మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej), సొట్ట బుగ్గల సుందరి & ఉత్తరాది అందాల భామ లావణ్యా త్రిపాఠి (Lavanya Tripathi) ప్రేమలో ఉన్నారు. అది పాత విషయమే. త్వరలో ఏడు అడుగులు వేయబోతున్నారు. ఆ విషయమూ ప్రేక్షకులకు తెలుసు. కుటుంబ సభ్యుల సమక్షంలో వాళ్లిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. పెద్దల అనుమతితో వచ్చే నెలలో పెళ్లి పీటలు ఎక్కడానికి రెడీ అవుతున్నారు. నవంబర్ 1న పెళ్లి ముహూర్తం ఖరారు చేసినట్లు తెలిసింది. అసలు, ఇద్దరిలో ముందుగా లవ్ ప్రపోజ్ చేసింది ఎవరు? ప్రేమకథ ఎప్పుడు మొదలైంది? ఈ విషయాలు అన్నీ వరుణ్ తేజ్ చెప్పారు. 


ముందు నేనే ప్రపోజ్ చేశా - వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ కథానాయకుడిగా నటించిన 'గాండీవధారి అర్జున' సినిమా శుక్రవారం థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చారు. సినిమాతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు సైతం వరుణ్ తేజ్ ముందుకు వచ్చాయి. లావణ్య త్రిపాఠితో ప్రేమ కథ గురించి అడగ్గా... ''ఏడేళ్ళ క్రితం కథ'' అని బదులు ఇచ్చారు.   


'మిస్టర్'లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి తొలిసారి జంటగా నటించారు. 'మిస్టర్' తర్వాత 'అంతరిక్షం'లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మరోసారి జంటగా నటించారు. మొదటి సినిమాతో వారి మధ్య మొదలైన పరిచయం... రెండో సినిమాకు ప్రేమగా మారింది. జీవితంలో సరైన సమయంలో తాను సరైన వ్యక్తిని కలిసినట్టు వరుణ్ తేజ్ తెలిపారు. లావణ్య తనకు మంచి స్నేహితురాలని, ఆరేళ్ళ తమ పరిచయాన్ని మరోమెట్టు ఎక్కించాలని భావించినట్లు ఆయన వివరించారు. 


ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరు? లావణ్యనా? లేదంటే మీరు ప్రపోజ్ చేశారా? అని అడిగితే... ''నేనే'' అని వరుణ్ తేజ్ బదులు ఇచ్చారు. పెళ్లి ఎక్కడ చేసుకుంటున్నారు? అని అడిగితే మాత్రం ఆయన చెప్పలేదు. ఇటలీలో పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయని వినిపిస్తోందని గుర్తు చేయగా... ''అది ఒక ఆప్షన్ మాత్రమే'' అని చెప్పారు. పెళ్లి వేదికను ఇంకా ఖరారు చేయలేదని ఆయన తెలిపారు. 


Also Read సగమే తీసుకున్న వరుణ్ తేజ్, ప్రవీణ్ సత్తారు - నిర్మాతకు లాభాలే ముఖ్యమంటూ   



పెళ్లికి కూడా కొందరే!
జూన్ 9న వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి నిశ్చితార్థం జరిగింది. ఆ కార్యక్రమానికి కేవలం కుటుంబ సభ్యులు, కొంత మంది సన్నిహితులను మాత్రమే ఇన్వైట్ చేశారు. పెళ్ళికి కూడా ఆ విధంగా కొంత మందిని ఆహ్వానించాలని డిసైడ్ అయ్యారట. పెళ్ళైన కొన్ని రోజులకు హైదరాబాద్ సిటీలో సినిమా ఇండస్ట్రీ ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. పెళ్లికి ఎవరెవరిని ఇన్వైట్ చేయాలని అనుకుంటున్నారో లిస్టు రెడీ అయ్యిందట. వాళ్ళకు త్వరలో పెళ్లి కబురు చెప్పనున్నారు.  


Also Read విజయ్ దేవరకొండతో ఆ రెండూ మిస్ - 'ఖుషి' వాళ్ళ కాంబినేషన్‌లో మూడోది!


'గాండీవధారి అర్జున'తో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న వరుణ్ తేజ్... మరో రెండు సినిమాలు చేస్తున్నారు. ఆ రెండూ  పాన్ ఇండియా సినిమాలే. ఓ సినిమా 'ఆపరేషన్ వేలంటైన్' షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. 'పలాస' ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో చేయనున్న సినిమా 'మట్కా' చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదు. 



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial