Andhra Pradesh motor-mechanic's son, CA student Nazeeruddin Shaik wins aha Telugu Indian Idol 3, lands singing role in Pawan Kalyan's OG: బుల్లితెరపై ప్రసారమయ్యే పలు షోలు టాలెంట్ ఉన్న యంగ్ స్టర్స్ పాలిట వరంగా మారాయి. అందులో ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న ఇండియన్ ఐడల్ 3 అనే సింగింగ్ షో కూడా ఒకటి. తాజాగా ఈ షోలో విన్ అయిన నసీరుద్దీన్ షేక్ అనే 19 ఏళ్ల సీఏ విద్యార్థికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' సినిమాలో పాడే అద్భుతమైన ఛాన్స్ దక్కింది. 


'ఇండియన్ ఐడల్ 3'లో విన్నర్
ఆహాలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్ ఉత్కంఠభరితంగా సాగింది. 2024 మే 4న న్యూజెర్సీ, హైదరాబాద్‌లో జరిగిన అడిషన్స్ లో ఏకంగా 15,000 మంది టాలెంటెడ్ సింగర్స్ పాల్గొన్నారు. అందులో టాప్ 12 ఫైనలిస్టులు భరత్ రాజ్, కీర్తన, కేశవ్ రామ్, హరి ప్రియ, జివి శ్రీ కీర్తి, నజీరుద్దీన్, స్కంద, దువ్వూరి శ్రీధృతి, రజనీ శ్రీ, సాయి వల్లభ, ఖుషాల్ శర్మ, అనిరుధ్ సుస్వరం లతో షో మొదలైంది. సెప్టెంబర్ 21న జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఏపీకి చెందిన నసీరుద్దీన్ షేక్ విజేతగా నిలిచాడు. ఫలితంగా ప్రతిష్టాత్మక ఆహా ఇండియన్ ఐడల్ సీజన్ 3 టైటిల్ తో పాటు బహుమతిగా 10 లక్షల నగదును అందుకున్నాడు. అనిరుధ్ సుస్వరం రెండో స్థానంలో ఉండగా అతనికి రూ. 3 లక్షలు నగదు, మూడవ స్థానంలో నిలిచిన జివి శ్రీ కీర్తికి రూ. 2 లక్షలు బహుమతిగా లభించింది. దాదాపు 26 వారాల పోటీ తర్వాత ముగిసిన ఈ షోలో థమన్, గీతా మాధురి, కార్తీక్ జడ్జిలుగా వ్యవహరించారు. ఈ సీజన్‌లో అసాధారణ ప్రతిభ కనబరిచిన నసీరుద్దీన్ వాయిస్, టాలెంట్ కు ఫిదా అయిన సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ "ఓజీ"లో పాడే అద్భుతమైన ఛాన్స్ ఇస్తున్నట్టు స్టేజ్ పై ప్రకటించారు. 


Also Readప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు... లడ్డూ వివాదంలో సెటైరికల్ ట్విట్టర్ యుద్ధం



మెకానిక్ కొడుకు నుంచి మెగా ఛాన్స్ దాకా 
2004 నవంబర్ 2న తాడేపల్లిగూడెంలో మోటార్ మెకానిక్ అయిన షేక్ బాజీకి జన్మించాడు నజీరుద్దీన్. ఏడాది క్రితం ఆయన తల్లి మదీనా బీబీ మరణించింది. అతనికి సోదరి వహిదా రెహ్మాన్ ఉంది. నసీరుద్దిన్ ఇటీవలే సీఏ ఇంటర్మీడియట్‌ను పాస్ అయ్యాడు. అయితే సంగీతం పట్ల చిన్నప్పటి నుంచి తనకున్న అభిరుచికి తగ్గట్టుగా అవకాశాలను వెతుక్కుంటూనే, మరోవైపు చార్టర్డ్ అకౌంటెంట్ కావాలనే ఆకాంక్షతో చదువును కూడా కొనసాగించాడు. నజీరుద్దీన్ సంగీత అభిలాషను గుర్తించిన అతని తల్లితండ్రులు కర్ణాటక సంగీత గురువు దగ్గర చేర్పించారు. ఘంటసాల ఐకానిక్ పాటలు వింటూ నాలుగేళ్ల వయసులోనే సంగీత ప్రయాణం మొదలు పెట్టిన నసీరుద్దీన్ నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమాలో పాడే గోల్డెన్ ఛాన్స్ ను కొట్టేసి తనలాంటి ఎంతో మందికి స్పూర్తిగా నిలిచాడు. ప్రస్తుతం నెటిజన్లతో పాటు బుల్లితెర ప్రేక్షకుల నుంచి నసీరుద్దీన్ కు అభినందనల వర్షం కురుస్తోంది. కాగా 'ఓజీ' సినిమాకు యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహిస్తుండగా, త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పవన్ కళ్యాణ్ తిరిగి ప్రారంభించనున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. 


Also Readచంద్రబాబుకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ థాంక్స్- నాగవంశీలా తప్పు చేయలేదు!