High Court Serious on Hero Vishal: తమిళ స్టార్ హీరో విశాల్‌పై న్యాయస్థానం మండిపడింది. లైకా ప్రొడక్షన్‌పై వివాదంపై, కేసు నేపథ్యంలో నేడు విచారణకు విశాల్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా నిర్మాణ సంస్థతో జరిగిన ఒప్పందంపై ప్రశ్నించగా విశాల్ ఇచ్చిన సమాధానంపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. విశాల్‌కు, ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌కు మధ్య కొద్ది రోజలుగా డబ్బు విషయంలో వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే.
తమ ఒప్పందం ప్రకారం విశాల్ డబ్బులు చెల్లించాలని.. కానీ ఇప్పుడు అదే ఎగ్గోట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ లైకా ప్రొడక్షన్స్ సంస్థ హైకోర్టును ఆశ్రయించింది. కేసు విచారణలో భాగంగా విశాల్ నేడు కోర్టుకు హాజరయ్యాడు. లైకా నిర్మాణ సంస్థతో జరిగిన ఒప్పందంపై విశాల్‌ను న్యాయమూర్తి ప్రశ్నించగా.. తాను ఖాళీ కాగితంపై సంతకం చేశానని, లైకా సంస్థతో అగ్రిమెంట్ జరిగిందన్న విషయమే తనకు తెలియదని సమాధానం ఇచ్చాడట. అతడిపై వ్యాఖ్యలపై జడ్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలివిగా సమాధానం చెబుతున్నారనుకుంటున్నారా? ఇదేం షూటింగ్ కాదు. సరిగ్గా బదులివ్వండి అని విశాల్‌కు చీవాట్లు పెట్టారట.
కాగా గతంలో విశాల్ హీరోగా లైకా ప్రోడక్షన్స్ సంస్థ నిర్మాణంలో 'పందెంకోడి 2' మూవీ తెరకెక్కింది. ఈ సినిమా సమయంలో విశాల్ లైకా ప్రొడక్షన్స్ సంస్థ వద్ద రూ. 21.29 కోట్లను అప్పుగా తీసుకున్నాడట. అయితే ఆ డబ్బు తిరిగి చెల్లించేంత వరకు తన సినిమా హక్కులను లైకాకే ఇవ్వాలనేది సదరు సంస్థ విశాల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ ఒప్పందాన్ని విశాల్ ఉల్లంఘించాడు. దీంతో విశాల్‌పై లైకా సీరియస్ అయ్యింది. డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇందుకు విశాల్ నిరాకరించడంతో ఈ వివాదం కాస్తా కోర్టు కేసు వరకు వెళ్లింది.
విశాలు తమ వద్ద డబ్బులు తీసుకుని ఇవ్వకపోడమే కాకుండా తమ ఒప్పందాన్ని ఉల్లంఘించాడంటూ లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ 2022లో మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. తొలిసారి వాదనలు విన్న ధర్మాసనం రూ. 15 కోట్లు డిపాజిట్ చేయాలని, తన ఆస్తి వివరాలను సమర్పించాలని విశాల్‍ను ఆదేశించింది. అప్పటి వరకు తన సినిమాలు థియేటర్లలో, ఓటీటీల్లో విడుదల చేయకూడదని పేర్కొంది. అయితే కోర్టు తీర్పును విశాల్ ఉల్లంఘించాడని జూన్ నెలలో కోర్టు ధిక్కరణ కేసు ఫైల్ చేసింది లైకా. ఈ పటిషన్‌పై తాజాగా విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా విశాల్‌ను ఒప్పందంపై న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనికి విశాల్ తాను కేవలం వైట్ పేపర్‌పైనే సంతకం చేశానని, లైకా సంస్థతో అగ్రిమెంట్ జరిగిందనే విషయం తెలియదంటూ సమాధానం ఇచ్చాడట.
ఆయన సమాధానం విన్న జడ్జ్ విశాల్‌పై అసహనం వ్యక్తం చేశారు. ‘ఖాళీ పేపర్ పై మీరెలా సంతకం చేశారు? అని ప్రశ్నిస్తూ.. ఈ విషయంలో మీరు తెలివిగా సమాధానం చెబుతున్నాననుకుంటున్నారా? ఇదేమీ సినిమా షూటింగ్ కాదు.. మాకు సరైన సమాధానం ఇవ్వండని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారట. అంతేకాదు పందెంకోడి 2 విడుదలకు ముందే డబ్బు తిరిగి ఇస్తానని మాటిచ్చారా? అని కూడా హైకోర్టు ప్రశ్నించగా.. విశాల్ సమాధానం ఇవ్వకుండ సైలెంట్ ఉన్నట్టు తెలుస్తోంది. అనంతరం లైకా సంస్థ దగ్గర డబ్బులు అప్పుగా తీసుకున్నట్లు విశాల్ అంగీకరిస్తూ.. ఈ కేసులో లైకా ప్రొడక్సన్స్ సమస్యను పరిష్కరించడానికి మధ్య వర్తిత్వాన్ని కోరినట్లు తెలుస్తోంది.