Manjummel Boys: మలయాళ చిత్ర పరిశ్రమలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా చరిత్ర సృష్టించింది 'మంజుమ్మల్‌ బాయ్స్‌'. దాదాపు పదిహేను కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం.. ఫిబ్రవరి 22న థియేటర్లలో విడుదలై, రూ. 200 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ను తెలుగులో రిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు.
 టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీస్, ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్, సుకుమార్‌ రైటింగ్స్‌ కలిసి 'మంజుమ్మల్‌ బాయ్స్‌' సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. 2006లో జరిగిన ఒక యదార్థ సంఘటన నుండి ప్రేరణ పొంది రూపొందిన ఈ సర్వైవల్‌ థ్రిల్లర్‌ ను, అదే టైటిల్ తో 2024 ఏప్రిల్ 6న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ సందర్భంగా తెలుగు వెర్షన్ పోస్టర్ ను మేకర్స్ పంచుకున్నారు.






'మంజుమ్మెల్ బాయ్స్' చిత్రానికి చిదంబరం ఎస్ పొడువల్ దర్శకత్వం వహించారు. ఇందులో సౌబిన్ షాహిర్, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ బాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్, జూనియర్ లాల్, అభిరామ్ రాధాకృష్ణన్, అరుణ్, దీపక్, అర్జున్ కురియన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. పరవ ఫిలింస్ బ్యానర్‌ పై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని ఈ సినిమాని నిర్మించారు. సుశిన్ శ్యామ్ సంగీతం సమకూర్చగా.. షైజు ఖలీద్ సినిమాటోగ్రఫీ నిర్వహించారు. అజయన్ చలిసేరి ప్రొడక్షన్ డిజైనర్ గా.. వివేక్ హర్షన్ ఎడిటర్ గా వర్క్ చేశారు. 


'మంజుమ్మెల్ బాయ్స్' కథేంటంటే...
కేరళకు చెందిన కొంతమంది స్నేహితులు తమిళనాడులోని కొడైకెనాల్‌ ట్రిప్‌ కు వెళ్తారు. అక్కడి గుణ కేవ్స్ గురించి తెలుసుకుని సర్‌ప్రైజ్ అవుతారు. కమల్‌ హాసన్‌ నటించిన 'గుణ' మూవీ షూటింగ్ అక్కడే జరిగిందని తెలియడంతో ఆ గుహల్లోకి వెళ్తారు. అది నిషేధిత ప్రదేశమని గైడ్‌ చెప్పినా వినిపించుకోకుండా వెళ్తారు. ప్రమాదం అని రాసి ఉన్నా పట్టించుకోకుండా వెళ్లిన ఆ గ్యాంగ్ లో ఓ సభ్యుడు ప్రమాదవశాత్తు ఓ లోయలో పడిపోతాడు. ఆ తర్వాత తమ స్నేహితుడిని కాపాడుకోవడానికి వారంతా ఎలాంటి సాహసం చేశారు? ఈ క్రమంలో ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారు? చివరకు తమ ఫ్రెండ్ ను కాపాడుకున్నారా లేదా? అనేదే 'మంజుమ్మెల్ బాయ్స్' కథ.


'ఫ్యామిలీ స్టార్' సినిమాలకి పోటీగా...
మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే 'ఆడు జీవితం - ది గొట్ లైఫ్' అనే మలయాళ సర్వైవల్ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. పృథ్వీరాజ్ సుకుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం.. మార్చి 28న విడుదల కానుంది. ఇదే క్రమంలో ఇప్పుడు 'మంజుమ్మెల్ బాయ్స్' వంటి మరో సర్వైవల్ థ్రిల్లర్ ను తెలుగు ఆడియెన్స్ కు అందించడానికి రెడీ అయ్యారు. కాకపోతే ఈ మూవీకి 'ఫ్యామిలీ స్టార్' వంటి తెలుగు సినిమా నుంచి గట్టి పోటీ ఎదురు కానుంది. దిల్ రాజు బ్యానర్ లో పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 5న థియేటర్లలోకి రాబోతోంది.


Also Read:  'ఓం భీమ్ బుష్' నాలుగు రోజుల కలెక్షన్స్ ఎంతంటే?