కిసిక్... కిసిక్... అంటూ కుర్రకారుని కవ్వించేస్తున్నారు హీరోయిన్ శ్రీలీల (Sreeleela). ‘పుష్ప 2’ సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun)తో కలిసి కిసిక్ పాటలో ఆమె వేసిన స్టెప్స్ కి, ఆ గ్రేస్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. హీరోయిన్ శ్రీలీల ఎంబీబీఎస్ చదువుతూనే నటనలోకి ప్రవేశించారు. ఇప్పుడామె డాక్టర్ కూడా. అయితే, ఇప్పుడామె చేస్తున్న సేవా కార్యక్రమాలపై చర్చ నడుస్తోంది. ఆమెలోని మానవతా కోణం చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ‘పుష్ప 2’ విడుదలయ్యాక ఇటీవలే ఒక నెటిజన్, ‘‘నేను ఇప్పటివరకూ ఆమె అభిమానిని కాదు. మానసిక వైకల్యం ఉన్న పిల్లల్ని దత్తత తీసుకొని వారిని చూసుకుంటున్నారు. ఇప్పటి నుంచి నేను డైహార్డ్ ఫ్యాన్ ను’’ అంటూ ఓ నెటిజన్ తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశాడు. ఎందుకో తెలుసా?
సాధారణంగా షూటింగ్స్ కు బ్రేక్ దొరికినప్పుడల్లా, అనాథాశ్రమాలను సందర్శించి అక్కడున్న పిల్లలకు సహాయం అందిస్తూ ఉంటారు శ్రీలీల. సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న ఛారిటీ కార్యక్రమాల ఫోటోలు అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. ‘గుంటూరు కారం’ సినిమా సమయంలో ఒకసారి శ్రీలీల స్పెషల్ చిల్డ్రన్ (Differently Abled) ఉంటున్న ఆశ్రమానికి వెళ్లారు. అక్కడి వారి పరిస్థతి చూసి చలించిపోయారు. వెంటనే, గురు, శోభిత అనే ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకున్నారు. మానసిక వైకల్యం (Differently Abled) ఉన్న ఈ ఇద్దరు పిల్లల బాగోగుల్ని శ్రీలీలే అప్పటి నుంచి చూసుకుంటున్నారట.
బాలీవుడ్ లోకి ఎంట్రీ !
హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన ‘పెళ్లిసందడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు. స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ కూడా కావడంతో శ్రీలీల డ్యాన్స్ లకు యూత్ లో మంచి క్రేజ్ వచ్చింది. రవితేజ సరసన హీరోయిన్ గా ‘ధమాకా’లో నటించారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. స్టార్ హీరోయిన్ అయిపోయారు శ్రీలీల. ఇక వరుస సినిమాలతో బిజీగా అయిపోయారు. అయితే, ‘గుంటూరు కారం’ సినిమా తర్వాత శ్రీలీల ఎక్కడా కనబడలేదు. ఆమె సినిమాలపై వార్తలూ వినిపించలేదు. హఠాత్తుగా ఆమె ‘పుష్ప 2’లో ఐటెం సాంగ్ చేసి మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చారు. ప్రస్తుతం నితిన్ తో ‘రాబిన్ హుడ్’ అనే సినిమా చేస్తున్నారు శ్రీలీల. ఈ నెలలోనే విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. రవితేజ హీరోగా తెరకెక్కుతోన్న ‘మాస్ జాతర’ సినిమాలో శ్రీలీల హీరోయిన్. ఇక, త్వరలోనే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఇటీవల ఆమె స్వయంగా వెల్లడించారు. అయితే ఆ సినిమాకు సంబంధించిన మరే విషయాలపై ఆమె క్లారిటీ ఇవ్వలేదు.
Also Read: నా కోసం కాదు, వాళ్ళ కోసం... ఆ మూడుసార్లూ Pushpa 2 హిట్టవ్వాలని బలంగా కోరుకున్నా - అల్లు అర్జున్