బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 2020లో మరణించారు. ముంబై సబర్బన్ బాంద్రాలోని తన అపార్ట్‌ మెంట్‌లో శవమై కనిపించాడు. ఎంతో సినీ భవిష్యత్ ఉన్న నటుడు 34 ఏళ్ల వయసులోనే లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఆయన మరణంపై ఇప్పటికీ సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఎందుకు చనిపోయాడు అనే విషయాన్ని దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ కూడా తేల్చలేపోతోంది. ఇప్పటికీ విచారణ కొనసాగిస్తూనే ఉంది.


న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సుశాంత్ సింగ్ తండ్రి


ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాల ఆన్ లైన్ స్ట్రీమింగ్ ను అడ్డుకోవాలని సుశాంత్ తండ్రి కృష్ణ కిశోర్ సింగ్  వేసిన పిటిషన్ ను గతంలోనే ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. తాజాగా గత తీర్పుపై  అప్పీల్ కు వెళ్లారు.  చనిపోయిన తన కుమారుడి పేరుతో లాభాలను పొందేందుకు కొందరు నిర్మాతలు ప్రయత్నిస్తున్నారని  కృష్ణ కిశోర్ సింగ్ కోర్టుకు తెలిపారు. ఈ అప్పీల్‌పై జస్టిస్ యశ్వంత్ వర్మ, ధర్మేష్ శర్మలతో కూడిన ధర్మాసనం నోటీసు జారీ చేసింది.


ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం అవుతున్న 'న్యాయ్: ది జస్టిస్' చిత్రం తన అబ్బాయితో పాటు తమ పరువు నష్టం కలిగించేలా ఉందని రాజ్ పుత్ తండ్రి గత నెలలో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు సంబంధించిన వ్యక్తిగత హక్కులను ఈ సినిమా ఉల్లంఘించిందని కేసు వేశారు. అప్పీలుదారు తరఫు న్యాయవాది వరుణ్ సింగ్ వాదనలు వినిపిస్తూ,  బాలీవుడ్ స్టార్ వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘించడమే కాకుండా, అతని జీవితం ఆధారంగా తీసిన సినిమా కుటుంబ సభ్యుల గోప్యతకు భంగం కలిగిస్తుందన్నారు. ఈ సినిమాను అనుమతించకూడదని న్యాయమూర్తిని కోరారు. అయితే, వ్యక్తి మరణించిన తర్వాత గోప్యత హక్కును క్లెయిమ్ చేయలేమని చిత్ర నిర్మాతల తరఫు న్యాయవాది తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి కేసును కొట్టివేశారు. తాజా అప్పీలు నేపథ్యంలో నవంబర్ 16న తదుపరి విచారణ జరగనుంది.


అనుమానాస్పద రీతిలో సుశాంత్ మృతి


2020 జూన్‌ 14న ముంబైలోని తన నివాసంలో సుశాంత్ అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని చనిపోయాడు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయనది హత్య అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు సీబీఐ చేతికి వెళ్లింది. ఆయన మృతికి కారణాలు తెలుసుకునేందుకు సీబీఐ విచారణ కొనసాగిస్తోంది. సుశాంత్  మరణానికి సంబంధించిన కారణాలపై స్పష్టత కోసం సోషల్ మీడియాలో ఆయన డిలీట్ చేసిన పోస్టులు, చాట్స్, ఈ-మెయిల్స్ వివరాలను పరిశీలిస్తున్నారు. ఈ వివరాలు తెలిస్తే ఆయన మృతికి గల కారణాలు తెలిసే అవకాశం ఉందని  భావిస్తున్నారు.  డిలీట్ చేసిన డేటాను తిరిగి పొందేందుకు టెక్ సంస్థలు అయిన గూగుల్, ఫేస్‌బుక్ ను 2021లోనే సీబీఐ అధికారులు సంప్రదించారు. సుశాంత్ డిలీట్ డేలా ఇవ్వాలని కోరారు. అయితే, ఆ సంస్థల నుంచి వచ్చే సమాచారం కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చే డేటా ఆధారంగా కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సీబీఐ అధికారులు భావిస్తున్నారు. 


Read Also: ఆస్పత్రిలో ‘ఠాగూర్‌’ సినిమా సీన్ చూపించారు - శ్రీహరి మరణం వెనక అసలు కారణం చెప్పిన డిస్కో శాంతి









Join Us on Telegram: https://t.me/abpdesamofficial