బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొని ఆడియన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న సోహెల్ హీరోగా మారి ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సోహెల్ నటించిన తాజా చిత్రం 'మిస్టర్ ప్రెగ్నెంట్. ఒక పురుషుడు ప్రెగ్నెంట్ అయితే ఎలా ఉంటుంది అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో డైరెక్టర్ శ్రీనివాస్ వింజనంపాటి ఈ సినిమాని తెరకెక్కించారు. ఇప్పటికే మూవీ టీం డిఫరెంట్ ప్రమోషన్స్ తో ఆడియన్స్ లో సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది. అన్ని కార్యక్రమాలను పూర్తిచేసుకుని శుక్రవారం ఆగస్టు 18న థియేటర్స్ లో ఈ సినిమా విడుదలైంది. అయితే రిలీజ్ కు ముందు గురువారం రోజున 200 మంది ప్రెగ్నెంట్ మహిళలకు మేకర్స్ ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్ షో ని ప్రదర్శించారు.
ఈ స్పెషల్ షో చూసిన ఆడియన్స్ నుంచి సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. సినిమా కాన్సెప్ట్ బావుందని స్పెషల్ ప్రీమియర్ షో చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇంతవరకు ఈ జోనర్ సినిమాలు రాలేదని, ఇలాంటి సినిమా చేయాలంటే గట్స్ ఉండాలంటూ ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి స్పెషల్ షో నుంచే మంచి రెస్పాన్స్ వస్తున్న 'మిస్టర్ ప్రెగ్నెంట్' సినిమాకు శుక్రవారం థియేటర్స్ లో కూడా ఇలాంటి రెస్పాన్స్ వస్తుందా లేదా అనేది చూడాలి.
ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. "అమెరికాలో థామస్ అనే పురుషుడు గర్భం దాల్చడాని చదివాను. అప్పటినుంచి ఈ జానర్ లో ఓ సినిమా తీయాలని అనుకున్నా. ప్రెగ్నెంట్ మహిళల కష్టాలు అనే కోణంలో తీస్తే అది డాక్యుమెంటరీ అవుతుంది. అందుకే ఈ కథలో మంచి లవ్ స్టోరీ కూడా యాడ్ చేశాను. పురుషుడు ప్రెగ్నెంట్ అవ్వడం అనేది అందరిని ఆశ్చర్యపరుస్తుంది. కథలో ఉన్న ఎమోషన్స్ నమ్మి ఈ సినిమా తీశాను. తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది" అని అన్నారు. కాగా ఈ సినిమాలో హీరోగా ముందుగా నాచురల్ స్టార్ నాని, విశ్వక్ సేన్ లను అనుకున్నారట. కానీ కొన్ని కారణాలవల్ల అది కుదరలేదని దర్శకుడు చెప్పారు. ఇక సోహెల్ తనకు ముందు నుంచే తెలుసని, బిగ్ బాస్ కి వెళ్ళాక సోహెల్ ఈ కథకు కచ్చితంగా న్యాయం చేస్తాడనే నమ్మకంతో తనని హీరోగా ఫైనల్ చేసినట్లు తెలిపారు.
మైక్ మూవీస్ బ్యానర్ పై వెంకట్ అన్నపరెడ్డి, సజ్జల రవీందర్ రెడ్డి, అప్పిరెడ్డి నిర్మించిన ఈ సినిమాలో సోహెల్ సరసన రూప కొడవాయూర్ హీరోయిన్గా నటించగా.. బ్రహ్మాజీ, సుహాసిని, రాజ రవీంద్ర తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఇక సోహెల్ హీరోగా మంచి సక్సెస్ కోసం చూస్తున్నాడు. అతను నటించిన గత చిత్రం 'ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు' అనే సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, మీనా కీలక పాత్రలు పోషించారు. మార్చి 3న విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పరాజయాన్ని అందుకుంది. మరి ఈ 'మిస్టర్ ప్రెగ్నెంట్' సినిమాతోనైనా సోహెల్ కి సక్సెస్ దక్కుతుందేమో చూడాలి.
Also Read : ప్రభాస్ 'కల్కి 2898 AD' లో దుల్కర్ సల్మాన్ - ఇన్ డైరెక్ట్‌గా హింట్ ఇచ్చిన హీరో!