దివంగత కథానాయకుడు నందమూరి తారక రత్న (Nandamuri Taraka Ratna) జ్ఞాపకాల నుంచి ఆయన సతీమణి అలేఖ్యా రెడ్డి (Alekhya Reddy Nandamuri) బయటకు రాలేకపోతున్నారు. భర్తను తలుచుకుని భావోద్వేగానికి గురి అవుతున్నారు. లేటెస్టుగా భర్తతో దిగిన చివరి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అమ్మా బంగారు...
నీ మాటతో నిద్రలేస్తున్నా!
''ఇదే మన చివరి ట్రిప్, ఇదే మన చివరి ఫోటో అని నమ్మాలంటే నా గుండె చెరువు అవుతోంది. ఇది అంతా కల అయితే బావుంటుందని కోరుకుంటున్నాను. 'అమ్మా బంగారు...' అంటూ నీ వాయిస్ కాలింగ్ తో నిద్ర లేస్తున్నాను'' అని అలేఖ్యా రెడ్డి పోస్ట్ చేశారు. ఏడు కొండల వెంకటేశ్వర స్వామికి చిన్న కుమార్తె, కుమారుడు తల నీలాలు సమర్పించడానికి కుటుంబంతో కలిసి తిరుమల తిరుపతి వెళ్లారు తారక రత్న. అప్పుడు ఆలయం వెలుపల తీసిన ఫోటో ఇది.
Also Read : ఎన్టీఆర్‌ను పిలిచాం కానీ - టాలీవుడ్ ఫ్యాన్ వార్ దెబ్బకు హాలీవుడ్ రియాక్షన్
ఇటీవల తారక రత్న చేతిని తన చేత్తో పట్టుకున్న ఫోటో పోస్ట్ చేసిన అలేఖ్యా రెడ్డి ''మన జీవితం ఎప్పుడూ సాధారణంగా లేదు. కార్లలో నిద్రపోయిన రోజుల నుంచి ఇప్పటి వరకు కలిసే పోరాటం చేశాం. కలిసే చివరి వరకు ఉన్నాం. నువ్వు పోరాట యోధుడివి. నువ్వు ప్రేమించినంతగా ఇంకెవరూ ప్రేమించలేరు'' అని పేర్కొన్నారు. అలేఖ్యా రెడ్డి సోషల్ మీడియా పోస్టుల్లో ఆమె ఎంత బాధ పడుతున్నారనేది అర్థం అవుతోందని నెటిజనులు, తెలుగు ప్రజలు చెబుతున్నారు. భగవంతుడు ఆమెకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుతున్నారు.
Also Read : అగ్ని ప్రమాదానికి గురైన మెగాస్టార్ మూవీ సెట్ - దాని కాస్ట్ ఎంతంటే?
తారక రత్న (Taraka Ratna) ఫిబ్రవరి 18వ తేదీన బెంగళూరులో ఆయన తుదిశ్వాస విడిచారు. సుమారు 22 రోజుల పాటు ఆయన ప్రాణాలతో పోరాటం చేశారు. తారకరత్నను రక్షించడం కోసం ఎంతో అనుభవం ఉన్న వైద్య బృందం శక్తి వంచన లేకుండా తీవ్రంగా శ్రమించింది. నందమూరి, నారా ఫ్యామిలీలు తమ కుటుంబ సభ్యుడి ప్రాణం కాపాడటం కోసం చేయని ప్రయత్నం లేదు. అయితే, విధి ఆయన్ను పై లోకాలకు తీసుకు వెళ్ళింది
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావుకు తారకరత్న స్వయానా మనవడు. ఎన్టీఆర్ కుమారుడు మోహనకృష్ణ కుమారుడు. ఆయన వయసు 39 సంవత్సరాలు మాత్రమే. చిన్న వయసులో తిరిగిరాని లోకాలకు తారకరత్న వెళ్ళిపోవడం నందమూరి అభిమానులను, తెలుగు దేశం పార్టీ శ్రేణులను తీవ్రంగా కలచివేస్తోంది.
తాతయ్య ఎన్టీఆర్ నట వారసత్వం అందుకుని 2002లో తారక రత్న చిత్రసీమలోకి వచ్చారు. కథానాయకుడిగా కొన్ని సినిమాలు చేశారు. అయితే, ఆశించిన రీతిలో ఆయన విజయాలు అందుకోలేదు. ప్రతినాయకుడిగా తొలి చిత్రం 'అమరావతి'తో రాష్ట్ర పురస్కారం నంది అందుకున్నారు. సినిమాల ఎంపికలో ఆయన ఆచితూచి వ్యవహరించేవారు. గత ఏడాది డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో విడుదలైన వెబ్ సిరీస్ '9 అవర్స్'లో సీఐ రోల్ చేశారు. హీరోగా 'ఒకటో నంబర్ కుర్రాడు', 'యువ రత్న', 'భద్రాద్రి రాముడు', 'నందీశ్వరుడు' తదితర చిత్రాలు చేశారు. ఆ తర్వాత రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెట్టారు. 'యువగళం' పాదయాత్రలో పాల్గొనడానికి వెళ్ళడం, గుండెపోటుకు గురి కావడం, ఆ తర్వాత బెంగళూరు తరలించడం వంటి విషయాలు తెలిసినవే.