మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ సినిమాలతో ఆడియన్స్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ఇప్పుడు వరుస పాన్ ఇండియా సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలోనే దుల్కర్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కిగ్ ఆఫ్ కోథా' విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాతో పాటు నెట్ ఫ్లిక్స్ నిర్మించిన 'గన్స్ అండ్ గులాబ్స్' అనే వెబ్ సిరీస్ లో నటించాడు దుల్కర్. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా తన తండ్రి మమ్ముట్టిని ఇండస్ట్రీలో ఎప్పుడూ ఆదర్శంగానే తీసుకుంటానని, అలాగే తన తండ్రి నటించిన సినిమాలను ఎప్పుడు రీమేక్ చేయనని చెప్పాడు.


నిజానికి దుల్కర్ సల్మాన్ ఇండస్ట్రీకి రాకముందు దుబాయ్ లోని ఓ నిర్మాణ సంస్థలో బిజినెస్ మేనేజర్ గా తన కెరీర్ స్టార్ట్ చేశాడు. అయితే సినిమాలపై, నటనపై ఉన్న మక్కువ అతన్ని ఉద్యోగం వదిలేసి తండ్రి అడుగుజాడల్లో నడిచేలా చేశాయి. తాజాగా లైవ్ షో లో పాల్గొన్న దుల్కర్ సల్మాన్ ని అతని ఇన్స్పిరేషన్ గురించి అడిగినప్పుడు.. ‘‘సినిమా పరిశ్రమలో నా తండ్రి మమ్ముట్టి నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్’’ అని వెల్లడించాడు. తన కెరీర్ ని బిజినెస్ మేనేజర్ గా స్టార్ట్ చేసినప్పటికీ ఆ తర్వాత నటనపై ఉన్న ఇష్టంతో నటుడిగా మారాలని నిర్ణయించుకున్నప్పుడు తన తండ్రి తనకు ఎంతో సపోర్ట్ చేశారని" చెప్పాడు. ఇక ఆ తర్వాత మీ తండ్రి సినిమాల్లో ఏదైనా రీమేక్ చేస్తారా? అని అడిగినప్పుడు తన సమాధానం తో అందరిని ఆశ్చర్యపరిచాడు.


ప్రస్తుతం ఇండస్ట్రీలో పాటలు, సినిమాల రీమేక్లు, రీక్రియేషన్స్ నడుస్తున్న రోజుల్లో దుల్కర్ సల్మాన్ వీటి గురించి మాట్లాడుతూ.."అలాంటిదేమీ లేదు. నేను రీమేక్ లను అస్సలు నమ్మను. ఒకప్పటి క్లాసిక్ సినిమాలను టచ్ చేయకుండా వదిలేయాలని నేను భావిస్తున్నాను. నిజానికి సంగీతం కానీ సినిమాలు కానీ రీమేక్ చేయకూడదు" అంటూ చెప్పుకొచ్చాడు. ఇంకా తన రాబోయే సిరీస్ 'గన్స్ అండ్ గులాబ్' గురించి అలాగే దీపికా పదుకొనేతో తన ఫ్యాన్ బాయ్ మూమెంట్ గురించి మరిన్ని విశేషాలను లైవ్ షో లో పంచుకున్నారు.


కాగా గన్స్ అండ్ గులాబ్స్ సిరీస్ 1990 ప్రారంభంలో గులాబ్ గంజ్ అనే పట్టణంలో జరిగిన సంఘటన ఆధారంగా తెరకెక్కింది. 'ఫ్యామిలీ మెన్', 'ఫర్జి' వంటి వెబ్ సిరీస్ లను తెరకెక్కించిన రాజ్ అండ్ డీకే ఈ సిరీస్ ని రూపొందించారు. కామెడీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్లో దుల్కర్ సల్మాన్ తో పాటు రాజ్ కుమార్ రావు, ఆదర్శ్ గౌరవ్, గౌతమ్ శర్మ, గౌరవ శర్మ, గుల్షన్ దేవ్య ప్రధాన పాత్రలు పోషించారు. ఆగస్టు 18 నుండి నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ తో పాటు దుల్కర్ సల్మాన్ నటించిన గ్యాంగ్ స్టార్ డ్రామా 'కిగ్ ఆఫ్ కోథా' ఆగస్టు 24న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కానుంది. అభిలాష్ జోషి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.


Also Read : 200 మంది ప్రెగ్నెంట్ మహిళల కోసం 'మిస్టర్ ప్రెగ్నెంట్' స్పెషల్ షో - సోహెల్ సినిమాకి అదిరిపోయే రెస్పాన్స్!





Join Us on Telegram: https://t.me/abpdesamofficial