Suzhal Sequel on OTT | 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో ఈ ఏడాది సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్టును తన ఖాతాలో వేసుకుంది ఐశ్వర్య రాజేష్. విక్టరీ వెంకటేష్ సరసన 'భాగ్యం' అనే పాత్రలో నటించి, ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ త్వరలోనే 'సుజల్' అనే తన క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీ మూవీ లవర్స్ ను పలకరించడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన రిలీజ్ డేట్ అప్ డేట్ వచ్చేసింది.


ఫిబ్రవరిలో 'సుజల్' సీక్వెల్...


ఐశ్వర్య రాజేష్ లీడ్ రోల్ పోషించిన వెబ్ సిరీస్ 'సుజల్'. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ వెబ్ సిరీస్ కు సీక్వెల్ త్వరలోనే తెరపైకి రాబోతోంది. క్రైమ్ థ్రిల్లర్ జానర్ లో రూపొందిన 'సుజల్' వెబ్ సిరీస్ సీజన్ 2 రిలీజ్ డేట్ పై ప్రస్తుతం నెట్టింట ఓ వార్త హల్చల్ చేస్తోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'సుజల్' సీక్వెల్ ఫిబ్రవరిలో స్ట్రీమింగ్ కాబోతోందనేది ఆ వార్తల సారాంశం. ఈ మేరకు ఫిబ్రవరి 21 నుంచి 'సుజల్' సీక్వెల్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని టాక్ నడుస్తోంది. కానీ దీనిపై ఇంకా అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు.


'సుజల్' సీజన్ 2 లో ఐశ్వర్య రాజేష్ తో పాటు మంజుమా మోహన్, గౌరీ కిషన్, ఖాతిర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ కి సర్జన్, బ్రహ్మ దర్శకత్వం వహిస్తుండగా, పుష్కర్ - గాయత్రి క్రియేటర్స్ గా వ్యవహరిస్తున్నారు. సీక్వెల్ మొత్తం క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా తెరకెక్కినట్టు తెలుస్తోంది. అయితే సీజన్ 1కి మించి టర్న్స్, ట్విస్ట్ లతో సీజన్ 2 ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అంటున్నారు. మరో గుడ్ న్యూస్ ఏంటంటే 'సుజల్' సీజన్ 2 తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ కాబోతోంది.


'సుజల్' స్టోరీ ఇదే...


'సుజల్' సిరీస్ 2022లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సీజన్ 1లో ఐశ్వర్య రాజేష్, ఖాతిర్ తో శ్రియా రెడ్డి, పార్తిబన్ ప్రధాన పాత్రలు పోషించారు. మొదటి సీజన్ స్టోరీ ఏంటంటే... ఓ ఊర్లో సిమెంట్ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాదంలో కాలిపోతుంది. దీంతో యూనియన్ ప్రెసిడెంట్ షణ్ముగం ఫ్యాక్టరీ ఓనర్ పై కక్షతో ఈ పని చేశాడని పోలీసులు డౌట్ పడతారు. ఇలాంటి టైంలో అతని కూతురు మిస్ అవుతుంది. ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేసిన క్రమంలో పోలీస్ ఆఫీసర్ రెజీనా కొడుకు, షణ్ముగం కూతురు ప్రేమించుకున్నారు అనే విషయాన్ని మరో పోలీస్ ఆఫీసర్ చక్రవర్తి కనిపెడతాడు. తమ ప్రేమకు పెద్దలు అంగీకరించరు అనే భయంతో వారిద్దరూ ముంబైకి వెళ్లారని రూమర్స్ నడుస్తుండగా, ఈ జంట ఊరి చెరువులో శవాలై తేలుతారు. కానీ పోస్టుమార్టంలో మాత్రం మర్డర్ జరిగినట్టు తెలుస్తుంది. మరి ఈ ప్రేమ జంట హత్యకు కారణమేంటి? ఎవరు చేశారు? ఇందులో నందిని ఎవరు? అనే విషయాలను 'సుజల్' సీజన్ 1లో చూపించారు. ఈ వెబ్ సిరీస్ పై రాజమౌళి సైతం ప్రశంసల వర్షం కురిపించారు.