మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela) కథానాయకుడిగా నటించిన సినిమా 'ఆచార్య' (Acharya Movie). గత ఏడాది ఏప్రిల్ 29న విడుదల అయ్యింది. అయితే, ఆశించిన రిజల్ట్ ఇవ్వలేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రత్యేక పాత్రలో నటించిన చిత్రమిది. సినిమా విడుదలైన తర్వాత వివాదాలు, పరోక్ష ఆరోపణలతో వార్తల్లో నిలిచింది. ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చింది.


'ఆచార్య' సెట్‌లో అగ్ని ప్రమాదం
'ఆచార్య'లో మెజారిటీ సన్నివేశాలు టెంపుల్ టౌన్, ధర్మస్థలి అనే ప్రాంతంలో జరుగుతాయి. ఆ ధర్మస్థలిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంటలు వ్యాప్తి చెందడం గమనించిన చుట్టుపక్కల ప్రజలు దగ్గరలోని వట్టి నాగులపల్లి ఫైర్ స్టేషనుకు సమాచారం అందించారు. వాళ్ళు వెంటనే వచ్చి ఆర్పేశారు.


'ఆచార్య' కోసమే వేసిన సెట్
నిజానికి, ధర్మస్థలి అనే ఊరు ఏదీ లేదు. అది ఒక ఫిక్షనల్ టౌన్. సినిమా కోసం ప్రత్యేకంగా వేసిన సెట్. హైదరాబాద్ నగర శివార్లలోని కోకాపేటలోని చిరంజీవి కుటుంబానికి చెందిన 20 ఎకరాల స్థలంలో గుళ్ళు, గోపురాలు నిర్మించారు. ఆ సినిమా కంటే ముందు కొరటాల శివ దర్శకత్వం వహించిన సూపర్ స్టార్ మహేష్ బాబు 'భరత్ అనే నేను' చిత్రానికి వర్క్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వ రాజన్, 'ఆచార్య'కు కూడా పని చేశారు.  ఆయనే ఈ సెట్ వేశారు.
 
'ఆచార్య' సెట్ కాస్ట్ ఎంత?
'ఆచార్య'లో ఒక్క టెంపుల్ టౌన్ / ధర్మస్థలి సెట్ వేయడానికి 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం. అందులో చిరంజీవి, రామ్ చరణ్ స్టెప్పులు వేసిన 'భలే భలే బంజారా...', 'సానా కష్టం వచ్చిందే మందాకినీ' పాటలకు మళ్ళీ ప్రత్యేకంగా సెట్స్ వేశారు. విలేజ్ సెట్ ఇంకొకటి వేశారు. కేవలం సెట్స్ కోసమే పాతిక కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వ రాజన్ సినిమా విడుదల సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
 
సల్మాన్ ఖాన్ సినిమా షూటింగ్ చేశారా?
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన సినిమా 'కిసీ కా భాయ్, కిసీ కా జాన్' షూటింగ్ కొంత 'ఆచార్య' కోసం వేసిన ధర్మస్థలిలో చేశారని సమాచారం. ఆ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఆమె అన్నయ్యగా విక్టరీ వెంకటేష్ నటించారు. దక్షిణాది కుటుంబానికి చెందిన అన్నా చెలెళ్ళుగా కనిపించనున్నారు. ధర్మస్థలిలో కొన్ని మార్పులు చేసి పూజా హెగ్డే, వెంకటేష్, సల్మాన్ కనిపించే సన్నివేశాలు తెరకెక్కించారట.


Also Read అక్షయ్ కుమార్ పరువు తీసిన 'సెల్ఫీ' - పదేళ్ళలో వరస్ట్ ఓపెనింగ్! 
 
అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ధర్మస్థలిలో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆస్తి నష్టం ఎంత? అనేది ఇంకా అంచనాకు రాలేదు. చిరంజీవి  ఫ్యామిలీకి చెందిన స్థలం కావడంతో సెట్ తీయకుండా అలా ఉంచేశారు. సెట్ పాతబడటం, ఇటీవల ఎండలు ఎక్కువ కావడంతో ఎవరో సిగరెట్ కాల్చి పడేయడంతో ఫైర్ యాక్సిడెంట్ అయినట్లు వినికిడి. ఈ అగ్ని ప్రమాదం మీద చిత్ర బృందం ఏమీ స్పందించలేదు. ఆల్రెడీ షూటింగ్ చేసేసిన సెట్ కాబట్టి మౌనంగా ఉన్నారేమో!?


Also Read : రామ్ చరణ్ పక్కన నిలబడటమే అవార్డ్ - వైరల్ అవుతున్న హాలీవుడ్ నటి వీడియో