మామూలుగా సినిమాటిక్ యూనివర్స్ అనేవి హాలీవుడ్‌లో తప్పా ఇండియన్ సినిమాల్లో అంత ఫేమస్ కాదు. అయితే హాలీవుడ్ రేంజ్‌లో ఒక సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేయాలని బలంగా డిసైడ్ అయ్యింది ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్. వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ పేరుతో ఇప్పటికే ఈ ఫ్రాంచైజ్‌లో మూడు సినిమాలు వచ్చాయి. ఇప్పుడు నాలుగో చిత్రం కూడా విడుదలకు సిద్ధమయ్యింది. అదే ‘టైగర్ 3’. తాజాగా ‘టైగర్ 3’ ట్రైలర్ గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. అలా ట్రైలర్ లాంచ్ అయ్యిందో లేదో.. ఇలా సల్మాన్ ఫ్యాన్స్ అంతా యూట్యూబ్ రికార్డులు బ్రేక్ చేయడానికి రెడీ అయిపోయారు.


విడుదల ఎప్పుడంటే..
ఇప్పటికే యశ్ స్పై యూనివర్స్ నుంచి ‘టైగర్ జిందా హై’, ‘వార్’, తాజాగా ‘పఠాన్’ చిత్రాలు వచ్చాయి. అయితే వాటి కథతో ‘టైగర్ 3’ కథ ముడిపడి ఉంటుందని సమాచారం. సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చాలాకాలంగా కొనసాగుతూనే ఉంది. అందుకే ఫ్యాన్స్ సైతం ఈ మూవీ అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారా. ఫైనల్‌గా ఏకంగా ‘టైగర్ 3’ ట్రైలర్‌తోనే తన ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు సల్మాన్. నవంబర్ 12న ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతుండడంతో ట్రైలర్‌తో ప్రమోషన్స్‌ను ప్రారంభించింది మూవీ టీమ్. కేవలం హిందీలోనే కాకుండా తెలుగు, తమిళంలో కూడా ‘టైగర్ 3’ విడుదల కానుంది.


విలన్‌గా మారిన రొమాంటిక్ హీరో..
మనీష్ శర్మ డైరెక్ట్ చేసిన ‘టైగర్ 3’ ట్రైలర్ ఫ్యాన్స్ అంచనాలు అందుకునే విధంగానే ఉంది. ఇందులో సల్మాన్‌ను ఎదురుకునే ధీటైన విలన్ పాత్రలో ఇమ్రాన్ హష్మీ కనిపించనున్నాడు. ఇప్పటివరకు కేవలం రొమాంటిక్ హీరోగానే ప్రేక్షకులను అలరించిన ఇమ్రాన్.. మొదటిసారి విలన్‌గా మారాడు. విలన్‌గా ఇమ్రాన్ అసలు మెప్పించగలడా లేదా అని సందేహిస్తున్న ప్రేక్షకులకు ట్రైలరే సమాధానంగా నిలుస్తోంది. ముందుగా ట్రైలర్‌లో తన వాయిస్ ఓవర్ మాత్రమే వినిపించగా.. ఇందులో తన ఫేస్‌ను రివీల్ చేయరేమో అనుకున్నారు ప్రేక్షకులు. కానీ ట్రైలర్ చివరికి వచ్చేసరికి ఇమ్రాన్ ఒక డిఫరెంట్ లుక్‌లో కనిపించి ఆశ్చర్యపరిచాడు. 


‘ఏక్ థా టైగర్’ నుండి ‘టైగర్ 3’ వరకు..
బాలీవుడ్‌లోనే ప్రముఖ టైగర్ ఫ్రాంచైజ్‌లో ఇది మూడో చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ముందుగా 2012లో కబీర్ ఖాన్ దర్శకత్వంలో ‘ఏక్ థా టైగర్’ రిలీజ్ అయ్యింది. అయితే ఆ టైగర్‌కు, ఈ టైగర్‌ 3కు చాలా తేడా ఉందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. వెల్‌కమ్ టు పాకిస్థాన్ అని ఇమ్రాన్ చెప్పే డైలాగ్ వింటుంటే.. ఇది ఇండియాకు, పాకిస్థాన్‌కు మధ్య జరిగే యుద్ధం బ్యాక్‌డ్రాప్‌లో జరిగే కథ అని అర్థమవుతోంది. కానీ స్పై యూనివర్స్‌లోని ముందు సినిమాలలాగా ఇది కేవలం దేశాల మధ్య యుద్ధాల గురించి మాత్రమే కాదని, పర్సనల్ మిషన్ అని ట్రైలర్‌లో సల్మాన్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ పర్సనల్ మిషన్‌లో సల్మాన్, కత్రినా ఇద్దరూ పాల్గొంటారని తెలుస్తోంది. అంతే కాకుండా సల్మాన్‌లాగానే కత్రినా కూడా కొన్ని సీరియస్ ఫైట్స్‌లో పాల్గొంటుందని ట్రైలర్‌లో హింట్ కూడా వదిలింది మూవీ టీమ్.



Also Read: పృథ్వీరాజ్ బర్త్ డే సందర్భంగా సలార్ నుంచి న్యూ పోస్టర్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial