బాబు, ఎన్టీఆర్ ఇలా ఎందరో పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేసిన తాను ఆఖరికి ఆత్మహత్య చేసుకునే స్థితిలో ఉన్నానంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

కనీసం చికిత్స చేయించుకోలేక అవస్థలు పడుతున్నానని, ఇండస్ట్రీ పెద్దలు దయదలచి తనకు సాయం అందించాలని ఆమె కోరారు. ఆమె వీడియోకు చలించిన ఆకాష్‌ పూరీ పావలా శ్యామలకు ఆర్థిక సాయం అందించాడు. అతడే స్వయంగా వెళ్లి లక్ష రూపాయల చెక్కు అందించారు. అనంతరం ఆమెతో కాసేపు మాట్లాడి యోగక్షేమాలు అడిగారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతానికి లక్ష రూపాయల సాయం అందించిన ఆకాష్‌ భవిష్యత్తులో తనకు ఎలాంటి ఇబ్బంది ఉన్న ఆదుకుంటానని భరోసా ఇచ్చాడు. ఓల్డేజ్‌ హోంలో ఉన్న పావలా శ్యామలను కలిసిన ఆకాష్‌ పూరీ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

ఒక్క హిట్ లేదు.. అయినా

డైరెక్టర్‌ పూరీ కొడుకుగా ఇండస్ట్రీలోకి అడుగుపట్టిన ఆకాశ్‌ ప్రస్తుతం హీరోగా తనని తాను ప్రూవ్‌ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటి వరకు మూడు, నాలుగు సినిమాలు చేసిన అతడికి చెప్పుకొదగ్గ హిట్‌ లేదు. చిరుత, బుచ్చిగాడు వంటి పలు చిత్రాలతో చైల్డ్‌ ఆర్టిస్టుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ఆకాష్‌ ఆంధ్రాపోరి సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత తండ్రి పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వచ్చిన మెహబూబా సినిమాతో వచ్చాడు. ఈ చిత్రం కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. తొలి చిత్రంతోనే ప్లాప్‌ అందుకున్న ఆకాష్‌ ఆ తర్వాత రొమాంటిక్‌ చిత్రంతో వచ్చాడు. ఇది కూడా ఆకాష్‌కు హిట్‌ ఇవ్వలేకపోయింది. ఇటీవల చోర్‌బజార్‌తో తన లక్క్‌ని పరిక్షించుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఈ సినిమా బోల్తా కొట్టింది. దీంతో ఈసారి ఎలాగైన ఓ బిగ్‌ హిట్‌ కొట్టాలని ఎదురుచూస్తున్న ఆకాష్‌ ఇప్పటి వరకు ఎలాంటి సినిమాను ప్రకటించలేదు. ప్రస్తుతం స్క్రిప్ట్స్‌ వింటున్న అతడు త్వరలోనే ఓ మంచి ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల మందుకు వస్తున్నానంటూ ఆ మధ్య ఓ వీడియోలో చెప్పాడు.  

Also Read : బాక్సాఫీసు వద్ద వెంకీమామ దూకుడు - షాకిస్తున్న 'సంక్రాంతికి వస్తున్నాం' 5 రోజుల కలెక్షన్స్‌, ఎంతంటే!