Varun Tej: టాలీవుడ్‌లో చాలాకాలం తర్వాత ఒక హీరో, హీరోయిన్ పెళ్లి చేసుకున్నారు. వారే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి. ఇక పెళ్లి తర్వాత ఎవరి కెరీర్‌లో వారు బిజీ అయిపోయారు. ఇప్పటికే లావణ్య త్రిపాఠి.. ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పుడు వరుణ్ తేజ్ వంతు. తను హీరోగా నటిస్తున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ ఎన్నో వాయిదాల తర్వాత మార్చి 1న విడుదలకు సిద్ధమయ్యింది. దీంతో మూవీ టీమ్ అప్పుడే ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. తాజాగా పలువురు కాలేజీ విద్యార్థులకు మూవీ టీమ్ ముచ్చటించగా.. వారు అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు వరుణ్ తేజ్.


తననే పెళ్లి చేసుకున్నా..


శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమే ‘ఆపరేషన్ వాలెంటైన్’. ఇందులో వరుణ్ తేజ్‌కు జోడీగా మానుషి చిల్లర్ నటిస్తోంది. మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న మానుషి.. ఈ మూవీతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్‌తో పాటు ఇతర మూవీ టీమ్ కూడా ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటోంది. అందులో భాగంగానే తాజాగా ఒక ప్రైవేట్ కాలేజీకి వెళ్లింది టీమ్. అక్కడ విద్యార్థులు వరుణ్ తేజ్‌ను ప్రశ్నలు అడగడానికి ఆసక్తిగా ముందుకు వచ్చారు. ముందుగా తన ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని వరుణ్ తేజ్‌కు ప్రశ్న ఎదురయ్యింది. దానికి సమాధానంగా.. ‘‘నా ఫేవరెట్ హీరోయిన్‌నే పెళ్లి చేసుకున్నా’’ అని సమాధానమిచ్చాడు. లావణ్య కాకుండా తనకు సాయి పల్లవి అంటే అభిమానమని చెప్పాడు.


మంచి కథ కావాలి..


పెళ్లికి ముందు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి రెండు సినిమాల్లో హీరోహీరోయిన్లుగా నటించారు. పెళ్లి తర్వాత కలిసి నటిస్తారా అని అడగగా.. మంచి కథలు వస్తే కలిసి చేస్తామని క్లారిటీ ఇచ్చాడు వరుణ్ తేజ్. వారిద్దరిలో ముందు తానే ప్రపోజ్ చేశానని రివీల్ చేశాడు. ‘‘ఎయిర్ ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెలుగులో వస్తున్న మొదటి సినిమా ఇదే. కామెడీ సినిమాలు ఎన్ని అయినా చేయొచ్చు. కానీ దేశం కోసం ఏం చేసినా గొప్పగానే ఉంటుంది’’ అంటూ ‘ఆపరేషన్ వాలెంటైన్’ గురించి చెప్పుకొచ్చాడు. తన నుండి మాస్‌ను ఆశిస్తున్న ప్రేక్షకులు ‘మట్కా’ కోసం ఎదురుచూడమని క్లారిటీ ఇచ్చాడు. బాబాయ్ పవన్ కళ్యాణ్‌తో సినిమా చేయాలని తనకు కూడా కోరిక ఉందని, మంచి కథ దొరకాలి కదా అంటూ తన కోరికను బయటపెట్టాడు వరుణ్ తేజ్.


ఎయిర్ ఫోర్స్ వీరుల కథ..


ఇప్పటివరకు వరుణ్ తేజ్ ఎక్కువగా ప్రేమకథలతోనే హిట్ కొట్టాడు. కమర్షియల్ సినిమాలు తనకు అంతగా కలిసి రాలేదు. ఇప్పుడు ‘ఆపరేషన్ వాలెంటైన్‌’లో మొదటిసారిగా ఒక పైలెట్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా ద్వారా ‘‘దేశంలోని ఎయిర్ ఫోర్స్ వీరుల పోరాటాన్ని, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కుంటున్న ఇబ్బందులను అద్భుతంగా చూపించాం’’ అంటూ మూవీ టీమ్ చెప్పింది. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్, రినైసన్స్ పిక్చర్స్ కలిసి ‘ఆపరేషన్ వాలెంటైన్’ను భారీ ఎత్తున నిర్మించాయి. ఇందులో వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ కెమిస్ట్రీ కూడా బాగుందని తాజాగా విడుదలయిన ‘గగనాల తేలేను’ పాట చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు.


Also Read: నిర్మాతగా మారిన ఆలియా - అడవులపై జరుగుతున్న నేరాలపై వెబ్ సిరీస్