Sandhya Theatre Incident | హైదరాబాద్: పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన కేసులో టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) విచారణకు హాజరు కానున్నారు. మరికాసేపట్లో తన లీగల్ టీమ్‌తో కలిసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు రానున్నారు. ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డ్ చేయనున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలంటూ చిక్కడపల్లి పోలీసులు సోమవారం రాత్రి ఆయనకు నోటీసులు ఇచ్చారు.
అర్ధరాత్రి లీగల్ టీమ్‌తో అర్ధరాత్రి భేటీ
పోలీసుల నోటిసులపై అల్లు అర్జున్ తన లీగల్ టీమ్‌తో అత్యవసరంగా సమావేశమై చర్చించారు. విచారణ సమయంలో అడిగే ప్రశ్నలపై ఎలా స్పందించాలి, తనకు సంబంధించి కేసుతో సంబంధం లేదనే విషయాన్నే ప్రస్తావించాలని లీగల్ టీమ్ నటుడికి సూచించినట్లు తెలుస్తోంది. దీంతో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో నేటి విచారణపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది. అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు ఇదివరకే అరెస్ట్ చేయగా, నాంపల్లి కోర్టు రెండు వారాల రిమాండ్ విధించింది. అదేరోజు అల్లు అర్జున్ లాయర్లు హైకోర్టును ఆశ్రయించడంతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మరుసటి రోజు ఉదయం అల్లు అర్జున్ చంచల్ గూడ జైలు నుంచి విడులయ్యారు.
డిసెంబర్ 4న పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ కు అల్లు అర్జున్ కుటుంబంతో పాటు వెళ్లారు. ఒక్కసారిగా థియేటర్ గేట్లు తెరవడం, అభిమానులు భారీ ఎత్తున రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ క్రమంలో రేవతి అనే మహిళ చనిపోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ స్పృహ కోల్పోయాడు. పోలీసులు వెంటనే సీపీఆర్ చేసి హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసులో ఏ11గా అల్లు అర్జున్ ను చేర్చారు.