తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలు చేస్తున్న యువ కథానాయకులలో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ఒకరు. గత ఏడాది ఆయన నటించిన మూడు చిత్రాలు 'సెబాస్టియన్ పీసీ 524', 'సమ్మతమే', 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 17న 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాతో థియేటర్లలోకి వచ్చారు. రెండు నెలల వ్యవధిలో కొత్త సినిమాతో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
ఏప్రిల్ 7న కిరణ్ అబ్బవరం 'మీటర్'
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ 'మీటర్'. సంక్రాంతికి 'వాల్తేరు వీరయ్య', 'వీర సింహా రెడ్డి' సినిమాలతో విజయాలు అందుకున్న మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు నిర్మిస్తున్న చిత్రమిది. దీంతో రమేష్ కాదూరి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు నిర్మాతలు.
రవితేజ 'రావణాసుర' వచ్చేది ఆ రోజే!
Ravanasura Vs Meter movies : మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా యువ దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా 'రావణాసుర'. ఆ సినిమా విడుదల కూడా ఏప్రిల్ 7నే. 'మీటర్' కంటే ముందు విడుదల తేదీ వెల్లడించారు. ఇప్పుడు ఆ తేదీకి కిరణ్ అబ్బవరం 'మీటర్'తో వస్తున్నారు.
కిరణ్ అబ్బవరానికి అంత ఈజీ ఏమీ కాదు!
ఒకే రోజున రెండు మూడు సినిమాలు విడుదల కాకూడదని ఏమీ లేదు. సంక్రాంతి బరిలో వచ్చిన రెండు మూడు సినిమాలు మంచి వసూళ్లు రాబట్టాయి. అయితే, సమ్మర్ సీజన్ స్టార్టింగులో ఎలా ఉంటుందనేది ఇప్పుడే చెప్పలేం. పైగా, ఏప్రిల్ 7కి వారం ముందు నేచురల్ స్టార్ నాని 'దసరా' సినిమాతో వస్తున్నారు. అది పాన్ ఇండియా సినిమా. 'ధమాకా', 'వాల్తేరు వీరయ్య' విజయాల తర్వాత రవితేజ నుంచి వస్తున్న సినిమా 'రావణాసుర'. ఈ రెండు సినిమాల మధ్యలో 'మీటర్' ఎలా ఉంటుంది? ఎంత వరకు నిలబడుతుంది? అనేది చూడాలి. కంటెంట్ ఉన్న సినిమాను ఎవరూ ఆపలేరు అనుకోండి! అయితే, జోరు మీద ఉన్న హీరోలు బరిలో ఉన్నప్పుడు ఆ పోటీ ఆసక్తిగా ఉంటుంది.
Also Read : 'బలగం' రివ్యూ : చావు చుట్టూ అల్లిన కథ - 'దిల్' రాజు ప్రొడక్షన్స్ సినిమా ఎలా ఉందంటే?
'వినరో భాగ్యము విష్ణు కథ'ను కూడా ధనుష్ 'సార్' సినిమాతో పాటు బాక్సాఫీస్ బరిలో విడుదల చేశారు కిరణ్ అబ్బవరం. ఈసారి కూడా పోటీలో ఉండటానికి మొగ్గు చూపారు. అయితే, తమిళ హీరోలతో కాకుండా తెలుగు హీరోల సినిమాలతో తన సినిమాను తీసుకు వస్తున్నారు. 'మీటర్'లో ఆయన పోలీస్ ఆఫీసర్ రోల్ చేశారు. అది పక్కా కమర్షియల్ సినిమా అని యూనిట్ చెబుతోంది. ''కిరణ్ అబ్బవరం పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. ఆయన కెరీర్‌లో భారీ బడ్జెట్ చిత్రమిది'' అని 'మీటర్' నిర్మాతలు తెలిపారు. కిరణ్ అబ్బవరం సరసన అతుల్యా రవి కథానాయికగా నటిస్తున్న 'మీటర్' చిత్రానికి సంగీతం : సాయి కార్తీక్, ఛాయాగ్రహణం : వెంకట్ సి దిలీప్ & సురేష్ సారంగం.
Also Read : విలన్‌గా 'వెన్నెల' కిశోర్? - సారీ ఫ్యాన్స్, అది రాంగే!