తెలుగు ప్రేక్షకులకు సినిమా అనేది ఒక ఎమోషన్. సినిమా అనేది కేవలం ఒక కాలక్షేపంగా మాత్రమే కాకుండా థియేటర్‌లో ఆ సినిమా చూసిన అనుభవాన్ని జీవితకాలం దాచుకుంటాడు సామాన్య ప్రేక్షకుడు. ఇక ఫాన్స్ అయితే చెప్పనవసరం లేదు. తమకు నచ్చిన హీరో, హీరోయిన్, డైరెక్టర్ల సినిమాలను థియేటర్లో చూసిన అనుభవాన్ని కాలం మారిన తర్వాత తన తర్వాత జనరేషన్‌కు చెప్పాలనుకుంటాడు. ఒకవేళ తాను స్కూల్ డేస్‌లో చూసిన సినిమా ఉద్యోగంలో ఉండగా మళ్ళీ రిలీజ్ అయితే చిన్ననాటి అనుభవాన్ని మళ్లీ పొందాలని సెలవు పెట్టిన థియేటర్‌కి వెళ్ళాలి అనుకుంటాడు. రీ రిలీజ్‌ల ట్రెండ్ మొదలవడానికి ఇదే పెద్ద కారణం. అయితే కొందరి మితిమీరిన ప్రవర్తన వలన రీ రిలీజ్ అంటే సినిమా హాళ్ళ ఓనర్లు భయపడిపోతున్నారు. ఇక ఆ థియేటర్లో వీళ్ళు చేసే హంగామా సోషల్ మీడియాలో వైరల్ అయితే సాధారణ ప్రేక్షకులు దాన్ని చూసి అసహ్యించుకునే పరిస్థితిలో వీలైతే ఉంటోంది.
హద్దులు దాటిస్తున్న పైత్యం
ఇటీవల రీ రిలీజైన 'ఖలేజా' సినిమా థియేటర్లో ఒక ఫ్యాన్ ఏకంగా బ్రతికి ఉన్న పామును పట్టుకుని రావడం చూసేవాళ్ళు జలదరించేలా చేసింది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైర్లు కావడంతో జాతీయ మీడియా సైతం దీనిపై కథనాలు ప్రసారం చేసింది. గతంలో 'సింహాద్రి' రీ రిలీజ్ టైమ్ లో అయితే ఫ్యాన్స్ అత్యుత్సానికి ఒక థియేటర్ లో మంటలు చెలరేగాయి. 'దేశముదురు' రీ రిలీజ్ సమయంలోనూ అంతే హైదరాబాద్‌లోని ఒక థియేటర్‌లో చిచ్చుబుడ్డి వెలిగించడంతో పోలీసులు సినిమా ప్రదర్శన నిలిపివేశారు. ఇక కొన్ని సినిమాల రీ రిలీజ్ సమయంలో సన్నివేశానికి తగ్గట్టు థియేటర్‌లోనే పెళ్లి చేసుకోవడం వంటి ప్రహసనాలూ జరుగుతున్నాయి. ఏదో ఒక్క హీరో ఫ్యాన్స్ కి పరిమితమైన విషయం కాదు. ఈ విషయంలో అందరిదీ ఒకటే దారి అన్నట్టు ఈ అతి చేష్టలు ఉంటున్నాయి.
వీళ్ళు వచ్చేది సినిమా చూడడానికి కాదు
ఇప్పుడు ఒక హైస్కూల్ కుర్రాడు ఉన్నాడు అనుకుందాం. నచ్చిన హీరో సినిమాని రిలీజ్ రోజు చూసేంత డబ్బు తన దగ్గర ఉండకపోవచ్చు. అమ్మనో.. నాన్న నో బతిమాలి థియేటర్ కు వెళ్లి చూస్తాడు.అదే ఉద్యోగం చేసుకుంటున్న సమయంలో అదే సినిమా రీ- రిలీజ్ అయితే తన చిన్ననాటి అనుభవాన్ని మళ్లీ పొందడం కోసం ఆ సినిమా ఏ యూట్యూబ్ లోనో ఉచితంగా ఉన్నా సరే ఇంకోసారి థియేటర్ వెళ్లి చూస్తాడు. అలాగే కొంతమందికి పెళ్లి అయిన తర్వాత చూసిన తొలి సినిమా మరోసారి రిలీజ్ అయితే అనుభూతిని ఆస్వాదించడం కోసం థియేటర్ కెళ్లే జంటలు ఉంటాయి. కానీ కొంతమంది ఫ్యాన్స్ చేస్తున్న పనుల వల్ల వాళ్లకు ఆ అనుభూతి మిస్ అవుతోందని అలాంటి వారు అంటున్నారు.
Also Read: మళ్ళీ నోరు జారిన నటకిరీటి... ఈసారి అలీని ఏకంగా బూతులతో... రాజేంద్ర ప్రసాద్ తాగి వచ్చారా?
థియేటర్ల ఓనర్లైతే అభిమానుల హంగామా వల్ల సినిమాకి వచ్చే అద్దె కంటే సీట్ల రిపేర్ కి స్క్రీన్ల రిపేర్ కి అయ్యే నష్టమే ఎక్కువ అని వాపోతున్నారు. ఇలాంటి కొందరు ఫాన్స్ వచ్చేది నిజానికి హంగామా సృష్టించడానికే తప్ప సినిమానీ ఎంజాయ్ చేయడం కోసం కాదు అనేది ఎక్కువమంది నెటిజన్స్ చెబుతున్న మాట. ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకు పరిమితం అయిన విపరీత ధోరణి కాదు. తమిళనాడులో అయితే ఆ మధ్య ఇద్దరు స్టార్ హీరోలు ఫ్యాన్స్ మధ్య జరిగిన గొడవలో ఒక అభిమాని మృతి చెందాడు. దానితో చాలామంది రీ రిలీజ్ సినిమా కి వెళ్ళాలి అంటేనే భయపడుతున్న పరిస్థితి. ఫ్యాన్స్ అందరూ దీనిని గుర్తించి ఇలాంటి అనవసర అతి చేసే వారిని అదుపులో ఉంచితే మరింత మంది ప్రేక్షకులు రీ రిలీజ్ సినిమాను చూడడానికి థియేటర్లకు ఫ్యామిలీలతో వస్తారు అని నిర్మాతల వైపు నుంచి వస్తున్న రిక్వెస్ట్.
Also Read: వదిలేయండ్రా బాబూ... ఈవిడ 'ఖలేజా'లో దిలావర్ సింగ్ వైఫ్ కాదు... ఇదిగో క్లారిటీ