Sohum Shah's Tumbbad Now Streaming On Amazon Prime Video: హారర్ థ్రిల్లర్ మూవీస్ అంటేనే చాలా మంది మూవీ లవర్స్‌ ఎదురుచూస్తుంటారు. అలాంటి సూపర్ థ్రిల్లింగ్ చిత్రాల్లో హిట్ మూవీ 'తుంబాడ్' (Tumbbad) ఒకటి. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుంది. రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ తొలుత అక్టోబర్ 12, 2018న విడుదలై.. రూ.13.6 కోట్లు రాబట్టింది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ సినిమా 'అమెజాన్ ప్రైమ్' వీడియోతో పాటు నెట్ ఫ్లిక్స్ ప్లాట్ ఫాంలోనూ స్ట్రీమింగ్ అయ్యింది. అయితే, నిర్మాతలు గతేడాది ఆగస్ట్ 30న 'తుంబాడ్' రీ రిలీజ్ చేశారు. ఆ సమయంలో ఓటీటీల వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న చిత్రాన్ని తొలగించారు. రీ రిలీజ్‌లో రూ.31 కోట్లకు పైగా వసూలు చేసింది. ఫస్ట్ టైం విడుదలై రాబట్టిన కలెక్షన్లతో పోలిస్తే ఇది ఏకంగా మూడింతలు. రి రిలీజ్ తర్వాత ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా.? అని ఓటీటీ లవర్స్ ఎదురుచూశారు. 


మరోసారి ఓటీటీలో స్ట్రీమింగ్


ఈ క్రమంలో మరోసారి ఓటీటీ అభిమానుల కోసం 'తుంబాడ్'.. 'అమెజాన్ ప్రైమ్' (Amazon Prime Video) వీడియోలో అందుబాటులోకి వచ్చింది. తెలుగు ఆడియోలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో సోహమ్ షా (Sohum Shah), హరీష్ ఖన్నా, జ్యోతి మల్లే, రుద్ర సోని, మాధవ్ హరి జోషి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు రాహి అనిల్ బార్వే (Rahi Anil Barve) దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 64వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో 3 అవార్డులను గెలుచుకుంది. అటు, ఓటీటీల్లోనూ రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పటికీ ఇండియన్ సినిమాలో ఉన్న టాప్ రేటెడ్ హారర్ చిత్రాలు సెర్చ్ చేస్తే కచ్చితంగా 'తుంబాడ్' కనిపిస్తుంది. ఈ చిత్రం రూపొందించేందుకు నిర్మాతలు ఆరేళ్లు కష్టపడ్డారు. 2012లో షూటింగ్ మొదలు కాగా 2018లో చిత్రం విడుదలైంది.


Also Read: ఆ ఊరిలో మర్డర్ కేసుల మిస్టరీ వీడుతుందా? - లంచ్ బాక్సుల్లో డ్రగ్స్ సరఫరా చేసే ఐదుగురు గృహిణుల స్టోరీ, ఆ 2 ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లు


కథేంటంటే..?



'తుంబాడ్' మూవీ మహారాష్ట్ర జానపద కథల నుంచి స్పూర్తిగా తీసుకుని తీర్చిదిద్దారు. నిజమైన వర్షం కురిసిన సమయంలో వాస్తవ ప్రదేశాల్లో, వందేళ్లలో ఎవరూ వెళ్లని చోటుకి వెళ్లి మరీ షూటింగ్ పూర్తి చేశారు. కథ విషయానికొస్తే.. 1918లో మహారాష్ట్రలోని కలమేడ్ గ్రామంలో వినాయక్ రావు (సోహం షా) తన తల్లి సోదరునితో కలిసి ఉంటాడు. ఊరి గుడిలో నిధి దాగి ఉందన్న వార్త విని దాని కోసం వెతుకుతుంటాడు. ఈ క్రమంలోనే అతనికి ఊహించని పరిణామాలు ఎదురవుతుంటాయి. ఊహించని హారర్ ఎలిమెంట్స్ అను క్షణం ప్రేక్షకులను భయపెడుతుంటాయి.


త్వరలోనే తుంబాడ్ 2


అటు, ఈ చిత్రానికి కొనసాగింపుగా 'తుంబాడ్ 2'ను తీసుకురానున్నారు. దీనికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. స్క్రిప్ట్ పనులు కూడా చివరకు వచ్చాయని.. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు నటుడు, నిర్మాత సోహమ్ షా ఇప్పటికే ప్రకటించారు. 'తుంబాడ్ మాకు ప్రత్యేక ప్రయాణం. ప్రేమతో కూడిన శ్రమ. దీనికి వస్తోన్న ఆదరణ మాటల్లో చెప్పలేనిది. అందుకే 'తుంబాడ్ 2' ద్వారా కథను మరింత లోతుగా తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఇది ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతోంది.' అని పేర్కొన్నారు.


Also Read: అమ్మాయిలే టార్గెట్‌గా నగరంలో సైకో కిల్లర్ అరాచకం - ఆ పోలీస్ ఆఫీసర్ చెక్ పెట్టిందా?, ఆ ఓటీటీలోకి క్రైమ్ థ్రిల్లర్ మూవీ..