‘ది కేరళ స్టోరీ’ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన నటి అదా శర్మ నిన్న(ఆదివారం) రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. ‘ది కేరళ స్టోరీ’ టీమ్ ముంబైలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో వారి వాహనం యాక్సిడెంట్ కు గురయ్యింది. వెంటనే స్థానికులు అదా శర్మతో పాటు వాహనంలో ప్రయాణిస్తున్న వారిని హాస్పిటల్ కు తరలించారు. అయితే, ఈ ప్రమాదంలో వారికి స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
యాక్సిడెంట్ గురించి ట్విట్టర్ ద్వారా స్పందించిన అదా శర్మ
ఇక తన యాక్సిడెంట్ గురించి అదా శర్మ ట్విట్టర్ వేదికగా స్పందించింది. తన యోగ క్షేమాల గురించి ఆరా తీస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పింది. “నేను రోడ్డు ప్రమాదంలో గాయపడ్డానని తెలియడంతో చాలా మంది నా యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకుంటున్నారు. చాలా మెసేజ్ లు వస్తున్నాయి. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. ‘కేరళ స్టోరీ’ టీమ్ సైతం క్షేమంగానే ఉంది. మేజర్ యాక్సిడెంట్ ఏమీ కాదు. ఆందోళన చెందాల్సిన పని లేదు” అని ట్వీట్ చేసింది.
హిందూ ఏక్తాయాత్రకు రాలేకపోయిన ‘ది కేరళ స్టోరీ’ టీమ్
ఈ ప్రమాదం కారణంగా ‘ది కేరళ స్టోరీ’ టీమ్ పలు కార్యక్రమాలకు హాజరు కాలేదు. వాస్తవానికి నిన్న కరీంగనర్‌లో జరిగిన హిందూ ఏక్తాయాత్రకు ‘ది కేరళ స్టోరీ’ టీమ్ హాజరు కావాల్సి ఉంది. కానీ, ఈ ప్రమాదంతో రాలేకపోతున్నట్లు సినిమా దర్శకుడు సుదీప్తో సేన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
బాక్సాఫీస్ దగ్గర ‘ది కేరళ స్టోరీ’ సరికొత్త రికార్డు
ఎన్నో వివాదాల నడుమ మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ది కేరళ స్టోరీ’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డు నెలకొల్పింది. సుదీప్తోసేన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి విపుల్ అమృత్ లాల్ షా నిర్మాతగా వ్యవహరించారు. విడుదలకు ముందు నుంచే పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఎన్ని ఆందోళనలు కొనసాగినా సక్సెస్ ఫుల్ గా ప్రదర్శింపబడుతోంది. బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. తాజాగా ‘ది కేరళ స్టోరీ’ చిత్రం వసూళ్ల విషయంలో కొత్త రికార్డును సాధించింది. ఇప్పటి వరకు కంగనా రనౌత్, అలియా భట్, విద్యాబాలన్ నటించిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలకు ఉన్నాయి. ప్రస్తుతం వీరి చిత్రాలను అధిగమించి ముందుకు దూసుకెళ్తోంది ఆదా శర్మ ‘ది కేరళ స్టోరీ’ మూవీ. తొలివారంలో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ. 81 నికర వసూళ్లు సాధించింది. బాలీవుడ్ చరిత్రలోనే అత్యధికంగా ఓపెనింగ్ పొందిన లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా నిలిచింది. అదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాలో మహిళలే కీలక పాత్రలు పోషించారు.
Read Also: రియల్ లైఫ్‌లో శ్రీమంతుడిలా శివన్న దంపతులు - కర్ణాటకలో ప్రభుత్వ పాఠశాలను...