పాన్ ఇండియా చిత్రాల ట్రెండ్ మొదలయిన తర్వాత దర్శక హీరోలంతా ఇతర భాషల్లో క్రేజ్ తెచ్చుకొని, మార్కెట్ విస్తరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా కొందరు టాలీవుడ్ డైరెక్టర్స్ తమిళ హీరోలతో సినిమాలు చేస్తే, కోలీవుడ్ ఫిలిం మేకర్స్ తెలుగు హీరోలతో వర్క్ చేస్తున్నారు. అయితే అందులో తెలుగు హీరోస్ & తమిళ్ డైరెక్టర్స్ కాంబినేషన్స్ కు సక్సెస్ పర్సెంటేజ్ చాలా తక్కువగా వుంది. వారికి హిట్లు కంటే ఫ్లాప్ చిత్రాలే ఎక్కువగా వున్నాయి. కోలీవుడ్ దర్శకులతో ఫ్లాప్స్ చవిచూసిన ఇప్పటి హీరోలెవరో చూద్దాం!


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు 'ఖుషి' వంటి కల్ట్ క్లాసిక్ సినిమా అందించాడు కోలీవుడ్ డైరెక్టర్ ఎస్. జె సూర్య. కానీ ఆ తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన 'కొమురం పులి' మూవీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా మిగిలింది. పవన్ తో 'తొలి ప్రేమ' వంటి మెమరబుల్ చిత్రాన్ని తీసిన డైరక్టర్ కరుణాకరన్.. 'బాలు' తో మర్చిపోలేని ఫ్లాప్ సినిమా ఇచ్చాడు. అలానే ధరణి దర్శకత్వంలో చేసిన 'బంగారం'.. విష్ణు వర్ధన్ డైరెక్షన్ లో నటించిన 'పంజా' చిత్రాలు కూడా పవన్ కు పరాజయాలే మిగిల్చాయి.


కోలీవుడ్ డైరక్టర్ తో సూపర్ స్టార్ మహేష్ బాబుకు రెండు సార్లు చేదు అనుభవాలే మిగిలాయి. ఎస్జే సూర్య దర్శకత్వంలో చేసిన 'నాని' సినిమా ఫ్లాప్ అయింది. 'స్పైడర్' చిత్రంతో నేరుగా తమిళ నాట అడుగు పెట్టాలని ప్లాన్ చేసుకున్న మహేశ్ కు నిరాశే ఎదురైంది. మురుగదాస్ డైరెక్షన్ లో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించిన ఈ సైకో థ్రిల్లర్ డిజాస్టర్ గా నిలిచింది.


గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 'ఏమాయ చేసావే' వంటి కల్ట్ క్లాసిక్ సినిమా చేసిన యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య.. 'సాహసం శ్వాసగా సాగిపో' తో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయారు. కృష్ణ మారిముత్తు అనే తమిళ్ డైరెక్టర్ తో చేసిన 'యుద్ధం శరణం' సినిమా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు లేటెస్ట్ గా 'కస్టడీ' తో స్ట్రెయిట్ గా కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన చైతూకి గ్రాండ్ వెల్ కమ్ లభించలేదు. వెంకట్ ప్రభుతో తెలుగు తమిళ భాషల్లో రూపొందిన ఈ బైలింగ్వల్ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వేటలో వెనకబడిపోయింది. ఫస్ట్ వీకెండ్ లో కలెక్షన్స్ అంతంత మాత్రంగానే వచ్చాయి.


నాగచైతన్య కంటే ముందు నేచురల్ స్టార్ నాని కూడా తమిళ్ డైరెక్టర్స్ తో కలిసి ఫ్లాప్స్ అందుకున్నాడు. అంజనా అలీఖాన్ దర్శకత్వంలో 'సెగ' అనే ఫ్లాప్ మూవీ చేసిన నాని.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ తో 'ఏటో వెళ్లిపోయింది మనసు' వంటి మరో పరాజయం చవిచూసాడు. ఇక సముద్రఖని డైరెక్షన్ లో నటించిన 'జెండా పై కపిరాజు' చిత్రం నిరాశే మిగిల్చింది.


మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన 'శంఖం' సినిమాతో డైరక్టర్ గా పరిచయమైన సిరుతై శివ.. ఆ వెంటనే 'సౌర్యం' చిత్రం చేశాడు. అలానే మాస్ మహారాజా రవితేజ హీరోగా 'దరువు' సినిమా రూపొందించాడు. ఇవేవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాలు సాధించలేదు. మరో తమిళ్ డైరక్టర్ సముద్రఖనితో చేసిన 'శంభో శివ శంభో' సినిమా కూడా రవితేజకు హిట్ ఇవ్వలేదు.


ఉస్తాద్ రామ్ పోతినేని అప్పట్లో శరవణన్ అనే తమిళ దర్శకుడితో 'గణేష్.. జస్ట్ గణేశ్' అనే ఫ్లాప్ మూవీ చేశాడు. గతేడాది 'ది వారియర్' అనే బైలింగ్వల్ సినిమాతో నిరాశే ఎదురైంది. లింగుస్వామి దర్శకత్వంలో నటించిన ఈ తెలుగు తమిళ చిత్రం పరాజయం పాలైంది. ఇక రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కోలీవుడ్ డైరక్టర్ ఆనంద్ శంకర్ తో కలసి 'నోటా' వంటి డిజాస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే.


సూపర్ సీనియర్ హీరోలైన మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ లకు కూడా తమిళ దర్శకులతో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. త్వరలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న 'గేమ్ చేంజర్' మూవీతో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. అలానే సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలసి 'బ్రో' (ఇంకా అధికారికంగా ప్రకటించలేదు) అనే రీమేక్ సినిమా చేస్తున్నారు. మరి ఈ చిత్రాలు ఎలాంటి ఫలితాలను అందుకుంటాయో వేచి చూడాలి. 


 Read Also: వీకెండ్‌లోనూ అదే పరిస్థితి? ‘కస్టడీ’కి కలెక్షన్స్ కష్టాలు