టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ లేటేస్ట్ మాస్ యాక్షన్ మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటించింది. కొత్త దర్శకుడు యం.యస్ రాజశేఖర్ రెడ్డి తెరకెక్కంచిన ఈ మూవీ పెద్దగా హిట్ కొట్టలేదు. ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ దర్శకత్వంలో మరో సినిమాను చేస్తున్నాడు. నితిన్ ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క నిర్మాతగా కూడా తన లక్ పరీక్షించుకుంటున్నాడు. నితిన్ గత ఏడాది తమ హోమ్ బ్యానర్ అయిన శ్రేష్ఠ మూవీస్ లో కమల్ హాసన్ నటించిన విక్రమ్ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేశాడు. ఈ సినిమా మంచి హిట్ కొట్టింది. ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమా ‘కబ్జా’ను తెలుగులో రిలీజ్ చేయబోతున్నాడు. ఇందులో ఉపేంద్ర ప్రధాన పాత్రను పోషించనున్నారు. కన్నడ హీరో ఉపేంద్రకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన పాతికేళ్ల క్రితం నటించిన ఉపేంద్ర సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత పలు డబ్బింగ్ సినిమాలతో పాటు కన్యాదానం, సన్నాఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులయ్యారు.
కబ్జా సినిమా ఆర్. చంద్రు దర్శకత్వంలో 1970 బ్యాక్ డ్రాప్ లో భారీ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇందులో ఉపేంద్ర గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నట్టు నితిన్ స్వయంగా ట్విట్టర్ లో ప్రకటించాడు. కబ్జా చిత్రాన్ని రుచిరా ఎంటర్టైన్మెంట్స్, ఎన్ సినిమాస్ బ్యానర్ పై తెలుగులో రిలీజ్ చేస్తున్నట్లు నితిన్ తెలిపారు. అయితే ఈ సినిమా మార్చి 17, 2023న 7 భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవడానికి సిద్ధమైంది. కాగా ఇందులో మరో కన్నడ హీరో సుదీప్ కూడా నటిస్తున్నాడు. శ్రియా శరణ్, బొమన్ ఇరానీ, ప్రకాష్ రాజ్, కబీర్ దుహన్ సింగ్, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, జగపతి బాబులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ సిద్దేశ్వర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాను కన్నడ, తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, మరాఠి, బెంగాలీ మొత్తం ఏడు భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
‘కబ్జా’ ఫస్ట్ లుక్, టీజర్ ను విడుదల చేసినప్పుడే ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా మరో కేజీఎఫ్ మాదిరిగా హిట్ అవుతుందని అంచనాలు వేస్తున్నారు. ఎందుకంటే కన్నడ చిత్రాలైన కేజీఎఫ్, 777 చార్లి, విక్రాంత్ రోణ్, కాంతార సినిమాలు దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈ సినిమాల తర్వాత శాండిల్ వుడ్ నుంచి ఆ స్థాయి అంచనాలతో వస్తోంది కబ్జా. తెలుగు ప్రేక్షకులకు దశాబ్దాలుగా పరిచయమున్న ఉపేంద్ర, ఈ సినిమాలో హీరోగా నటించడంతో, టాలీవుడ్ లో ‘కబ్జా’కు మంచి రీచ్ ఉంటుందని భావిస్తున్నారు. అయితే స్వాతంత్ర్య సమరయోధుడు కొడుకు మాఫియా వరల్డ్ లో ఎలా చిక్కుకున్నాడు. తర్వాత ఏ రేంజ్ కు చేరుకున్నాడనే కథాంశంతో కబ్జా సినిమాను తెరకెక్కించారు.
Read Also: బాత్రూమ్‌లో కూర్చోని ఏడ్చిన షారుఖ్ - కింగ్ ఖాన్‌ను అంతగా బాధపెట్టిన విషయం ఏమిటీ?