టాలీవుడ్ స్టార్ కపుల్స్ లిస్టులో వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి జోడీ కూడా చేరింది. ఈ జంట ఇటలీలో వివాహం చేసుకుంది. 'అందాల రాక్షసి'తో తెలుగు చిత్రసీమకు పరిచయమైన ఉత్తరాది భామ, సొట్టబుగ్గల సుందరి మెగా ఇంటి కోడలు అయ్యింది. పెళ్లిలో లావణ్య కాంచీపురం శారీ కట్టుకున్నారు. అయితే... ఆ చీరకు ఓ ప్రత్యేకత ఉంది. దానిపై స్పెషల్ ఎంబ్రాయిడరీ చేయించారు ఆమె! అది ఏమిటో చూశారా?
వరుణ్ లావ్ ఇన్ఫినిటీ!
వరుణ్ తేజ్ (Varun Tej)ను మెగా ఫ్యామిలీ, ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగా 'వరుణ్' అని పిలుస్తారు. మరి, లావణ్యా త్రిపాఠి (Lavanya Tripathi)ని 'లావ్' అని అంటుంటారు. రెండు ముద్దు పేర్లను కలిపి శారీ మీద తెలుగులో రాయించుకుని వాటి పక్కన ఇన్ఫినిటీ సింబల్ పెట్టారు లావణ్య త్రిపాఠి.
కింద ఉన్న ఫోటో చూశారా? 'వరుణ్ లావ్ ఇన్ఫినిటీ' (Varun Lav Wedding) అని రాసి ఉంది. తమ ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ అంతులేనిది అని, తామిద్దరం కలకాలం ఒక్కటిగా ఉండాలని పరోక్షంగా లావణ్యా త్రిపాఠి ఈ విధంగా రాశారేమో!? అన్నట్టు... సోషల్ మీడియాలోనూ వరుణ్ లావ్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.
తెలుగు సంప్రదాయానికి లావణ్య గౌరవం!
లావణ్య త్రిపాఠి ఎప్పుడో తెలుగు అమ్మాయి అయిపోయారు. తెలుగు సినిమాలు చేయడమే కాదు... తెలుగు నేల (హైదరాబాద్)లో చాలా రోజుల క్రితమే సొంత ఇల్లు కూడా కొనుక్కున్నారు. ఇప్పుడు తెలుగింటి కోడలు అయిన ఆవిడ... పెళ్లిలో చీర మీద తెలుగులో తమ జంట పేర్లు రాయడం ద్వారా తెలుగు భాషకు, ఇక్కడి సంప్రదాయానికి గౌరవం ఇచ్ఛారని చెప్పుకోవాలి.
ఆదివారం ఇండస్ట్రీ ప్రముఖులకు రిసెప్షన్!
ఇటలీలో జరిగిన వరుణ్ తేజ్, లావణ్యా త్రిపాఠి పెళ్లికి ఇండియా నుంచి సుమారు 120 మంది వరకు వెళ్లారు. అందులో మెగా కుటుంబంలో సభ్యుల సంఖ్య 50 వరకు ఉందని తెలిసింది. నితిన్, నీరజా కోన వంటి స్నేహితులు కొందరు, లావణ్యా త్రిపాఠి కుటుంబ సభ్యులు ఉన్నారు.
Also Read : మహేష్ బాబు సినిమాలో మసాలా బిర్యానీ - నెట్టింట 'గుంటూరు కారం' లీక్డ్ సాంగ్!
ఇటలీలో జరిగిన వివాహానికి కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధు మిత్రులను మాత్రమే ఆహ్వానించడంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీలలో సన్నిహితులకు ఆదివారం (రేపు, నవంబర్ 5న) వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వెడ్డింగ్ రిసెసిప్షన్ ఏర్పాటు చేసింది మెగా ఫ్యామిలీ.
ఇండియా వచ్చేసిన మెగా ఫ్యామిలీ!
ఇటలీలో వరుణ్ లావ్ పెళ్లి వేడుక ముగియడంతో మెగా ఫ్యామిలీలో ఒక్కొక్కరూ హైదరాబాద్ చేరుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ శుక్రవారం వచ్చారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ తదితరులు వచ్చారు. శనివారం ఉదయం కొత్త జంట హైదరాబాద్ వస్తుందని తెలిసింది.
Also Read : 'పొలిమేర 2' రివ్యూ : థియేటర్లలో హిట్ అయ్యే కంటెంట్ ఉందా? ఫస్ట్ పార్ట్ కంటే బావుందా?