బాలయ్య హోస్టుగా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సెలబ్రిటీ టాక్ షో 'అన్ స్టాపబుల్ సీజన్ 4'. ఇప్పటికే మూడు సీజన్ లు విజయవంతంగా కంప్లీట్ చేయగా, ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న నాలుగవ సీజన్లో కూడా పలువురు సెలబ్రిటీలు బాలయ్య షోలో కనిపించి ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే తాజాగా బాలయ్య 'అన్ స్టాపబుల్' షోకి వెంకటేష్ గెస్ట్ గా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా ఆహా రిలీజ్ చేసింది.
ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు తెలుగు ఓజీలు
తాజాగా రిలీజ్ అయిన 'అన్ స్టాపబుల్ సీజన్ 4' ఎపిసోడ్ 7 ప్రోమోలో "వెల్కమ్ మై డియర్ విక్టరీ వెంకటేష్" అంటూ బాలయ్య వెల్కమ్ చెప్పారు. ఆ వెంటనే బాలయ్య అమాయకంగా మొహం పెట్టేసి "మనం ఒకరికొకరం పోటీనా?" అని వెంకటేష్ ని ప్రశ్నించారు. దానికి సమాధానం గా వెంకటేష్ "ఎక్కడమ్మా పోటీ" అని చెప్పారు. ఆ తర్వాత వెంకటేష్ "డాకు మహారాజ్" అని హైప్ ఇవ్వగా, బాలకృష్ణ అందుకొని "నా మనసులో నువ్వే మహారాజ్" అని డైలాగ్ వేశారు. ఇక ఆ తర్వాత ఇద్దరూ కలిసి గతాన్ని గుర్తు తెచ్చుకోవడం మొదలుపెట్టారు. బాలయ్య "నిన్ను చూస్తుంటే నాకు మన స్టార్టింగ్ డేస్ గుర్తొస్తున్నాయి" అని చెప్పారు. అలాగే గతంలో బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, చిరంజీవి కలిసి ఉన్న ఫోటోని స్క్రీన్ పై వేశారు. "సూపర్ స్టార్స్ లా ఉన్నాం కదా?" అని వెంకటేష్ అనగానే, "ఇండస్ట్రీకి నాలుగు స్తంభాలు" అంటూ బాలయ్య చెప్పుకొచ్చారు. అలాగే "రాముడు మంచి బాలుడు" అనే డైలాగ్ చెప్పి బాలయ్య తెగ సిగ్గు పడిపోయారు. వెంటనే వెంకటేష్ అందుకుని "హలో కొంపతీసి నువ్వా రాముడు?" అని అడిగారు. ఆ వెంటనే బాలయ్య "అలా భయపెట్టిస్తే ఎలా" అంటూ ఫన్నీగా పంచ్ వేశారు.
నాగ చైతన్యతో ఎమోషనల్ బాండింగ్
ఇక ఈ షోలో కేవలం ఫన్ మాత్రమే కాదు ఎమోషన్స్ కూడా ఉంటాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలయ్య, వెంకటేష్ తో పాటు నాగ చైతన్య ఉన్న ఫోటోని షోలో భాగంగా చూపించారు. దాన్ని చూసిన వెంటనే వెంకటేష్ "సాధారణంగా చాలామంది పిల్లల్ని మనం హగ్ చేసుకుంటాము. కానీ వీడిని హగ్ చేస్తే ఒక తెలియని ఆనందం వస్తుంది" అంటూ చెప్పుకొచ్చారు. అలాగే తన కూతుర్లను ప్రేక్షకులకు పరిచయం చేశారు. అంతేకాదు రానాతో ఉన్న ఎమోషనల్ బాండింగ్ ని కూడా మాట్లాడారు.
షోలో భాగంగా సురేష్ బాబుని ఇన్వైట్ చేయగా, ఆయన వెంకటేష్ గురించి ఆయన ఒక ఎమోషనల్ విషయాన్ని బయటపెట్టారు. "నమ్మిన వాళ్ళే మోసం చేశారు" అంటూ సురేష్ బాబు చెప్పగా, వెంకీ ఎమోషనల్ అయ్యారు. ఇక ఆ తర్వాత 'సంక్రాంతికి వస్తున్నాం' డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎంట్రీ ఇవ్వడంతో మరోసారి షో ఫన్ గా మారినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతుండగా, డిసెంబర్ 27న రాత్రి 7 గంటలకు పూర్తి ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.