ఇప్పుడు టాలీవుడ్ టాప్ కమెడియన్లు ఎవరు? అని చూస్తే... లిస్టులో 'వెన్నెల' కిశోర్ పేరు ముందు వరుసలో తప్పకుండా ఉంటుంది. ఈ మధ్య ఆయన లేని సినిమాలు ఉండటం లేదు. ఒక వైపు స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు అందుకుంటూ, మరో వైపు చిన్న చిన్న సినిమాలకు అండగా ఉంటూ వస్తున్నారు. తన కామెడీ టైమింగ్, యాక్టింగుతో ప్రేక్షకులను నవ్విస్తూ వస్తున్న 'వెన్నెల' కిశోర్ గురించి లేటెస్టుగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అది ఏమిటంటే... ఆయన విలన్ రోల్ చేస్తున్నారని!
'భారతీయుడు 2'లో ప్రతినాయకుడిగా...లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) కథానాయకుడిగా సౌత్ ఇండియన్ స్టార్ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న తాజా సినిమా 'ఇండియన్ 2' (Indian 2 Movie). తెలుగులో 'భారతీయుడు 2'గా విడుదల కానుంది. గతంలో తెలుగులోనూ విజయం సాధించిన 'భారతీయుడు'కు సీక్వెల్ ఇది. ఇందులో వెన్నెల కిశోర్ ఓ విలన్ అని ప్రచారం జరుగుతోంది.
'ఇండియన్ 2' లేదు... 'పాకిస్తాన్ 3' లేదు!
'ఇండియన్ 2'లో ఏడుగురు విలన్స్ ఉన్నారని, అందులో 'వెన్నెల' కిశోర్ ఒకరని సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఓ నెటిజన్ దాని గురించి 'ఏంటి కాకా! ఇది నిజమా?' అని ప్రశ్నించగా... ''ఇండియన్ 2'లో లేను, పాకిస్తాన్ 3లో లేను'' అని వ్యంగ్యంగా రిప్లై ఇచ్చారు. అయినా సరే నెటిజన్లు నమ్మడం లేదు. ప్రేక్షకులను 'వెన్నెల' కిశోర్ డైవర్ట్ చేస్తున్నారని భావిస్తున్నారు.
ప్రస్తుతం 'ఇండియన్ 2' సినిమా చిత్రీకరణ చెన్నైలో జరుగుతోంది. ఈ సినిమాలో కమల్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. పెళ్లి చేసుకుని అబ్బాయి నీల్ కిచ్లూకి జన్మ ఇచ్చిన తర్వాత ఆమె నటిస్తున్న చిత్రమిది. పెళ్లికి ముందు సినిమా స్టార్ట్ అయినప్పటికీ... మధ్యలో బ్రేకులు పడ్డాయి. పెళ్లి తర్వాత మళ్ళీ ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు. ఇందులో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్ మరో జంటగా నటిస్తున్నారు. ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా, సముద్రఖని తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడెక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. దీనికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
Also Read : 'బలగం' రివ్యూ : చావు చుట్టూ అల్లిన కథ - 'దిల్' రాజు ప్రొడక్షన్స్ సినిమా ఎలా ఉందంటే?
కమల్ సినిమాతో పాటు చరణ్ సినిమా కూడా!
'ఇండియన్ 2'కు బ్రేకులు పడటంతో రామ్ చరణ్ కథానాయకుడిగా పాన్ ఇండియా సినిమా స్టార్ట్ చేశారు శంకర్. అందులో కియారా అడ్వాణీ కథానాయిక. ఆ సినిమా షూటింగ్ కూడా చాలా వరకు కంప్లీట్ అయ్యింది. ఈ మధ్య హైదరాబాద్, విశాఖ నగరాల్లో సాంగ్ షూటింగ్ చేశారు. ప్రస్తుతానికి శంకర్ రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు. త్వరలో ఈ రెండు సినిమాలు పూర్తి చేసి... ఆ తర్వాత హిందీలో రణ్‌వీర్ సింగ్ హీరోగా సినిమా చేయనున్నారు. రెండు మూడేళ్లకు ఓ సినిమా చేసే శంకర్ నుంచి రాబోయే రెండేళ్లలో మూడు సినిమాలు వచ్చే అవకాశం ఉంది. దీపావళికి 'ఇండియన్ 2', సంక్రాంతికి రామ్ చరణ్ సినిమా విడుదలైనా కావచ్చు.
Also Read : సాయి ధరమ్ తేజ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మృతి - 'విరూపాక్ష' టీజర్ విడుదల వాయిదా