Teja Sajja: తేజ సజ్జా, ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమానే ‘హనుమాన్’. ఈ మూవీ కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఇతర సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా విడుదలయ్యింది. జనవరి 12న ‘హనుమాన్’ సినిమా విడుదలకు సిద్దం కాగా.. దానికంటే ఒక్కరోజు ముందే పెయిడ్ ప్రీమియర్స్‌ను ఏర్పాటు చేశారు మేకర్స్. ఆ పెయిడ్ ప్రీమియర్స్ నుండే సినిమాకు పాజిటివ్ టాక్ రావడం మొదలయ్యింది. అలా మౌత్ టాక్‌తో మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. పాజిటివ్ రివ్యూల వల్లే ‘హనుమాన్’ కలెక్షన్స్ విషయంలో రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఇక ఇందులో హీరోగా నటించిన తేజ సజ్జా సైతం తన పేరు మీద కొత్త రికార్డును నమోదు చేయనున్నాడు.


రూ.100 కోట్ల క్లబ్‌లో..
చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యాడు తేజ సజ్జా. ఆ తర్వాత సమంత హీరోయిన్‌గా నటించిన ‘ఓ బేబి’తో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మరోసారి ప్రేక్షకులకు కొత్తగా పరిచయమయ్యాడు. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘జాంబీ రెడ్డి’తో హీరోగా మారాడు. ఇప్పుడు ‘హనుమాన్’తో మరోసారి ఆడియన్స్‌లో ఆకట్టుకోవడానికి వచ్చాడు. ఈ సినిమాలో ప్రశాంత్ వర్మ టేకింగ్, విజువల్స్ ఎంతలా అయితే ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయో.. అదే రేంజ్‌లో తేజ యాక్టింగ్ కూడా ఆకట్టుకుందని ప్రశంసలు అందుకున్నాయి. ‘హనుమాన్’తో ఏకంగా రూ.100 కోట్ల క్లబ్‌లోకి జాయిన్ అవ్వనున్నాడు తేజ. దీంతో ఈ క్లబ్‌లో జాయిన్ అవ్వనున్న 8వ హీరోగా రికార్డ్ సాధించనున్నాడు.


‘బాహుబలి’తో మొదటిసారి..
తెలుగు సినిమాలు అనేవి అసలు రూ.100 కోట్లు కలెక్ట్ చేస్తాయా అని ఇతర భాషా ప్రేక్షకులు తక్కువ చేసి మాట్లాడేవారు. ముఖ్యంగా ఒకప్పుడు దేశవ్యాప్తంగా బాలీవుడ్‌కు మాత్రమే ఆ రేంజ్‌లో మార్కెట్ ఉండేది. కానీ ‘బాహుబలి’తో అన్నీ మారిపోయాయి. తెలుగు సినిమాలు కూడా రూ.100 కోట్ల కలెక్షన్స్‌ను సాధించగలవని, ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకోగలవని ప్రూవ్ చేసింది. అలా ‘బాహుబలి’తో రూ.100 కోట్ల క్లబ్‌లో జాయిన్ అయిన మొదటి హీరోగా రికార్డ్ క్రియేట్ చేశాడు ప్రభాస్. ప్రభాస్ తర్వాత చిరంజీవి, మహేశ్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్.. లాంటి హీరోలు కూడా ఈ క్లబ్‌లో చోటు దక్కించుకున్నారు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’తో ఎన్‌టీఆర్ కూడా ఆ లిస్ట్‌లో చేరిపోయాడు. ఇక తెలుగు హీరోల నుండి ఏడుగురికి మాత్రమే ఈ క్లబ్‌లో చోటు దక్కింది. ఇప్పుడు తేజ సజ్జా కూడా వీరిలో ఒకడయ్యాడు.


‘హనుమాన్’కు పోటీ లేదు..
బాక్సాఫీస్‌పై ‘హనుమాన్’ దండయాత్ర చేస్తోంది. ఫస్ట్ వీకెండ్ పూర్తయిన తర్వాత పాజిటివ్ టాక్‌తో పాటు సినిమాకు వస్తున్న ప్రేక్షకుల సంఖ్య కూడా పెరిగిపోయింది. వచ్చే వీకెండ్‌కు ఇప్పుడే ప్రీ బుకింగ్స్ కూడా పూర్తయ్యాయి. చాలావరకు థియేటర్లలో ప్రతీ షో దాదాపు హౌజ్‌ఫుల్‌గానే రన్ అవుతోంది. ఇప్పటికీ దగ్గర్లో మరే పెద్ద సినిమా విడుదల లేకపోవడంతో కనీసం రెండువారాల పాటు ‘హనుమాన్’ హవా కొనసాగుతుందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే కేవలం తెలుగు వర్షన్‌లోనే రూ.50 కోట్లు కలెక్ట్ చేసింది ఈ సూపర్ హీరో మూవీ. మూడో వీకెండ్ పూర్తయ్యే సమయానికి కచ్చితంగా రూ.100 కోట్ల మార్క్‌ను టచ్ చేసి క్లబ్‌లోకి ఎంటర్ అవుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో తెలుగులో రూ.100 కోట్ల క్లబ్‌లో 8వ హీరో తేజ సజ్జానే అవుతాడు.


Also Read: ‘హనుమాన్’ సీక్వెల్‌పై బాలయ్య ఆసక్తికర కామెంట్స్