తమ్మారెడ్డి భరద్వాజ్ తాజాగా టీడీపీ గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. శుక్రవారం ఆయన యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోను విడుదల చేశారు. ఇటీవల ఆయనను ఒక టీడీపీ కార్యకర్త కలిశారని చెప్తూ.. చంద్రబాబు అరెస్ట్‌పై, టీడీపీ పరిస్థితిపై, టీడీపీతో జనసేన కూటమిపై తన అభిప్రాయాలను ఇన్‌డైరెక్ట్‌గా వెల్లడించినట్టు వీడియో చూస్తే అనిపిస్తోంది.
చంద్రబాబు అరెస్ట్‌తో టీడీపీ విన్..
చంద్రబాబు అరెస్ట్ వల్ల జనాల్లో ఒక జాలి ఏర్పడిందని, అందుకే ఈసారి ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని అభిమానులు, కార్యకర్తలు అనుకుంటున్నారని చెప్తూ తమ్మారెడ్డి ఈ వీడియోను మొదలుపెట్టారు. చంద్రబాబును అరెస్ట్ చేయాలనే ఆలోచన వైసీపీకి ఉన్నా.. అలా చేయడం వారికి ఆత్మహత్యతో సమానమని టీడీపీ కార్యకర్తలు బలంగా నమ్మారు. కానీ అనూహ్యంగా వైసీపీ ఒక అడుగు ముందుకు వేసి ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు కార్యకర్తలపై ప్రభావం పడిందని తమ్మారెడ్డి అన్నారు. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత పార్టీ అంతా కదిలి వస్తుంది అని నమ్మిన కార్యకర్తలకు ఎదురుదెబ్బే తగిలిందని అన్నారు, పార్టీ నాయకులు అసలు దీనిపై సరిగా స్పందించలేదని విమర్శించారు.
అవసరం కోసం చేతులు కలిపిన జనసేన..
టీడీపీ, జనసేన కూటమి ఆలోచన ఎప్పటినుండో ఉన్నా కూడా చంద్రబాబు అరెస్ట్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ వచ్చి టీడీపీకి అభయహస్తం ఇచ్చారని గుర్తుచేశారు తమ్మారెడ్డి. ఆయనంతట ఆయన గెలవలేరు కాబట్టి టీడీపీ దగ్గరకు వచ్చారని వ్యాఖ్యలు చేశారు. ఎప్పటినుండో టీడీపీతో కలిసి వైసీపీని అంతం చేయాలనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారని అన్నారు. కానీ మొదటిసారి చంద్రబాబును కలవడానికి పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడే సెటిల్ చేసుకొని ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. పేనుకు పెత్తనం ఇచ్చినట్టుగా పవన్ కళ్యాణ్‌కు పెత్తనం ఇచ్చారని టీడీపీ కార్యకర్తలు వాపోతున్నారని అన్నారు. పవన్ కళ్యాణే ఏరికోరి టీడీపీతో పొత్తుపొట్టుకున్నా కూడా చంద్రబాబు అరెస్ట్ అవ్వడంతో జనసేనతో కూటమి టీడీపీ అవసరమని, ఎవరూ దిక్కులేక తమ దగ్గరికి వచ్చారని జనసేన కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై వ్యాఖ్యలు చేస్తున్నారని బయటపెట్టారు. ఇవన్నీ టీడీపీ కార్యకర్తలను బాధించే విషయాలని తెలిపారు.
పవన్ అన్నాడు.. ఎన్‌టీఆర్ అనలేదు..
45 ఏళ్ల పార్టీ అయినా ఇప్పుడు టీడీపీకి దిక్కుమొక్కు లేదన్నట్టుగా పవన్ కళ్యాణ్ వచ్చి ఆదుకుంటున్నట్టుగా వ్యాఖ్యలు చేయడం కార్యకర్తలకు ఇబ్బందిగా ఉందని తమ్మారెడ్డి తెలిపారు. పవన్‌తో పొత్తు పెట్టుకోకుండా బాలకృష్ణ, అచ్చెన్నాయుడు లాంటి సీనియర్ నాయకులతోనే పార్టీని నడిపించి ఉంటే బాగుండేందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఎన్‌టీఆర్ కూడా ఎవరూ పిలవకపోయినా తానే స్వచ్ఛందంగా వస్తే బాగుండేదని అన్నారు. పవన్ కళ్యాణ్ వచ్చి నేనున్నాను అని చెప్పిన మాటనే ఎన్‌టీఆర్ చెప్తే బాగుండేదని తెలిపారు. లోకేశ్ కూడా చంద్రబాబు అరెస్ట్ విషయంలో సీరియస్‌గా లేరని వ్యాఖ్యలు చేశారు తమ్మారెడ్డి. ఢిల్లీ వెళ్లకుండా ఇక్కడే ఉండి ఉద్యమంలాగా నడిపిస్తే బాగుండేదని సలహా ఇచ్చారు. ఎవరూ బలంగా ఉద్యమం చేయకపోవడం వల్ల చంద్రబాబు అరెస్ట్ గురించి పెద్దగా ప్రకంపనలు జరగలేదని అన్నారు. చంద్రబాబు అరెస్ట్ అవ్వడం, టీడీపీలో సెకండరీ నాయకత్వం లేకపోవడం అనేది ఆ పార్టీని కష్టాల్లోకి తోసిందని తమ్మారెడ్డి భరద్వాజ్ తన అభిప్రాయాలను ముక్కుసూటిగా చెప్పేశారు.
Also Read: ఈ రోజుల్లో అవి సర్వసాధారణమే, అందుకు స్పెషల్ గా ఓ బ్యాచ్ ఉంటుంది - ట్రోలర్స్ కి ఇచ్చిపడేసిన భూమి!
Join Us on Telegram: https://t.me/abpdesamofficial