Thalapathy Vijay's Ghilli box office collections:  ఇప్పుడంతా రీ రిలీజ్‌ల జ‌మానా న‌డుస్తోంది. హీరోల పుట్టిన రోజు, సినిమా రిలీజై ప‌దేళ్లు లేదంటే సినిమాకి సంబంధించి ఏదైనా రోజు వ‌చ్చిందంటే రీ రిలీజ్ చేసేస్తున్నారు. ఈ మ‌ధ్య కాలంలో ఎన్నో తెలుగు సినిమాలు రిలీజ‌య్యాయి. ఫ‌స్ట్ సారి రిలీజైనప్పుడు హిట్ అయినా కాక‌పోయినా, క‌లెక్ష‌న్లు వ‌చ్చినా రాక‌పోయినా.. రీ రిలీజ్ చేసిన‌ప్పుడు మాత్రం క‌లెక్ష‌న్లు కొల్ల‌గొడుతున్నాయి. త‌మిళ స్టార్ విజ‌య్, త్రిష న‌టించిన 'గిల్లి' సినిమా ఇప్పుడు క‌లెక్ష‌న్ల‌లో దూసుకుపోతోంది. రూ.10 కోట్ల క‌లెక్ష‌న్స్ తో రికార్డులు సృష్టిస్తోంది. 


మూడు రోజుల్లో రూ.10కోట్లు.. 


విజ‌య్ ద‌ళ‌ప‌తి, త్రిష క‌లిసి న‌టించిన సినిమా 'గిల్లి'. 'ఒక్క‌డు' సినిమా రీమేక్ గిల్లి. 2004లో ఈ సినిమా రిలీజ్ కాగా.. మూడు రోజుల కింద రీ రిలిజ్ చేశారు. అయితే, రీ రిలీజ్ సంద‌ర్భంగా సినిమా క‌లెక్ష‌న్ ల‌లో దూసుకుపోతోంది. దేశ వ్యాప్తంగా రూ.10 కోట్లు క‌లెక్ష‌న్ల‌తో రికార్డు సృష్టించింది. ఆదివారం కంటే.. సోమ‌వారం 50 శాతం క‌లెక్ష‌న్లు త‌గ్గిన‌ప్ప‌టికీ.. త‌మిళ‌నాడు వ్యాప్తంగా మూడు రోజుల్లో రూ. 9 కోట్ల‌కు చేరుకుంది. దేశ‌వ్యాప్తంగా ప‌దికోట్ల రూపాయ‌ల క‌లెక్ష‌న్స్‌తో టైటానిక్, అవ‌తార్, షోలే సినిమాల రీ రిలీజ్ క‌లెక్ష‌న్స్ జాబితాలో చేరిపోయింది గిల్లి. 


క‌లెక్ష‌న్లుపెరిగే అవ‌కాశం.. 


నిజానికి రీ రిలీజ్ ట్రెండ్ ఉన్న‌ప్ప‌టికీ.. రిలీజైన మొద‌టి రోజు మాత్ర‌మే థియేట‌ర్లకి వెళ్తున్నారు ప్రేక్ష‌కులు. అయితే, 'గిల్లి' సినిమాకి మాత్రం వ‌రుస‌గా మూడు రోజులు క‌లెక్ష‌న్లు వ‌చ్చాయి. అయితే, ఈ సినిమాకి ప్రేక్ష‌కులు ఇలానే వ‌స్తే.. రూ.25 - 30 కోట్ల క‌లెక్ష‌న్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు సినీ విశ్లేష‌కులు. సినిమా ఇంకా ఎన్ని రోజులు ఆడుతుందో కూడా తెలియ‌దు కాబ‌ట్టి అంచ‌నా వేయ‌డం క‌ష్టం అని కూడా అభిప్రాయ‌ప‌డుతున్నారు. 


'ఒక్క‌డు' రీ మేక్ 'గిల్లి'.. 


మ‌హేశ్ బాబు, భూమిక‌, ప్ర‌కాశ్ రాజు త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన సినిమా 'ఒక్క‌డు'. ఈ సినిమాకి గుణ‌శేఖ‌ర్ డైరెక్ట‌ర్. కాగా.. ఈ సినిమా అప్ప‌ట్లో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. దీంతో చాలా భాష‌ల్లో దీన్ని రీమేక్ చేశారు. త‌మిళ్ లో విజ‌య్, త్రిష ఈ సినిమాలో న‌టించ‌గా.. అక్క‌డ కూడా బ్లాక్ బాస్ట‌ర్ హిట్ అయ్యింది. ఆ త‌ర్వాత హిందీ, బెంగాళీ త‌దిత‌ర భాష‌ల్లో కూడా ఆ సినిమాని రీమేక్ చేసిన విష‌యం తెలిసిందే.


తెలుగులో ట్రెండ్.. 


తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఇప్పుడు రీ రిలీజ్ ల సంద‌డి చాలా ఎక్కువ‌గా ఉంది. త‌మ అభిమాన తార సినిమాల‌ను, అప్ప‌టి వాళ్ల లుక్ ను ఇప్పుడు 70 ఎంఎం స్క్రీన్ మీద చూసేందుకు సినీ ప్రేక్ష‌కులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీంతో తార‌ల పుట్టిన‌రోజు, సినిమా రిలీజై 20 ఏళ్లు, ప‌దేళ్లే దాటితే సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. గ‌తంలో బాక్సాఫీస్ వ‌ద్ద భారీ డిజాస్ట‌ర్లు గా నిలిచిన చాలా సినిమాలు ఇప్పుడు క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించాయి. 'ఓయ్', 'ఆరెంజ్' త‌దిత‌ర సినిమాలు అప్ప‌ట్లో ఫ్లాప్ అయిన‌ప్ప‌టికీ రీ రిలీజ్ ల‌కి మాత్రం ప్రేక్ష‌కులు తెగ వెయిట్ చేశారు. 


Also Read: మంజుమ్మెల్ బాయ్స్' నటుడితో హీరోయిన్ పెళ్లి - హల్దీ వేడుకలో అపర్ణా దాస్ సందడి