Tovino Thomas Donates For Wayanad Land Slide Victims: ప్ర‌కృతి విల‌య‌తాండ‌వం చేసింది. కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ ను అత‌లాకుత‌లం చేసింది. వ‌ర‌ద‌ల‌కు వంద‌లాది మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మంది దిక్కులేని వాళ్లు అయ్యారు. ఇళ్లు కోల్పోయి సాయం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఇప్ప‌టికే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టాయి. అయితే, చాలామంది సెలబ్రిటీలు ముందుకు వ‌చ్చి ఆప‌న్నహ‌స్తం అందిస్తున్నారు. ప్ర‌జ‌ల స‌హాయార్థం డ‌బ్బులు, వ‌స్తువులు ఇచ్చి సాయం చేస్తున్నారు. 


వ‌య‌నాడ్ ప్ర‌జ‌ల కోసం 25 ల‌క్ష‌లు.. వెయ్యి ప్లేట్లు


వ‌య‌నాడ్ టూరిస్ట్ ప్లేస్. నిజానికి నిత్యం ల‌క్ష‌లాది మంది అక్క‌డి అందాలు చూస్తేందుకు వెళ్తుంటారు. కానీ, ప్ర‌స్తుతం అక్క‌డి ప‌రిస్థితి మాత్రం అలా లేదు. ఒక్క ఇల్లు కూడా మిగ‌ల్లేదు. అన్నీ వ‌ర‌ద‌ల‌కి, వ‌ర‌ద‌ల కార‌ణంగా వ‌చ్చిన బుర‌ద‌కి కొట్టుకుపోయాయి. దీంతో సాయం కోసం ఎదురుచూస్తున్నారు అక్క‌డి వాళ్లు. అయితే సెల‌బ్రిటీలు చాలామంది ఇప్ప‌టికే సాయం చేశారు. ఇక ఇప్పుడు మ‌ల‌యాళ న‌టుడు టోవిన్ థామ‌స్ సాయం చేసేందుకు ముందుకు వ‌చ్చాడు. త‌న వంతుగా వ‌య‌నాడ్ ప్ర‌జ‌ల కోసం రూ.25ల‌క్ష‌లు సాయం ప్ర‌క‌టించాడు. దాంతో పాటుగా వెయ్యి స్టీల్ ప్లేట్ల‌ను కూడా అందించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. కేర‌ళ సీఎం రిలీఫ్ ఫండ్ కి ఆ డ‌బ్బులు ఇవ్వ‌నున్నారు. ఆ విష‌యాన్ని చెప్తూ ఆయ‌న వీడియోను రిలీజ్ చేశారు. 






ఇప్ప‌టికే ఎంతోమంది.. 


వ‌య‌నాడ్ ప‌రిస్థితిని చూసిన ఎంతోమంది సెల‌బ్రిటీలు స‌హాయం చేసేందుకు ముందుకు వ‌చ్చారు. త‌మ‌కు తోచినంత సాయం అందిస్తున్నారు. జ్యోతిక‌, సూర్య దంప‌తులు, ర‌ష్మిక మంద‌న్న‌, న‌య‌న్ విఘ్నేష్ దంప‌తులు, చియాన్ విక్ర‌మ్, ఫాహ‌ద్ ఫైజిల్, న‌జ్రియ దంప‌తులు త‌దిర‌తరులు సాయం చేశారు. ఇక ఎంతోమంది సామాన్యులు కూడా కేర‌ళ‌కు అండగా నిలుస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్‌కు చెక్‌లు అందిస్తున్నారు.


స్వ‌యంగా స‌హాయ‌క చ‌ర్య‌ల్లో మోహ‌న్ లాల్.. 


వయనాడ్‌లోని ప్రభావిత ప్రాంతాల్లో మలయాళ సూపర్‌ స్టార్ మోహన్ లాల్ పర్యటించారు. గౌరవ లెఫ్ట్‌నెంట్ హోదాలో వెళ్లిన ఆయన అక్కడి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 122  ఇన్‌ఫాంట్రీ బెటాలియన్‌తో పాటు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నారు మోహన్ లాల్ టెరిటోరియల్ ఆర్మీ బేస్‌ క్యాంప్‌నీ సందర్శించిన ఆయ‌న ప‌రిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొజికోడ్ నుంచి వయనాడ్‌కి రోడ్డు మార్గంలో వెళ్లిన మోహన్‌ లాల్ అక్కడి ఆర్మీ అధికారులతో మాట్లాడారు. ప‌రిస్థితి చాలా దారుణంగా ఉంద‌ని, అన్ని చోట్లా భారీ ఎత్తున బురద పేరుకుపోయిందని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అంతేకాకుండా ఆయ‌న రూ.20ల‌క్ష‌లు విరాళం ఇచ్చారు. దుల్క‌ర్ స‌ల్మాన్ కూడా రూ.15ల‌క్ష‌లు డొనేట్ చేశారు. 


ముమ్మ‌ర స‌హాయ‌క చ‌ర్య‌లు..  


బుర‌ద‌లో చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు, శిథిలాల‌ను తొల‌గించేందుకు ముమ్మ‌ర చ‌ర్య‌లు చేప‌డ‌తున్నారు. ఎన్డీఆర్ ఎఫ్, ఆర్మీ సిబ్బంది తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతోంది. ఇప్ప‌టికే మృతుల సంఖ్య దాదాపు 350 దాటిన్లు అంచ‌నా వేస్తున్నారు అధికారులు. ఇక కేర‌ళ‌కు సాయం చేసేందుకు ఆయా రాష్ట్రాలు ముందుకు వ‌స్తున్నాయి. త‌మిళ‌నాడు సీఎం స్టాలిన్ ఇప్ప‌టికే త‌న సాయాన్ని ప్ర‌క‌టించారు. క‌ర్నాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య కూడా 100 ఇళ్ల‌ను నిర్మించి ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. 


Also Read: శివుడి మీద కాంట్రవర్సీ లేకుండా సినిమా - ముస్లిం దర్శకుడు అప్సర్ మీద ప్రశంసలు