ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ ధరల అంశం పై హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం నియమించిన కమిటీ మరోసారి సమావేశం కానుంది. ఫిబ్రవరి 2న కమిటీ భేటీ అమరావతిలో జరగనుంది. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లుతో పాటు ప్రేక్షుకుల సంఘం తరపున కొంత మందికి ఆహ్వానం పంపుతారు. ఇప్పటికే రెండుసార్లు సమావేశం జరిగింది. అయితే రెండు సార్లూ పెద్దగా చర్చలు జరగలేదు. తమ తమ డిమాండ్లను ఆయా వర్గాలు ప్రభుత్వానికి వినిపించాయి. ప్రభుత్వం నియమించిన కమిటీ వాటిని నోట్ చేసుకుంది.


సినిమా టిక్కెట్ల అంశంపై ఫిబ్రవరి పదో తేదీన ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ లోపే కమిటీ భేటీలు పూర్తి చేసి ఓ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని భావిస్తోంది. అలా చేస్తే కమిటీ నివేదిక ప్రభుత్వం వద్ద ఉందని.. ఆ ప్రకారం నిర్ణయం తీసుకుంటుందని హైకోర్టు ఎదుట వాదించడానికి అవకాశం ఉంటుంది. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎంతెంత టిక్కెట్ ధరలు ఖరారు చేస్తుందో క్లారిటీ వస్తుంది.  దీని కోసం టాలీవుడ్ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. టిక్కెట్ ధరల తగ్గింపు వల్ల సినీ పరిశ్రమ అనేక సమస్యలు ఎదుర్కొంటోంది. 


ఇప్పటికే ఈ అంశం టాలీవుడ్ - ఏపీ ప్రభుత్వం మధ్య గ్యాప్ పెంచేసింది. ఇటీవల సీఎం జగన్ కూడా చిరంజీవితో లంచ్ భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా  టిక్కెట్ రేట్ల అంశంతో పాటు టాలీవు‌డ్ సమస్యలపై చర్చించినట్లుగా చెప్పారు.  కానీ ఆ తర్వాత మంత్రి పేర్ని నాని .. సీఎం జగన్‌తో చిరంజీవి భేటీ ఫార్మాలిటీనేనని .. పలకరింపుల కోసమేనని చెప్పారు. అధికారికం కాదన్నారు. దీంతో టాలీవుడ్‌లోనూ కలకలం రేగింది. ఇప్పుడు అధికారికంగా ఉండటానికి చిరంజీవిని టాలీవుడ్ తరపున వచ్చి సమస్యలను కమిటీ ముందు చెప్పాలని ఆహ్వానించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే చిరంజీవికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆహ్వానం అందినా ఆయన హాజరవుతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. 


టిక్కెట్ల వివాదం పరిష్కారం కోసం టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. పెద్ద పెద్ద సినిమాలు విడుదల కోసం ఎదురు చూస్తున్నాయి. విడుదలవుతున్న సినిమాలు కలెక్షన్ల రూపంలో పెద్ద మొత్తంలో కోల్పోతున్నాయి. ప్రభుత్వ కమిటీ తమ కష్టాలను గుర్తించి.. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోలా టిక్కెట్ రేట్లు ఉండేలా సిఫార్సు చేస్తే టాలీవుడ్ గట్టెక్కుతుందని ఆశిస్తున్నారు. అయితే పేదలకు వినోదాన్ని తక్కువ ధరలకే అందుబాటులోకి తెస్తున్నామని వాదిస్తున్న ప్రభుత్వం ఎంత వరకూ సానుకూలంగా ఉంటుందనేది ఎవరికీ అంతుబట్టని విషయం.