TSFDC Chairman Dill Raju: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్ నిర్మాత దిల్‌రాజును తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్(TSFDC Chairman)గా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్లపాటు ఈ పదవిలో ఆయన కొనసాగుతారు. తెలుగు ఇండస్ట్రీలో భారీ చిత్రాలనే కాదు చిన్న చిత్రాలను నిర్మిస్తూ కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్నారు దిల్ రాజు. తెలుగు పరిశ్రమలోకి కొత్తగా వచ్చేవాళ్లను మరింతగా ప్రోత్సహించేందుకు దిల్‌రాజు డ్రీమ్స్ పేరుతో కొత్త బ్యానర్‌ను క్రియేట్ చేశారు. ఈ పేరుతో ఓ వెబ్‌సైట్‌ను కూడా లాంచ్ చేయబోతున్నారు.
డిస్ట్రిబ్యూటర్‌గా సినిమా ఇండస్ట్రీలో తన కేరీర్‌ను ప్రారంభించిన దిల్‌రాజు అసలు పేలు వెంకటరమణారెడ్డి. ఆయన సినిమా ఇండస్ట్రీతో 35 ఏళ్లకుపైగానే అనుబంధం ఉంది. అచెంలంచెలుగా ఎదిగి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ స్థాపించి తొలిసారిగా 2003లో దిల్ అనే సినిమాను నిర్మించారు. ఆ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో అప్పటి నుంచి అందరూ ఆయనను దిల్‌రాజు అని పిలవడం మొదలుపెట్టారు. బాగా కలిసి వచ్చిందని ఆ పేరుతోనే ఆయన కూడా సాగిపోతున్నారు. ప్రస్తుతం 3 భారీ చిత్రాలను ఆయన నిర్మిస్తున్నారు. రామ్‌చరణ్, శంకర్ కాంబినేషన్‌లో గేమ్‌ఛేంజర్ ఒకటి అయితే... వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సంక్రాంతికి వస్తున్నాం ఇంకొకటి. నితిన్, వేణు శ్రీరామ్ కాంబోలో తమ్ముడు సినిమాను నిర్మిస్తున్నారు.
ప్రభుత్వంలోని సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖతో కలిసి తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పనిచేస్తుంది. నాణ్యమైన సినిమాలను ప్రోత్సహించి పరిశ్రమ విస్తరణకు పని చేస్తుంది. చలనచిత్ర పరిశ్రమ సమగ్ర, సమర్ధవంతమైన అభివృద్ధిని ప్లాన్ చేయడం, ప్రోత్సహించడం సినిమాలో నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేయడే దీనికి ఉన్న ముఖ్య లక్ష్యం.
తెలుగు సినిమా పరిశ్రమ నుంచి పాన్ ఇండియా చిత్రాలు భారీగా రూపుదిద్దుకుంటున్న ఈ తరుణంలో దిల్‌రాజ్ నియామకం చిత్ర పరిశ్రమకు మరింత మేలు చేస్తుందని సినీ జనం అంచనా వేస్తున్నారు. నిర్మాతగా అద్భుతాలు చేసిన దిల్‌రాజు ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా మరింతగా పరిశ్రమకు ఉపయోగపడతారని అంటున్నారు. అందుకే ఆయన నియామకాన్ని టాలీవుడ్ స్వాగతిస్తోంది.