ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2' (Pushpa 2 The Rule). గత మూడేళ్ల నుంచి ఈ మూవీ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా మూవీ లవర్స్ మరికొన్ని గంటల్లోనే 'పుష్ప 2'ను థియేటర్లలో చూడబోతున్నారు. డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అందులో భాగంగానే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాదులో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ గా మారాయి. అందులోనూ ముఖ్యంగా ఈ సినిమాను తనకోసం కాకుండా, కేవలం మూడుసార్లు మాత్రమే హిట్ కావాలని కోరుకున్నాను అంటూ బన్నీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ నిర్మాతలతో పాటు టెక్నీషియన్లు, సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా థాంక్స్ చెప్పారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్, లిరికల్ రైటర్, సినిమాటోగ్రాఫర్.. ఇలా అందరూ ఈ సినిమా కోసం ఐదేళ్ల టైం కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే అందరికంటే ఎక్కువగా అల్లు అర్జున్ 'పుష్ప 2' మూవీ డైరెక్టర్ సుకుమార్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అందులో భాగంగానే మూవీని మూడుసార్లు మాత్రమే హిట్ కావాలని కోరుకున్నానని వెల్లడించారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ... "ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ జీవితాన్ని పెట్టేశారు. ఇక సుకుమార్ గారు లేకపోతే ఇది అసలు జరిగేదే కాదు. ఆయన లేకుండా మేము లేము. జీవితంలో ఐదు సంవత్సరాల కాలాన్ని ఈ సినిమా కోసం పని చేసిన అందరం ఆయనను నమ్మి పెట్టాము. నాతో కలిసి ఆయన ఆర్య మూవీని చేయకపోతే ఈ రోజు నేను లేను. అయితే ఈ మూవీ నా కోసం ఆడాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ మూడుసార్లు మాత్రం ఈ మూవీ ఆడాలని కోరుకున్నాను. మొదటిది సుకుమార్ గారి కష్టం చూసి అనుకున్నాను. ఒకానొక టైమ్ లో అనుకున్నట్టుగా రావట్లేదు అంటూ సుకుమార్ గారు బ్రేక్ డౌన్ అయ్యారు. అప్పుడు గట్టిగా అన్పించింది ఈ మూవీ హిట్ కావాలని. ఈ సినిమా కోసం మూడేళ్లు కష్టపడిన చిత్ర బృందం కోసం మూవీ ఆడాలి అనుకున్నాను. అలాగే బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు తెలుగు వారంతా ఎంతో గౌరవించారు. ఆ తర్వాత పుష్ప సినిమా అంతే స్థాయిలో ఉండడంతో తెలుగువారి కోసం ఈ సినిమా ఆడాలి అనుకున్నాను. ఈ మూవీ కోసం మేము మా బెస్ట్ ఇచ్చాము. ఇప్పుడు దీని గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. డిసెంబర్ 5న సినిమాని చూశాక మీకు అర్థమవుతుంది. సుకుమార్ గారు మాట్లాడేటప్పుడు నేను చాలా ఎమోషనల్ అయ్యాను. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ ఈ సందర్భంగా ఒక్కటే చెప్తున్నాను. సినిమాను తీసింది మేమే... కానీ తీసింది మీ కోసమే. ఇది మా గొప్పతనం కాదు, నిజంగా మీ ఆదరణ. ఈ మూవీ 80 దేశాలలో 12 వేలకు పైగా స్క్రీన్ లలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. దీనికి ఎంతో గర్విస్తున్నాను" అంటూ అల్లు అర్జున్ చేసిన సుదీర్ఘ స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.